విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. వైసీపీ హయాంలో దాదాపు 12 లక్షలమంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు దూరమయ్యారంటూ లోకేష్ బయటపెట్టిన లెక్కలతో గొడవ చెలరేగింది.
వైసీపీ హయాంలో ఎంతమంది విద్యార్థులు ఏ స్కూల్ లో చదువుతున్నారో డేటా లేదని, ఆ డేటా ఎందుకు లేదో చెప్పాలంటూ ఎమ్మెల్సీ బొత్సను నారా లోకేష్ నిలదీశారు. 12 లక్షలమంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోనుంచి బయటకు వెళ్లారంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని బొత్స అడ్డుకోవడంతో వాగ్వాదం మరింత ముదిరింది. విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు బయటకు పారిపోయారని, ఇప్పుడు తీరిగ్గా వచ్చి ప్రశ్నిస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. విద్యలో సంస్కరణలపై చర్చ జరగాలని వైసీపీయే పట్టుబట్టిందని, దాని ప్రకారమే హౌస్ అజెండా నిర్ణయించి చర్చ మొదలు పెట్టామని, మధ్యలో వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు లోకేష్. “ప్రతిపక్ష పార్టీ చెప్పినట్లు నడవాలంటే కుదరదు. మీకు కావాల్సినప్పుడు చర్చ పెట్టాలంటే నడవదు. ఈ రోజు మూడ్ బాగాలేదు, బయటకు వెళ్లాలి, వేరే పనులు ఉన్నాయని, పార్టీ మీటింగ్ లు ఉన్నాయని వాయిదా వేయాలంటే అందుకు ప్రభుత్వం, ఛైర్మన్ సిద్ధంగా లేరు.” అని ధ్వజమెత్తారు లోకేష్. బొత్స సీనియర్ నాయకులని, మంత్రిగా కూడా పనిచేశారని, ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.
తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం!
విద్యాశాఖపై రెండు గంటల చర్చ పెడితే, చర్చ నుంచి ఎందుకు పారిపోయారు? #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/Tw8hN1XeYb
— Telugu Desam Party (@JaiTDP) March 19, 2025
అటు బొత్స కూడా గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఏపీలో 12 లక్షల మంది విద్యార్ధులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి బయటకు వెళ్లిపోయారంటూ లోకేష్ చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు బొత్స. అసలు ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదన్నారు. అసలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏనాడూ 12 లక్షలమంది ప్రభుత్వ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లలేదన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు లేవు అని, దానికి గత ప్రభుత్వమే కారణం అన్నట్టుగా మాట్లాడటం సరికాదన్నారు బొత్స. కావాలంటే మండలి సభ్యులందర్నీ స్టడీ టూర్ కి తీసుకెళ్లాలన్నారు. గతంలో టీడీపీ హయాంలో.. అంటే 2019 నుంచి 2014 వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఆ తర్వాత విద్యాలయాల్లో పరిస్థితి ఎలా మారిందో చర్చిద్దామని చెప్పారు. తెలుగు మీడియంతోపాటు ఇంగ్లిష్ మీడియాన్ని కూడా ప్రోత్సహించాలనేది అప్పటి తమ ప్రభుత్వ విధానం అని చెప్పారు బొత్స.
ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలకు సీటు కావాలంటూ ప్రజా ప్రతినిధులను తల్లిదండ్రులు ఎప్పుడు అడుగుతారో.. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మెరుగైనట్టు అని అన్నారు లోకేష్. ఆ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 12,512 పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్నారని, ఇది దాదాపు 30 శాతం స్కూల్స్ కి సమానం అని అన్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తున్నామని, వీటి వల్ల ఒక తరగతికి ఒక టీచర్ అనే విధానాన్ని అమలు చేసినట్టవుతుందన్నారు.
జీవో 117 తీసుకొచ్చిన జగన్.. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను దూరం చేశాడు.. మేము సంస్కరణలు ప్రారంభించాం. #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/YtLSmU1TM4
— Telugu Desam Party (@JaiTDP) March 19, 2025