ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. మరో నాలుగేళ్లకు పైగానే ప్రభుత్వం ఉంటుంది. కానీ జగన్ మాత్రం పదే పదే మూడేళ్లకే ప్రభుత్వం మారిపోతుందని అంటున్నారు. ఒకటీ రెండు సార్లు కాదు, ఎప్పుడు జనంలోకి వచ్చినా, నాయకులతో మాట్లాడినా, మరో మూడేళ్లు కళ్లు మూసుకోండి మన ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారు. జమిలి ఎన్నికలు గ్యారెంటీ అని, అవి 2028లోనే జరుగుతాయని జగన్ నమ్ముతున్నారేమో తెలియదు కానీ.. మూడేళ్ల తర్వాత మాత్రం ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, మంచి మెజార్టీ సాధిస్తుందని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజేతలను తాడేపల్లి ఆఫీస్ కి పిలిపించి అభినందించారాయన. 50చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని, ఆ విజయానికి కారకులైన వారికి హ్యాట్సాఫ్ అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలు పెట్టినా వారు లొంగలేదని, భయపడలేదని, పార్టీకోసం నిలబడ్డారని మెచ్చుకున్నారు జగన్.
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో శ్రీ @ysjagan సమావేశం.#YSJagan#AndhraPradesh pic.twitter.com/3HaNzqwwOC
— YSR Congress Party (@YSRCParty) April 2, 2025
కంచం లాగేశారు..
వైసీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల ముందున్న కంచాన్ని కూడా వారు లాగేశారని మండిపడ్డారు జగన్. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కి చేరుకుంటున్నాయని విమర్శించారు. తాజాగా ఆయన పి-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టారన్నారు. రాష్ట్రంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో కూడా చంద్రబాబుకి తెలియదన్నారు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులను 10శాతం మంది ధనవంతులకు అప్పగిస్తామనడం హాస్యాస్పదం అన్నారు జగన్.
అన్నీ తెలిసే మోసం..
సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ కబుర్లు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, వాటిని ఎగరగొట్టేందుకు ప్లాన్ వేశారని విమర్శించారు జగన్. అదేమంటే రాష్ట్రం అప్పులపాలైందని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని వారు కోరుకుంటారని, ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితే ఉందని చెప్పారు. మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు జగన్. రాబోయే రోజులు వైసీపీవేనని, కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయని చెప్పారు.
జగన్ 2.O
ఈసారి వైసీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందన్నారు జగన్. ఈసారి అధికారంలోకి వచ్చాక పార్టీ.. కార్యకర్తల కోసం నిలబడుతుందని భరోసా ఇచ్చారు. కోవిడ్ కారణంగా గతంలో తాను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోయానని వివరణ ఇచ్చుకున్నారు. కానీ జగన్ 2.O దీనికి భిన్నంగా ఉంటుందని, కార్యకర్తలకోసం తాను గట్టిగా నిలబడతానని చెప్పుకొచ్చారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. కుప్పం మండల ఎంపీపీ పదవికోసం దారుణాలు చేశారంటూ మండిపడ్డారు జగన్. చిన్న పదవికోసం సీఎం స్థాయి వ్యక్తి అలా ప్రవర్తించ వచ్చా అని ప్రశ్నించారు. కుప్పంలో 16 ఎంపీటీసీలు వైసీపీవేనని, వారిలో ఆరుగుర్ని ప్రలోభపెట్టి టీడీపీవైపు తిప్పుకున్నారని, మిగతా వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, కోరం లేకపోయినా వారే గెలిచామని డిక్లేర్ చేసుకున్నారని, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అన్నారు జగన్. మొత్తమ్మీద జగన్ క్షేత్ర స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టారు. కార్యకర్తలను మంచి చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానిక నేతలకు కూడా ఆయన ప్రయారిటీ ఇస్తున్నారనే విషయం ఈ మీటింగ్ తో స్పష్టమైంది.