Nara Lokesh : పాదయాత్ర.. ఈ పదం రాజకీయాల్లో సమీకరణాలు మార్చేస్తుంది. అధికారం పీఠంపై కూర్చోబెడుతుంది. ముఖ్యమంత్రి కావాలంటే పాదయాత్ర చేయాల్సిందే. ఈ సెంటిమెంట్ ఏపీలో బలంగా ఉంది. గతంలో పాదయాత్రలు చేసిన నేతలు సీఎం పీఠాన్ని దక్కించుకుని ఈ సెంటిమెంట్ ను నిరూపించారు.
వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 2003 ఏప్రిల్ 9 న ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. 68 రోజులపాటు 56 నియోజకవర్గాల మీదుగా వైఎస్ఆర్ పాదయాత్ర సాగింది. మొత్తం 1475 కిలోమీటర్ల నడిచారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగించారు. వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం యాత్ర రంగారెడ్డి, మెదక్ , నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల్లో సాగింది. ఈ పాదయాత్ర వైఎస్ఆర్ ఇమేజ్ ను అమాంతంగా పెంచేసింది. ప్రజానాయకుడిగా బలమైన పునాది ఇక్కడే పడింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఒంటి చేత్తో వైఎస్ఆర్ గెలిపించారు. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఉచిత విద్యుత్ ,ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాలను అమలు చేసి మహానేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2009లోనూ రెండోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి తిరుగులేని నాయకుడిగా ఎదిగిపోయారు. ఒక్క పాదయాత్ర వైఎస్ఆర్ రాజకీయ జీవితాన్ని మార్చేసింది.
చంద్రబాబు వస్తున్నా మీ కోసం
2014 ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు వస్తున్నా మీ కోసం పేరుతో పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్ 1475 కిలో మీటర్లు నడిస్తే…చంద్రబాబు 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. బాబు పాదయాత్రతో 13 జిల్లాలను చుట్టేశారు. 2012 అక్టోబర్ 2న హిందూపురంలో పాదయాత్ర మొదలపెట్టి.. 2013 ఏప్రిల్ 28న విశాఖపట్నంలోని అగనంపూడి వద్ద ముగించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. పాదయాత్రతో 10 ఏళ్ల తర్వాత తిరిగి చంద్రబాబు సీఎం పీఠంపై కుర్చున్నారు.
షర్మిల పాదయాత్ర
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జైలులో ఉన్న సమయంలో ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టారు. 2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. 2013 ఆగస్టు 4 న ఇచ్ఛాపురంలో ముగించారు. మొత్తం 3 వేల కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర సాగింది. ఆ సమయంలో షర్మిల చేసిన పాదయాత్ర కష్టాల్లో ఉన్న పార్టీకి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 67 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. పాదయాత్రతో షర్మిల వైఎస్ఆర్ సీపీకి ఊపిరి పోశారనే చెప్పాలి.
జగన్ ప్రజాసంకల్ప యాత్ర
వైఎస్ జగన్ 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం ఏపీలోని 13 జిల్లాలను చుట్టేశారు. 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2,516 గ్రామాల్లో పాదయాత్ర సాగింది. 341 రోజులపాటు జగన్ నడిచారు. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగించారు. జగన్ 3,648 కిలోమీటర్లు నడిచి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రతిపక్ష నేతగా జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వైఎస్ఆర్ సీపీకి అధికారం వచ్చేలా చేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టించేలా చేసింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 151 ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుంది. వైఎస్ జగన్ సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు.
లోకేష్ పాదయాత్ర
ఇప్పుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 2023 జనవరి 27 లోకేష్ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. మరి వైఎస్ జగన్ నెలకొల్పిన రికార్డును లోకేష్ బ్రేక్ చేస్తారా? 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? సెంటిమెంట్ ప్రకారం టీడీపీని అధికారంలోకి తీసుకొస్తారా? మరి లోకేష్ నెగ్గుకొచ్చేనా? వెయిట్ అండ్ సీ.