Lady Aghori News: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి లేడీ అఘోరీ గురించి ఊహించని వార్తలు వినిపిస్తున్నాయి. ఆలయాల వద్ద, రోడ్లపైన నానా హంగామా, ఆధ్యాత్మిక ప్రకటనలు చేస్తూ హల్‌చల్ చేస్తూ లేడీ అఘోరీ వార్తల్లో తెగ వైరల్ అయ్యింది. ఆమె ఇటీవల మరింత ఆసక్తికరమైన చర్చకు దారి తీసేందుకు కారణమైంది. ఇటీవల మంగళగిరికి చెందిన బీటెక్ చదువుతున్న శ్రీవర్షిణీ అనే యువతి లేడీ అఘోరీ వెంట వెళ్లిపోయిన విషయం తెలిసిందే. శ్రీవర్షణి నాగ సాధువుల్లో చేరతానని కూడా ప్రకటించింది.
అయితే, శ్రీ వర్షిణి, లేడీ అఘోరీతో వెళ్లడంపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ‘లేడీ అఘోరీ మా కూతురిని వశపరుచుకుంది. కిడ్నాప్ చేసింది. మత్తుమందు ఇచ్చి లోబరుచుకుంది” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి చేసినా శ్రీ వర్షిణి ఇంటికి రావడం లేదని, ఫోన్ చేయడం లేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
సోమనాథ్ టెంపుల్ కి శ్రీవర్షణీ, లేడీ అఘోరీ..
ప్రస్తుతం శ్రీవర్షిణి, లేడీ అఘోరీతో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ్ టెంపుల్ చేరుకున్నారు. అక్కడ నుంచి వారిద్దరూ కలిసి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో లేడీ అఘోరీ మాట్లాడుతూ.. ‘మా గురించి ఎవరేమి అనుకున్నా మేం పట్టించుకోం. మేమేంటో మాకు తెలుసు. ఆ భగవంతుడికి తెలుసు. నన్ను ఎవరూ నమ్మొద్దు, నా దగ్గరకు రావొద్దు. మమ్మల్ని ఆనందంగా ఉండనివ్వండి. నా పోరాటం అంతా సనాతన ధర్మం కోసమే’ అని లేడీ అఘోరీ చెప్పుకొచ్చింది. శ్రీవర్షిణీ మాట్లాడుతూ.. ‘ఫస్ట్ జ్యోతిర్లంగాన్ని దర్శించుకున్నాం. స్వామి వారి దర్శనం చాలా చక్కగా జరిగింది. తర్వాత మేము ఉజ్జయినికి వెళ్తున్నాం. అక్కడకు వెళ్లాక మరో వీడియో రిలీజ్ చేస్తాం’ అని చెప్పుకొచ్చింది.
నా బిడ్డ సచ్చింది అనుకుంటాం: తండ్రి కోటయ్య
అయితే.. శ్రీవర్షణీ తండ్రి మరోసారి కోటయ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘శ్రీ వర్షణీతో ఇక మాకు ఎలాంటి సంబంధం లేదు. నా కూతురు చనిపోయిందని అనుకుంటాం. అఘోరీ పై కేసు పెట్టడానికే పోలీసులు భయపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో ఆడపిల్లలను ట్రాప్ చేస్తున్నారని గత ప్రభుత్వాన్ని నిందించారు. మరి ఆయన ప్రభుత్వం హయాంలో నా కూతురు అపహరించబడితే.. ఆదుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై స్పందించాలని కోరుతున్నా. రాజధాని మంగళగిరి ప్రాంతం అమ్మాయి ఇలా వెళ్లడమేంటి..? అని అయినా ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి’ శ్రీ వర్షణి తండ్రి కోటయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
‘లేడీ అఘోరీని రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. లేడీ అఘోరీ కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయినా పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదు. శ్రీ వర్షణీని ఇప్పటికైనా మా దగ్గరకు రప్పించండి. మేం బయట తిరగలేకపోతున్నాం. ఊరు వదిలెళ్లి పోతున్నాం’ అని కోటయ్య ఆందోళన వ్యక్తం చేశాడు.
ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1003 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా రెండు రోజులే గడువు..