YCP Social Media: వైఎస్ జగన్ 2.o అంటే ఏమో అనుకున్నాం. సోషల్ టీమ్ ను యాక్టివ్ చేయడమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఎన్నికల తర్వాత కాస్త సైలెంట్ గా ఉన్న సోషల్ మీడియా మళ్లీ యాక్టివ్ అయిందన్న ప్రచారం ఊపందుకుంది. దీనితో వైసీపీకి జరిగే మేలు కన్నా చెడు ఎక్కువగా ఉందన్న మాటలు ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి మాటల వెనుక పెద్ద కారణమే ఉందట.
ప్రస్తుతం సోషల్ మీడియా క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా తలుచుకుంటే ఎందరో వీఐపీలుగా కూడా మారారు. ప్రజల్లోకి సోషల్ మీడియా దూసుకెళ్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి సోషల్ మీడియా వింగ్ ఉందని చెప్పవచ్చు. తమ పార్టీ కార్యకలాపాలు, నేతల పర్యటనలు, ప్రజల స్పందన ఇలా ఒకటేమిటి సోషల్ మీడియా టీమ్ కి చేతినిండా పనే. కానీ ఎంత సోషల్ మీడియా ప్రచారం సాగించినా, ప్రజల్లో స్థానం ఉండాలంటే కాస్త అభివృద్ది, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. లేకుంటే సోషల్ మీడియా ఎంత మొర పెట్టుకున్నా, తాత్కాలిక ప్రభావమే అంటుంటారు రాజకీయ విశ్లేషకులు.
కొన్ని సార్లు సోషల్ మీడియా టీమ్ అత్యుత్సాహంతో చేసే పనులు పార్టీల పరిస్థితులను దిగజార్చే అవకాశాలు కూడా ఉంటాయి. తమ నేతలకు హైప్ రావాలన్న కారణంగా ఈ టీమ్ చేసే నిర్వాకాలతో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. అన్ని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా టీమ్ ఉన్నట్లుగానే వైసీపీకి ఒక టీమ్ ఉంది. ఈ టీమ్ పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేసే శ్రమ అంతా ఇంతా కాదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐప్యాక్ టీమ్ హంగామా అంతా ఇంతా కాదు.
జగన్ అండ్ కో బ్యాచ్ ఈ టీమ్ ను నమ్ముకొనే పార్టీ కార్యక్రమాలు సాగించారని చెప్పవచ్చు. నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలోనూ ఐప్యాక్ టీమ్ కీలకంగా వ్యవహరించింది. మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్న సమయంలో జగన్ కు పార్టీ క్యాడర్ కు సోషల్ మీడియా టీమ్ అడ్డుగా ఉందన్న విమర్శలు వినిపించాయి. అసలు వాస్తవాలను జగన్ దృష్టికి తీసుకెళ్లకుండా, ఈ టీమ్ మేనేజ్ చేసిందన్న ఆరోపణలను పలువురు వైసీపీకి చెందిన నేతలే వినిపించారు.
అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. అప్పటి వరకు 175 కు 175 అంటూ ప్రచారం సాగించినా, కేవలం 11 స్థానాలకు వైసీపీ పరిమితమైంది. ఫలితాల ముందు జగన్ తన సోషల్ మీడియా టీమ్ తో సమావేశమై, విజయాన్ని అందుకోబోతున్నట్లు తెలిపి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ తో ఆ టీమ్ సైలెంట్ అయిపోయింది. అంతవరకు ఓకే గానీ ఇటీవల మరోమారు వైసీపీ సోషల్ మీడియా స్పీడ్ అయిందని చెప్పవచ్చు.
జగన్ 2.o చూస్తారంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ అనంతరం పార్టీ మీడియా టీమ్ మళ్లీ తెరపైకి వచ్చిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ టీమ్ యాక్టివ్ కావడంతో పార్టీకి మేలు చేకూరే అవకాశాలు అధికంగానే ఉండవచ్చు. కానీ కాస్త జాగ్రత్త పాటించకపోతే అసలుకే మోసం వస్తుందని రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.
అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఎక్కడికి వెళ్లినా మోకాళ్ల మీద కూర్చొని హంగామా చేయడం, పలువురిని ఏర్పాటు చేసి మరీ జగన్ పర్యటనలో మాట్లాడించడం వంటి చర్యలపై టీడీపీ మీడియా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా జగన్ కు కూడా తెలియదని, టీమ్ చేసిన హంగామాతోనే ఆ ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు వైసీపీకి చెందిన నేతల అభిప్రాయం. సేమ్ టు సేమ్ అదే పరిస్థితి మళ్లీ వైసీపీకి ఎదురు కానుందని ప్రచారం సాగుతోంది. ఇటీవల విజయవాడలో జగన్ పర్యటన సంధర్భంగా ఓ చిన్నారి కన్నీళ్లతో జగన్ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే.
అంతవరకు ఓకే గానీ ఆ చిన్నారి చేత అమ్మఒడి రావడం లేదని, స్కూల్స్ పరిస్థితి అధ్వానంగా ఉందని మాట్లాడించిన వీడియోలు వైరల్ గా మారాయి. జగన్ పై అభిమానంతో ఆ చిన్నారి వస్తే, వైసీపీ సోషల్ మీడియా టీం చేసిన నిర్వాకంతో చిన్నారి కూడా ట్రోల్స్ బారిన పడిందని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. కావాలనే ఓవర్ యాక్షన్ చేసి మరీ పార్టీ పరువును దిగజార్చే ప్రయత్నం చేయవద్దని కొందరు వైసీపీ సోషల్ మీడియా టీం కి సలహా ఇస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఆ చిన్నారిని అదేపనిగా ఏర్పాటు చేసి, ప్రతి కదలికను ఘాట్ చేశారని టీడీపీ అనుకూల సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంత మంది ప్రజానీకంలో ఆ చిన్నారి అక్కడికి ఎలా వచ్చింది? ఆ చిన్నారిని ఎత్తుకొని చూపించిన వ్యక్తులెవరు? కావాలనే సీన్ క్రియేట్ చేశారని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. హఠాత్తుగా జగన్ ను కలిసేందుకు చిన్నారి ప్రయత్నిస్తే, అంత క్లారిటీగా వీడియోల చిత్రీకరణ ఎలా సాగిందన్నది టీడీపీ వేస్తున్న ప్రశ్న. అయితే చిన్నారి లక్ష్యంగా సాగుతున్న ట్రోలింగ్ ను ఇప్పటికైనా ఆపాల్సిన అవసరం ఉంది.
ఎవరైనా నేతను కలిసిన సమయంలో చిన్నారులు మాట్లాడే తీరు అదేవిధంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో చిన్నారిని ట్రోల్స్ చేయడం పద్దతి కాదని చెప్పవచ్చు. అంతేకాకుండా అధికారంలో ఉన్న సమయంలో పలువురు జూనియర్ ఆర్టిస్టులను ఏర్పాటు చేసి మరీ ప్రచారం సాగించారన్న అపవాదు వైసీపీని వెంటాడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా టీం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని నెటిజన్స్ అంటున్నారు. సోషల్ టీం యాక్టివ్ అయినప్పటికీ, అమాయకులను ఎర వేసి రాజకీయాలకు వాడుకోవద్దని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు.
Also Read: Local Boy Nani – Sajjanar: సారీ చెప్పిన లోకల్ బాయ్ నాని.. డోంట్ రిపీట్ అంటూ సజ్జనార్ మళ్లీ వార్నింగ్
ఇప్పుడిప్పుడే జగన్ మళ్లీ నిలదొక్కుకోవాలన్న ఆలోచనతో ఆడుగులు వేస్తున్న క్రమంలో, ఇదే తీరులో వైసీపీ సోషల్ మీడియా స్పీడ్ అయితే 11 సీట్లు కూడా గల్లంతే అంటూ కూటమి పార్టీల నేతలు అంటున్నారు. మరి వైసీపీ సోషల్ మీడియా అడుగులు మున్ముందు ఎలాంటి చిత్రాలు చూపిస్తుందోనన్న కామెంట్స్ ని నెటిజన్స్ విమర్శల రూపంలో గుప్పిస్తున్నారు.