
Avinash Reddy Latest News : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు న్యాయస్థానం ఇచ్చింది. గురువారం ఈ పిటిషన్ పై తుదిపరి వాదనలు జరగనున్నాయి. హైకోర్టు ఇచ్చే తుది ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు కడపలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో వైసీపీ ముఖ్యనేతలతో అవినాష్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. అవినాష్‌ను సీబీఐ అరెస్ట్ చేస్తే ఎలా ముందుకెళ్లాలనేదానిపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్య కేసులో ఇక అవినాష్‌రెడ్డి అరెస్ట్ తప్పదని రాచమల్లు అన్నారు. అయినా సరే ఆయన బెయిల్‌పై బయటకు వస్తారన్నారు. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వెనకుండి కుట్ర చేసి అవినాష్‌ను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అవినాష్‌రెడ్డి హింసను ప్రేరేపించరని మనసాక్షిగా నమ్ముతున్నానన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని రాచమల్లు స్పష్టం చేశారు. వివేకా హత్యలో అవినాష్ పాత్ర ఉందని రుజువైతే తాను రాజకీయాల్లో ఉండనని గతంలో చెప్పానని నిందితుడిగా చేరిస్తే రాజీనామా చేస్తానని చెప్పలేదన్నారు. న్యాయస్థానంలో ఆ విషయం రుజువైతే రాజీనామా చేస్తాననే మాటకు కట్టుబడి ఉన్నానని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Elections : కేసీఆర్, కేటీఆర్ వేదాంత ధోరణి.. ఓటమి తప్పదని భావిస్తున్నారా?