YCP Leader – YS Jagan: వైసీపీలో నేతలకు కొత్త సమస్యలు ఎదురయ్యాయా? జగన్ దూకుడు చూసి నేతలకు భయం పట్టుకుందా? అధికార పార్టీకి టార్గెట్ అవుతామని భావించి కొందరు నేతలు బై బై చెప్పేస్తున్నారా? ఒకేరోజు ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా వెనుక ఏం జరిగింది.. జరుగుతోంది? ఈ బాటలో మరికొందరు ఉన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వైసీపీ గుడ్ బై చెప్పేశారు. ఎందుకు రాజీనామా చేస్తున్నానో అందుకు సంబంధించిన కారణాలు వివరించారాయన. గెలిచిన ప్రభుత్వానికి కనీసం ఏడాది అవకాశం ఇవ్వాలన్నది ఆయన మాట. కేవలం ఆరునెలలకే అధికార పార్టీపై నిరసనలు, ధర్నాలు చేయడం మంచి పద్దతి కాదని చెప్పుకొచ్చారు.
అవంతి మాదిరిగా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆలోచన చేస్తున్నారు కూడా. వైసీపీ కంటిన్యూ అధికారంలో ఉంటుందని కొందరు నేతలు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. దారుణంగా టీడీపీ నేతలను అవమానపరిచారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేశారు.
ఓడిపోయామన్న బాధలో నేతలుంటే, కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేయాలంటూ హైకమాండ్ నుంచి తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. అటు కక్కలేక.. ఇటు మింగలేక.. మధ్య ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయారు నేతలు.
ALSO READ: ఒకటి కాదు, రెండు సార్లు.. అందుకేనా గ్రంథి శ్రీనివాస్ రాజీనామా?
వైసీపీ హయాంలో కొందరు నేతలు కొద్దిగొప్పే భూములను సంపాదించుకున్నారు. ఇప్పుడు అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేస్తే వారు అంగీకరిస్తారా? నేతలు బండారం బయటపెడతారేమోనని భయం మరోవైపు వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఒత్తిళ్లు తట్టుకోలేక తట్టబుట్టా సర్దుకుని జంపింగ్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. రానున్న ఐదేళ్లు పార్టీ నుంచి మరిన్ని ఒత్తిళ్లు ఉంటాయని భావిస్తున్నారట. పార్టీలో ఉండి కష్టాలు కోరి తెచ్చుకునే కంటే, రాజీనామా చేస్తే బెటరని అనుకుంటున్నారు. ఇటు పార్టీకి.. అటు ప్రభుత్వానికి దూరంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండదన్నది ఆయా నేతల ఆలోచన.
మరికొందరికి సొంత నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. అధిష్టానం వద్ద ఎంత మొరపెట్టుకున్నా, ఫలితం లేకపోయింది. ఫలితంగా ఫ్యాన్‌కి దూరంగా ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఇంకొందరు నేతలు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
ప్రస్తుతం కూటమి సర్కార్‌కు కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహాయ సహకారాలున్నాయి. కూటమిలో చీలిక వచ్చే ప్రసక్తి లేదని భావిస్తున్నారు. ఒకవేళ వైసీపీ పుంచుకున్నా, మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని, కాకపోతే బలమైన ప్రతిపక్షంగా తయారు కావచ్చనే అంచనాలు లేకపోలేదు. ఆ లెక్కన దాదాపు పదేళ్లు ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి ఉంటుందన్నమాట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే టీడీపీ, లేదంటే జనసేన, ఇంకా లేదంటే బీజేపీ వైపు వెళ్తే సేఫ్‌గా ఉండవచ్చని భావిస్తున్నారట. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో బెటర్ లైఫ్ ఉంటుందనేది నేతల భావన. రాబోయే ఐదేళ్లలో వైసీపీలో ఉండేదెవరు? వెళ్లిపోయేదెవరు? ఎందుకు ఆయా నేతలను ఆపే ప్రయత్నం చేయలేకపోతోంది? మొత్తానికి రాబోయే ఐదేళ్లు మాత్రం వైసీపీ గడ్డుకాలమేనని చెప్పక తప్పదు.