ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక తప్పేలా లేదు. వాస్తవానికి బైపోల్ రాజకీయానికి సర్కార్ చెక్ పెట్టాలనుకున్నది. సమయం వృథా, ఖర్చు వృథా, పైగా బీఆర్‌ఎస్‌ను ఎంటర్‌టైన్ చేయడం ఎందుకు? అనే అభిప్రాయంతోనే హైకోర్టు తీర్పు తరువాత సుప్రీం మెట్లెక్కింది.
ఇక అంతా అనుకున్నారు.. ఇప్పట్లో ఈ ఉప ఎన్నిక జరిగేలా లేదని. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సప్రీం వెంటనే దీనికి క్లారిఫికేషన్ ఇచ్చేసింది. ఖుల్లం ఖుల్లాగా తేల్చిపారేసింది. ఉప ఎన్నిక నిర్వహించుకోవాల్సిందేనని.
దానం నాగేందర్ కూడా దీనిపై తనదైన శైలిలో స్పందించారు. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని అన్నారు. సుప్రీం కోర్టుకు పోవాలని కూడా తనకు లేకుండెనని చెప్పిన దానం.. సర్కార్ సూచన మేరకే ఇలా చేయాల్సి వచ్చిందనే ఇండికేషన్‌ను పరోక్షంగా ఇచ్చారు. ఖైరతాబాద్ ప్రజలు తనతోనే ఉన్నారని, తనను కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తారని ఆయన నమ్మకంగా ఉన్నారు.
దానం నాగేందర్ రాజకీయ నేపథ్యంలో పార్టీలు మారుతూ వచ్చినా ఆయన గెలుపు గ్రాఫు మాత్రం ఎక్కడా పడిపోలేదు. ఉప ఎన్నికలో ఓసారి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికలో మరోసారి .. రెండు పర్యాయాలు ఓడినా.. ఇప్పటి వరకు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు నెలకొల్పారు.
వైఎస్ హయాంలో మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. బలమైన బీసీ నేత, లోకల్‌గా మంచి పట్టున్న నాయకుడు.. పార్టీలు మారినా.. దురుసుగా ప్రవర్తించినా.. అధికారులపై చిర్రుబుర్రులాడినా… అదంతా తమకోసమేనని ప్రజలు చేరదీసే విధానం అతనికి శ్రీరామ రక్ష అని చెప్పొచ్చు. అదే ధీమా, నమ్మకంతో ఉన్నారు దానం.
రేవంత్‌కు కూడా ఇదే గురి. ఇక కాంగ్రెస్ బీఫామ్ పై ఉప ఎన్నికలో ఆయనే పోటీ చేస్తారు. దీంట్లో డౌట్ లేదు. కాదని విజయారెడ్డి లేదా ఎవరికిచ్చినా గెలవడం కష్టమే. ప్రతిపక్షం కూడా అభ్యర్థులను వెతుకులాడే పనిలో ఉంది. వారికి ఉన్నపళంగా బలమైన అభ్యర్థి రెడీగా లేడు. అందుకే ఎవరికి వారే పోటీలు పడుతున్నారు. కాలం కలిసొచ్చి గెలిస్తే అదృష్టం వరించనుందనే కోణమే తప్ప.. కచ్చితంగా గెలిచి తీరుతామనే ధీమాను ప్రతిపక్షాలు వ్యక్తపరచడం లేదు. మేకపోతు గాంభీర్యాలనే ప్రదర్శిస్తూ వస్తున్నాయి.
బీజేపీ కూడా ఇక్కడ ఆశ పెట్టుకున్నది. 2014లో చింతల రాంచంద్రారెడ్డి ఇక్కడ గెలిచాడు. అదే ధీమాతో ఉంది బీజేపీ. కానీ ఇప్పుడు పరిస్థితులు బీజేపికి పెద్ద అనుకూలంగా ఏమీ లేవు. బీఆర్‌ఎస్ కూడా ఈ ఎన్నిక గెలిస్తే.. తమదే అధికారం అని ప్రజలకు బలమైన సంకేతం ఇచ్చినట్టవుతుందనే ప్రయత్నాల్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఓడిదే లేదు.. భారీ మెజారిటీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు.
దీంతో ఈ ఉప ఎన్నిక ట్రై యాంగిల్‌ఫైట్ అవుతుందా? అధికార పార్టీకి నల్లేరు మీద నడకేనా అనేది తేలాల్సి ఉంది. అన్నింటికన్నా ప్రధానమైన అంశం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. మరి హైదరాబాద్‌లో ఏ పార్టీ సత్తా ఎంత..? అనేది కూడా ఈ ఫలితాలే బయటపెట్టనున్నాయి.