“తాను ఏ కూటమిలో లేనంటాడు, కానీ బీజేపీతో నిత్యం అంటకాగుతూనే ఉంటాడు” అనే ఆరోపణ మాజీ సీఎం జగన్ పై ఉంది. ఆయన ఏనాడూ తాను ఎన్డీఏకి వ్యతిరేకం అని చెప్పలేదు, అలాగని ఆ పార్టీకి సాగిలపడ్డానని కూడా ఒప్పుకోలేదు. ఆ మాటకొస్తే బీజేపీ తీసుకునే నిర్ణయాన్ని ఏనాడూ పార్లమెంట్ లో వ్యతిరేకించలేదు జగన్. తాజాగా మరోసారి ఆయన తలఊపే సందర్భం వచ్చింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టబోతున్న అభ్యర్థి రాధాకృష్ణన్ కు వైసీపీ మద్దతు కోరుతూ బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జగన్ కు ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్ నుంచి సానుకూల సంకేతాలు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే జగన్ సమ్మతిని పార్టీ ఇంకా ధృవీకరించలేదు.
అలా అన్నారేంటి?
వైసీపీ లోకల్ పార్టీ. ఆ పార్టీలో నిర్ణయాధికారం అంతా పార్టీ అధ్యక్షుడిదే. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కేవలం ఊహాజనితమే. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతిచ్చే విషయంపై పార్టీలో చర్చించి చెబుతానంటూ రాజ్ నాథ్ సింగ్ కి జగన్ సమాధానం చెప్పినట్టు పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఇది నిజమేనా అని అడుగుతున్నారు నెటిజన్లు. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకునే జగన్, చర్చలు జరిపి చెబుతాననడం హాస్యాస్పదం అంటున్నారు. పార్టీలో చర్చించినా, చర్చించకపోయినా.. జగన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతివ్వడం గ్యారెంటీ అంటున్నారు.
కాదనగలరా..?
వైసీపీ ఎన్డీఏ కూటమిలో లేదు. ఏపీలో ఎన్డీఏ కూటమికి వైసీపీ వ్యతిరేకంగా పోటీ చేసింది. అంటే ఎన్డీఏ కూటమి తీసుకునే నిర్ణయాలను వైసీపీ సహజంగా వ్యతిరేకించాలి. కానీ అలా జరగడంలేదు. 2019 నుంచి 2024 మధ్యలో ఎన్డీఏ తీసుకున్న అన్ని నిర్ణయాలకు బేషరతుగా మద్దతిచ్చారు ఆనాటి సీఎం జగన్. ఇప్పుడు కూడా ఆయన బీజేపీ మాట జవదాటే పరిస్థితి లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకుంటారని కూడా అనుకోలేం. ఈ విషయంలో జగన్ పై తీవ్ర విమర్శలూ లేకపోలేదు. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్, బీజేపీకి సాగిలపడిపోయారని అంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ఆ మాటల్ని పదే పదే నిజం చేసే నిర్ణయాలనే తీసుకుంటున్నారు జగన్. తాజాగా ఎన్డీఏ కూటమి నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ జై కొట్టబొతున్నారు.
జగన్ వ్యూహం ఏంటి?
కేంద్రంలో ఎన్డీఏ, యూపీఏ రెండు కూటములు ఉన్నాయి. దాదాపు చాలా పార్టీలు ఈ రెండు కూటముల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటున్నాయి. అయితే బీజేపీతో ఉంటాయి, లేకపోతే కాంగ్రెస్ పంచన చేరతాయి. అవకాశాన్ని బట్టి రెండు కూటములతో దోబూచులాడే పార్టీలు కూడా ఉన్నాయి. జగన్ మాత్రం ఏపీలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తారు, కేంద్రంలో మాత్రం అదే కూటమి తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలుపుతుంటారు. ఈ డబుల్ గేమ్ కనీసం ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కాదు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకోసమే జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు.