YCP Leaders Land Grabbing in Kadapa: కడప జిల్లాల్లో వైసీపీ నేతల రియల్ అక్రమాలకు సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. అనుమతులు లేకుండా అడ్డగోలుగా లే అవుట్లు వేసి మౌళిక వసతులు కూడా కల్పించడంతో పలువురు ప్లాట్లు కొనుగోలు చేశారు. కోట్లాది రూపాయలు సమర్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ అక్రమార్కులు ప్రతి లేఅవుట్లో ప్రభుత్వ భూమిని కూడా కలిపేసుకుని వ్యాపారం చేశారని కమిటీ తనిఖీల్లో బయటపడుతోంది. దాంతో విచారణకు వచ్చిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆయా లేఔట్లలో ప్లాట్లు కొన్న అమాయకులకు న్యాయం జరుగుతుందా? అన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఐదేళ్ల జగన్ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి జాబితా కంటే బాధితుల లిస్టే పెద్దగా కనిపిస్తుంది. కడప జిల్లాలో కొందరు వైసీపీ నేతలు రియల్టర్ల అవతారమెత్తి నిబంధనలకు వ్యతిరేకంగా లేఅవుట్లు వేసి స్థలాలను మధ్యతరగతి, పేదలకు కట్టబెట్టి కోట్లు దండుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరిపి జిల్లాలో వైసీపీ వారు వేసిన లేఅవుట్లలో అత్యధిక శాతం నిబంధనలు పాటించలేదని తేల్చింది. అని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థలాలని తెలియక కొనుగోలు చేసిన సామాన్యులు, మధ్యతరగతి జనం ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
కడప జిల్లాలో కడప కార్పొరేషన్ సహా అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ పాలకవర్గాలే ఉన్నాయి. కడప అర్బన్ డెవలప్ మెంటు అథారిటీ చైర్మన్‌గా కూడా వైసీపీ నియమించిన వ్యక్తే ఉండేవారు. ఇక కడప మేయర్ సురేశ్ బాబు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా కార్పొరేషన్ పరిధిలో ఆయన పాలకవర్గంలోని కొందరు కార్పొరేటర్లు అడ్డగోలుగా అనుమతి లేని లేఅవుట్లు వేశారు. అధికారంలో ఉన్నాం. మళ్లీ గెలవబోయేది మేమే.. మమ్మల్ని అడిగే ధైర్యం ఎవరికుంది అంటూ రూల్స్ బ్రేక్ చేసి లే అవుట్లు వేసి. జనాలకు అంటగట్టారు. వాటిని కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన పలువురు సామాన్యుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది.
గత ఐదేళ్లలో కడప నగరంలో పెద్దపెద్ద వెంచర్లు వెలిశాయి. అనుమతులు లేని వెంచర్లన్నిటీనీ అప్పట్లో డిప్యూటీ సీఎం హోదాలో అంజద్ బాషా, మేయరు సురేశ్ బాబులే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. పెద్దోళ్లే ఓపెన్ చేయడంతో అవన్నీ లీగల్‌గానే ఉంటాయని జనాలు కొనేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 300కు పైగా లేఅవుట్లు వున్నాయి. కడప నగరంలోనే 150 ఉన్నాయి. కడపలో అనుమతులు లేని లేఅవుట్లపై విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్, శ్రీనివాసరెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమి టీ సభ్యులు విచారణకు వచ్చారు. టౌన్ ప్లానింగ్ ఆడిషనల్ డైరెక్టరు నాగసుందరి ఆధ్వర్యంలో బృందం విచారణ జరుపుతోంది. అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తోంది. దాంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందంటున్నారు.
Also Read: ఫేక్ ప్రచారాలు మానుకోకపోతే.. తాటతీస్తాం
కడపలో పిర్యాదు వచ్చిన బుద్ధ టౌన్‌షిప్, భావన టౌన్‌షిప్, రామాంజనేయ పురంలోని వైసీపీ పార్టీ కార్యాలయ సమీపంలో ఉన్న అనుమతులు లేని లేఅవుట్లు, మినిస్టరు కాలనీ, దాని పక్కన ఉన్న పీస్ కాలనీ, చలమారెడ్డిపల్లె లేఅవుట్లను అధికార బృందం పరిశీలించింది. మినిస్టరు కాలనీ, పీస్ కాలనీ, బుద్ధ, భానవ టౌన్ షిప్‌లను నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్లు గుర్తించారని అంటున్నారు. బుద్ధ టౌన్‌షిప్‌లో తీసుకున్న అనుమతులకి చేపట్టిన నిర్మాణాలకు తేడా ఉండడం, భావన టౌన్‌షిప్‌లో కూడా భూముల్లో వ్యత్యాసాలు ఉండడం, మినిస్టరు కాలనీ, పీస్ కాలనీల్లో ఆక్రమణలను గుర్తించారంట.
సదరు లేఔట్లలో ప్రభుత్వ భూములు, వాగులు వంకలు కూడా ఉన్నాయంట. వైసీపీ నేతల ఆక్రమణలు, అక్రమాలపై ఆశ్చర్యపోతున్న విచారణ బృందాలు సమగ్ర నివేదికలు సిద్దం చేసి పైకి పంపుతారంటున్నారు. జిల్లాలోని అన్ని లేఅవుట్లను పరిశీలించారు. అయితే కడప నగరంలో అనుమతి లేని లేఅవుట్లు అన్నింటిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారట.
వైసీపీ నేతల అక్రమాలను కూటమి సర్కారు నిగ్గు తేలుస్తుండటంతో అవి అక్రమ భూములని తెలియక కొనుగోలు చేసిన సామాన్యులు ఇప్పుడు బిక్కచచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వందల వేల మంది అప్పులు చేసి మరీ ఆ అక్రమ వెంచర్లలో స్దలాలు కొనుగోలు చేశారు. మరి సర్కారు వైసీపీ భూబకాసరులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో? అమాయకంగా స్థలాలు కొన్న సామాన్యులకు ఎలా న్యాయం చేస్తుందో చూడాలి.