రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విమర్శలు మొదలు పెట్టిన వైసీపీ నేతలు చివరకు పోలీసుల్ని టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలం వాడుతున్నారు. మాజీ సీఎం జగన్ ఈ వ్యాఖ్యలను మరింత పీక్ స్టేజ్ కి తీసుకెళ్లారు. డీఐజీ స్థాయి అధికారులు మాఫియా డాన్ లు గా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగనే పోలీసుల్ని అంతమాట అంటే కింది స్థాయి నేతలు, కార్యకర్తలు ఊరుకుంటారా..? వారి విమర్శలు మరింత శృతి మించుతాయి, మించాయి కూడా. ఈ దశలో పోలీస్ వ్యవస్థ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. జగన్ వ్యాఖ్యలు దారుణం అంటూ ఏపీ పోలీస్ అధికారుల సంఘం నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని అన్నారు. వైసీపీ హయాంలోనూ పనిచేసింది కూడా ఇదే పోలీసులని గుర్తు చేశారు. ఆ విషయం జగన్ మరచిపోయారా అని ప్రశ్నించారు. పోలీసులు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తారని, వారి పనితీరుపై అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి కానీ, ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.
జగన్ ఏమన్నారు..?
కూటమి హయాంలో పోలీసుల్ని ప్రభుత్వం వేధిస్తోందని వారిపై కేసులు పెట్టారని కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ గురించి ప్రస్తావించారు. ఇక విధులు నిర్వహించేవారంతా కూటమి చెప్పినట్టే చేస్తున్నారని, వారి కక్షసాధింపు రాజకీయాల్లో భాగమవుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్నిట్నీ సరిచేస్తామని ఇప్పుడు కూటమికి వంతపాడేవారికి తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. జగన్ లాగే వైసీపీ నేతలు కూడా పోలీసుల్ని తప్పుబట్టడం గమనార్హం. వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్ హైదరాబాద్ వెళ్లిపోతారని.. ఇక్కడున్న అధికారులే బలైపోతారని పరోక్షంగా హెచ్చరించారు మాజీ మంత్రి రోజా. పోలీసుల పనితీరుని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇదే రీతిలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉదాహరణలున్నాయి.
అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ సహా జనసేన, బీజేపీ కూడా పోలీసుల తీరుని కొన్ని సందర్భాల్లో తప్పుబట్టాయి. అయితే పోలీస్ డిపార్ట్ మెంట్ మొత్తాన్ని ఒకేగాటన కట్టేసి విమర్శించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతిపక్షం విమర్శలు శృతిమించాయని అంటున్నారు. పోలీసులందర్నీ విమర్శించడం మంచిది కాదని చెబుతున్నారు. పోలీస్ వ్యవస్థతోపాటు.. ఇతర అధికారులు తమకు వ్యతిరేకులు అనుకోవడం సరికాదంటున్నారు.
ప్రతీకార రాజకీయాలు..
కూటమి ఇలా చేస్తోంది కాబట్టి తాము అధికారంలోకి వచ్చాక అదే రిపీట్ చేస్తామంటున్నారు జగన్. అయితే ప్రజలు ఇలాంటి ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహిస్తారనుకోవడం అమాయకత్వం. వైసీపీ పాలన, జగన్ తీరు నచ్చకే ప్రజలు కూటమిని ఎంపిక చేసుకున్నారు. ఒకవేళ కూటమి తీరు నచ్చకపోతే వారు ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు. అంతమాత్రాన తాము అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటామంటూ వైసీపీ ఇప్పట్నుంచే వార్నింగ్ లు ఇవ్వడం మాత్రం ఆ పార్టీకి ఏమాత్రం మేలు చేయదని అంటున్నారు విశ్లేషకులు జగన్ వార్నింగ్ లు ఇవ్వడం వల్ల ఆ పార్టీపై అధికారులకు మంచి అభిప్రాయం ఉండదంటున్నారు. దీనివల్ల పార్టీకి, జగన్ కి నష్టమే కాని మేలు జరగదని అంటున్నారు విశ్లేషకులు.