BJP Avoid 3 Leaders: ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి? మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి చందంగా ఉందా? టికెట్లు వస్తాయని భావించిన నేతలకు హైకమాండ్ మొండిచేయి చూపిందా? ముఖ్యంగా ఏపీలో ఎంపీ సీట్లపై ముగ్గురు నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ వాళ్లకి నిరాశే ఎదురైంది. వారిలో ఒకరు జీవీఎల్ నరసింహారావు, మరొకరు సుజనాచౌదరి, ఇంకొకరు మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ.
జీవీఎల్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన.. ఈసారి విశాఖ సీటుపై కన్నేశారు. అందుకు అనుగుణంగా పావులు కదిపారు. అక్కడే మకాం కూడా పెట్టేశారు. ఎక్కడ చూసినా జీవీఎల్ హంగామాయే కనిపించేది. రోడ్డుకు ఇరువైపులా ఫెక్సీల హడావుడి అంతాఇంతా కాదు. కచ్చితంగా తనకు టికెట్ వస్తుందని భావించారాయన. అంతేకాదు కేంద్రమంత్రులను విశాఖకు రప్పించి ఏపీకి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో వివరించే ప్రయత్నం చేశారు. ఇంత చేసినా ఆయనను అధిష్టానం దూరంగా పెట్టిందనే చెప్పవచ్చు. ఈలోగా విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ పేరును చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆయన ఆశలు సన్నగిల్లాయి. అయినా ఎక్కడో చిన్న ఆశ ఆయనకు ఉండేది.
విశాఖ కాకపోయినా పక్కనే ఉన్న విజయనగరం సీటైనా దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. అక్కడ విజయనగరం- రాజంపేట సీటు మధ్య సమస్య ఏర్పడింది. చివరకు కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజంపేట సీటు వరించింది. ఇక జీవీఎల్‌కు సీటు రాకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయన్నది పొలిటికల్ సర్కిల్‌లో రకరకాల టాక్ నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీకి సన్నిహితంగా ఉంటారన్నది ఒకటైతే.. రెండోది టీడీపీపై ఆయన చేసిన ఆరోపణలు. ఇవన్నీ కలిసి ఆయన సీటుకు ఎసరు తెచ్చాయన్నది పలువురు నేతల మాట.
ఇక మరొక నేత మాజీ ఎంపీ సుజనాచౌదరి. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతల్లో ముఖ్యమైన వ్యక్తి. ఈసారి ఆయన విజయవాడ నుంచి బరిలోకి దిగాలని ప్లాన్ చేసినట్టు వార్తలు హంగామా చేశాయి. రీసెంట్‌గా టీడీపీ ప్రకటించిన జాబితాలో విజయవాడ ఎంపీ సీటు కేశినేని చిన్నికి కేటాయించింది. దీంతో సుజన విజయవాడ నుంచి తప్పుకోవడంతో టీడీపీ ప్రకటించిందన్న వార్తలు లేకపోలేదు. అయితే బీజేపీ ఇంకా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దానిపై ఆయన ఆశలు పెట్టుకున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి సుజన బరిలోకి దిగే అవకాశముందని అంటున్నారు. ఈ ఉత్కంఠ వీడాలంటే కొద్దిరోజలు ఆగాల్సిందే!
తిరుపతి నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ. సీటు కోసం ఎడతెగని ప్రయత్నాలు చేశారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయినా తిరుపతి టికెట్ వస్తుందని చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆదివారం ఎమ్మెల్యే వరప్రసాద్ వైసీపీకి గుడ్ బై చేప్పేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వరప్రసాద్ రూపంలో రత్నప్రభకు నిరాశ ఎదురైంది. కొత్తవాళ్ల కంటే.. గతంలో గెలిచిన వరప్రసాద్ బెటరని బీజేపీ హైకమాండ్ ఆలోచన చేసింది. ఆయన పేరు ప్రకటించడం జరిగిపోయింది. ఏదైతేం ఈ ముగ్గురు నేతల అంచనాలకు భిన్నంగా బీజేపీ హైకమాండ్ వ్యవరించిందనే చెప్పాలి. మరి అసెంబ్లీ సీట్లలో ఈ నేతలకు ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి.