విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన గత వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాంతానికి ఏం చేసింది? సింపుల్ గా చెప్పాలంటే రుషికొండకు గుండుకొట్టింది. ప్రకృతి సహజ సంపదని నాశనం చేసి కొండపై భవనం నిర్మించింది. పోనీ అది ప్రజలకోసమా లేక, ప్రజావసరాలకోసమా అంటే అదీ కాదు. కనీసం ఆ బిల్డింగ్ వైపు జనాలను కూడా వెళ్లనీయలేదు గత ప్రభుత్వం. అప్పటి ప్రతిపక్ష నేతల్ని ఆవైపు వెళ్లేందుకు అనుమతించలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాతే అసలు ఆ భవనంలో ఏముంది? ఎన్ని రాజవైభోగాలున్నాయో ప్రజలకు తెలిసింది. ఇక కూటమి విషయానికొద్దాం. అమరావతే ఏకైక రాజధాని అంటున్న కూటమి ప్రభుత్వం విశాఖకు ఏం చేసింది. ఏడాది పాలనలోనే దేశంలోనే అతి పెద్దదైన గాజు వంతెనను విశాఖలో ఏర్పాటు చేసింది. విశాఖను ఐటీ హబ్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరిక్కడ ఎవరు గొప్ప అనే ప్రశ్న వస్తే విశాఖ వాసులు కచ్చితంగా మరోసారి కూటమికే జై కొడతారు అనుకోవడంలో సందేహం లేదు.
కూటమి ఐకానిక్ వంతెన..
విశాఖకు మరో అరుదైన ఘనతను సాధించి పెట్టింది కూటమి ప్రభుత్వం. మహా విశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై 55 మీటర్లు పొడవుతో గాజు వంతెనను నిర్మించింది. దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన ఇదే కావడం విశేషం. ఒకేసారి దీనిపై 100 మంది నిలబడగలరు. అయితే భద్రత దృష్ట్యా ఒకేసారి కేవలం 40 మందికి మాత్రమే ఒకేసారి అనుమతి ఇస్తున్నారు. ఈ వంతెన పైకి ఎక్కిచూస్తే చుట్టూ ఎత్తయిన కొండలు కనపడతాయి. వంతెన కింద లోయ, దూరంగా సముద్రం కనపడతాయి. వంతెనపైకి ఎక్కితే గాల్లో తేలియాడుతున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఈ వంతెన విశాఖకు సరికొత్త ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
చిత్తశుద్ధి ఎవరిది?
విశాఖకు అది చేస్తాం, ఇది చేస్తామంటూ కేవలం మాటలు చెప్పి మభ్యపెట్టిందని వైసీపీపై స్థానికులు మండిపడుతున్నారు. ఆ కసినంతా ఎన్నికల ఫలితాల్లో చూపించారు. అమరావతిలో కూటమికి గంపగుత్తగా ఓట్లుపడ్డాయంటే అర్థముంది. కానీ విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్ ని కూడా ఆ ప్రాంత వాసులు దగ్గరకు తీయలేదంటే అర్థమేంటి? విశాఖ కూడా వైసీపీని దూరం పెట్టింది. తమకు కావాల్సింది రాజధాని అనే పేరు కాదని, తమ ప్రాంతానికి ఉన్న సహజ సిద్ధమైన పేరుని దూరం చేయకూడదని మాత్రమే విశాఖ వాసులు ఆలోచించారు. అందుకే అమరావతిలో లాగా విశాఖలో రాజధాని పేరుతో ఉద్యమాలు జరగలేదు. అమరావతే ఏకైక రాజధాని అని కూటమి ప్రకటించినా విశాఖలో ఎవరూ రోడ్డెక్కలేదు. తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందలేదు.
మరింతగా పర్యాటక శోభ..
కూటమి ప్రభుత్వం విశాఖ ప్రాధాన్యాన్ని ఏమాత్రం తగ్గించడంలేదు. అమరావతి రాజధాని అయినా, విశాఖలో అభివృద్ధికి కూటమి ఊతం ఇస్తోంది. ఐటీ కంపెనీలకు విశాఖనే కేరాఫ్ అడ్రస్ గా మారుస్తోంది. ఇప్పటికే ఐటీ సెక్టార్లో అనేక ప్రముఖ కంపెనీలు విశాఖకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీంతో పాటు ఈ ప్రాంతానికి పర్యాటక శోభ మరింత పెంచేందుకు కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆ ప్రయత్నాల ఫలితమే దేశంలోనే అతి పెద్ద గాజు వంతెనను విశాఖలో ఏర్పాటు చేయడం. ఎన్నికల నాటికి విశాఖ అభివృద్ధిపై తమ చిత్తశుద్ధిని పూర్తి స్థాయిలో నిరూపించుకుంటామని అంటున్నారు కూటమి నేతలు.