రెడ్ బుక్ అంటూ ఏ ముహూర్తాన నారా లోకేష్ పేర్లు నోట్ చేసుకోవడం మొదలు పెట్టాడో కానీ.. దేశ రాజకీయాల్లో ఈ రెడ్ బుక్ ఇప్పుడు ఓ సంచలనంగా మారింది. ఏకంగా ఢిల్లీలోనే ప్రతిపక్ష వైసీపీ రెడ్ బుక్ అరాచకాలంటూ ధర్నా చేసింది. అటు తెలంగాణలో కూడా తాము రెడ్ బుక్ పెట్టి పేర్లు రాసుకుంటున్నామని చెపుతున్నారు బీఆర్ఎస్ నేతలు. తాజాగా వైసీపీ కూడా ఈ రెడ్ బుక్ కి పోటీగా బ్లూ బుక్ తీసుకొస్తామంటూ హెచ్చరిస్తోంది. ప్రస్తుతానికి దాన్ని వైసీపీ రెడ్ బుక్ అనాలేమో. జగన్ అధికారికంగా రెడ్ బుక్ బయటకు తీశారో లేదో తెలియదు కానీ.. ఆ పార్టీ నేతలు మాత్రం ఆల్రడీ రెండు పేర్లు అందులో యాడ్ చేశారు. వారిద్దర్నీ వదిలిపెట్టేది లేదంటున్నారు.
సీమరాజా
వైసీపీ నేతల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వారిలో ప్రముఖంగా వినపడుతున్న పేర్లు సీమరాజా, కిరాక్ ఆర్పీ. ఇందులో సీమరాజా కాస్త పాలిష్డ్ గా తనని తాను వైసీపీ అని చెప్పుకుంటూనే సొంత పార్టీ నేతల్ని ఎండగడుతున్నట్టుగా సెటైర్లు పేలుస్తుంటారు. ఎన్నికల సమయంలో కూడా సీమరాజా వీడియోలో బాగా పాపులర్ అయ్యాయి. ఎన్నికల తర్వాత ఇక సబ్జెక్ట్ లు పెద్దగా ఉండవని అనుకున్నా కూడా.. ఆయన వెనక్కి తగ్గలేదు. జగన్ ని తిరిగి సీఎం చేయాలని నిన్న మొన్నటి వరకు అనేవారు, ఆ తర్వాత జగన్ ని ఏకంగా పీఎంని చేయడమే తన ధ్యేయం అంటూ వైసీపీ నేతలకు మరింతగా మంట పెడుతున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు.. సీమరాజా వ్యవహారంతో బాగా విసిగిపోయారు. సీమరాజాను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు కానీ, పెద్దగా ఫలితం లేదు. అయనా కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా పదే పదే పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు అంబటి.
Ambati Rambabu Mass Warning To Kirak RP🔥
కిరాక్ ఆర్పీ ఒకటి గుర్తు పెట్టుకో ఇప్పుడు ఎన్ని వీడియోస్ అయిన చేసుకో.
నీ ఫ్యూచర్ నాకు అర్ధమవుతుంది.
– అంబటి రాంబాబు pic.twitter.com/kJyQxf126K
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) May 5, 2025
కిరాక్ ఆర్పీ
ఇక కిరాక్ ఆర్పీ సంగతి సరేసరి. ఎన్నికల సమయంలో నెల్లూరు టీడీపీ నేతలకు మద్దతుగా ప్రచారంలోకి దిగిన బజర్దస్త్ ఆర్పీ.. ముఖ్యంగా రోజాని టార్గెట్ చేస్తూ పొలిటికల్ పంచ్ లు విసిరేవారు. రోజా ఎవర్ని విమర్శించినా, వారి తరపున కిరాక్ ఆర్పీ రియాక్ట్ అయ్యేవారు. ఆర్పీ విమర్శలు కాస్త శృతిమించినట్టు అనిపించినా.. రోజా నేరుగా ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అయితే ఆమె తరపున ఇప్పుడు అంబటి రాంబాబు తెరపైకి వచ్చారు. సీమరాజా, కిరాక్ ఆర్పీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అంబటి. పోలీసులు కేసు రిజిస్టర్ చేయకపోతే.. వారిపై చర్యలకోసం తాను హైకోర్ట్ కి అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తానని, తానే కోర్టుల్లో వాదిస్తానని చెబుతున్నారు అంబటి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసినవారు, బూతులతో విరుచుకుపడినవారు కొందరు ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. కొందరు బెయిల్ పై బయట ఉన్నారు. కూటమి తరపున విమర్శలు చేస్తున్నవారు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా కాస్త జాగ్రత్త పడటం ఇక్కడ విశేషం. అయినా కూడా ఇటీవల ఓ టీడీపీ కార్యకర్త, జగన్ సతీమణిపై చేసిన విమర్శలకు కటకటాల వెనక్కు వెళ్లాల్సి వచ్చింది.
మొత్తమ్మీద.. అప్పట్లో వైసీపీ ఘాటు విమర్శలతో పోల్చి చూస్తే, ఇప్పుడు కూటమి నేతలు లైన్ దాటకుండానే వైసీపీ నేతలకు మంట పెడుతున్నారు. వైసీపీకి టార్గెట్ గా మారిన వారిలో ప్రస్తుతానికి సీమరాజా, కిరాక్ ఆర్పీ పేర్లు బలంగా వినపడుతున్నాయి. వీరిపై కేసులు పెట్టాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కేసులు పెట్టకపోయినా, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామంటున్నారు.