YS Jagan : దేశంలోనే రిచెస్ట్ రాజకీయ నేతల్లో ఒకరు. దేశంలోకే రిచెస్ట్ రాజకీయ పార్టీల్లో ఒకటి. అలాంటి వైఎస్ జగన్ తన దగ్గర డబ్బుల్లేవ్ అంటున్నారు. పార్టీ దివాళా తీసిందని చెబుతున్నారు. బాబ్బాబు.. డబ్బులుంటే ఇవ్వండంటూ ప్రాధేయపడుతున్నారు. ఇదంతా కామెడీగా అనిపించినా.. కాదు పచ్చి నిజం అంటున్నారు జగన్. ఆయనే స్వయంగా చెప్పారు ఈ విషయం.
నో స్కాం.. నో మనీ..
వైసీపీ నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపేందుకు డబ్బులు లేవని అన్నారాయన. తమ హయాంలో స్కామ్‌లు జరగలేదని.. అలాంటప్పుడు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీని నడిపేందుకు ఇబ్బందిగా ఉందన్నారు. స్కామ్‌లు జరిగుంటే.. డబ్బులు ఎక్కడున్నాయో చూపించాలన్నారు జగన్. డబ్బులుంటే తనకు పంపించాలని.. తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
రూ.442 కోట్లు ఏమయ్యాయి?
జగన్ వ్యాఖ్యలు చాలా మందిని ఆలోచనలో పడేశాయి. నిజంగా పార్టీని నడిపించేందుకు జగన్ దగ్గర డబ్బులు లేవా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2018-23 మధ్య ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా వైసీపీకి 442 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అంతేకాదు.. పలు రూపాల్లోనూ వైసీపీకి భారీ విరాళాలు వచ్చి పడ్డాయి. మరి, ఆ డొనేషన్ల ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఏమయ్యాయి..? ఐదేళ్లు అధికారంలో ఉండి.. డబ్బులు లేవని జగన్ ఎందుకు అంటున్నారు? అధికారం పోయిన ఏడాదిలోనే.. డబ్బులు అయిపోయాయా? మనీ లేదని చెప్పడం వెనుక దాగున్న మర్మం ఏంటి..? అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చ, రచ్చ నడుస్తోంది.
జగన్ మాటలు అందుకేనా?
బెదిరిస్తున్నారా? భయపెడుతున్నారా? జగన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. వైసీపీకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెద్ద ఇన్వెస్టర్ అని అంటారు. ఎంపీ మిథున్‌రెడ్డిని రేపో మాపో అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మిథున్‌రెడ్డి అరెస్ట్ అయితే.. పార్టీ ఫండ్‌కు చెక్ పెడినట్టే అని చెబుతున్నారు. ఇక ఇన్నాళ్లూ లిక్కర్ స్కాంలో సంపాదించిన సొమ్మంతా ఎక్కడెక్కడ దాచారనే డీటైల్స్ అన్నీ రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి అండ్ టీమ్‌కే బాగా తెలుసని అంటున్నారు. జగన్ ఆర్థిక మూలాలపై కూటమి ప్రభుత్వం గురి చూసి దెబ్బ కొడుతోందనేది ఓపెన్ సీక్రెట్. మిథున్‌రెడ్డి నుంచి కసిరెడ్డి వరకూ.. ATM నెట్‌వర్క్ మొత్తాన్ని ఒకే కేసుతో లోపలేస్తుండే సరికి.. పార్టీకి అందాల్సిన నిధులు అందక జగన్ ఫ్రస్టేషన్‌కు గురి అవుతున్నారని అంటున్నారు. అలా మనసులో మాట ఇప్పుడిలా బయటపెట్టేశారనేది విశ్లేషకుల మాట. జగన్ ఏదో కామెడీకి, యధాలాపంగా చెప్పిన డైలాగ్ కాదని.. నిజంగానే పార్టీకి డబ్బుల్లేవ్ అని.. వైసీపీ అధినేత ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని అంచనా వేస్తున్నారు.
సోషల్ మీడియాలో రచ్చ..
పార్టీ ఫండ్ సైతం జగనే కాజేసి ఉంటారని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నారు. జగన్ చెప్పే కాకమ్మ కబుర్లు ఎవరూ నమ్మరని లైట్ తీసుకుంటున్నారు. హైదరాబాద్, తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్‌లలో సేద తీరే జగనన్న దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారని నిలదీస్తున్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్ల స్కాం చేశారనే ఆరోపణలు జగన్‌పై ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ అక్రమాస్తుల కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయని.. ప్రస్తుతం బెయిల్‌పై ఆయన బయట తిరుగుతున్నారనే విషయం మరిచారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆ డబ్బంతా జగన్ సొంత మనీ అనుకుంటే.. మరి, పార్టీకి విరాళాలు వచ్చిన ఆ 400 కోట్లు ఎవరు నొక్కేశారని.. అప్పుడే పార్టీ ఖజానా ఎలా ఖాళీ అయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ స్కాంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని.. ఆ కేసు తన మెడకు చుట్టుకోకుండా.. తన పాలనలో స్కాములేమీ జరగలేదనేలా మెసేజ్ ఇవ్వడానికే పార్టీ నడిపేందుకు నిధులు లేవంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని మండిపడుతున్నారు. పార్టీని నడిపించేందుకు అంత ఇబ్బందిగా ఉంటే.. వైసీపీని మూసేయాలంటూ ఉచిత సలహా కూడా ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
Also Read : లిక్కర్ స్కాంపై జగన్ ఏం చెప్పారంటే..
అమాయకులను ఇరికిస్తున్నారు..
డబ్బుల మేటరే కాదు.. ఇంకా చాలానే మాట్లాడారు మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. YCP అధినేత జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా బెదిరింపులు, బ్లాక్‌మెయిల్స్‌కు లొంగనివారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆరోపించారు. అభంశుభం తెలియని అధికారులను స్కాములు, కేసులంటూ వెంటాడుతున్నారని మండిపడ్డారు. మిథున్ రెడ్డిని సంబంధం లేని కేసుల్లో ఇరికించారని విమర్శించారు.
జగన్ లాజిక్ ఇదే..
AP లిక్కర్ స్కాం కేసుపైనా జగన్ స్పందించారు. YCP ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాలు భారీగా తగ్గాయి.. మద్యం తయారీ సంస్థలు నష్టపోయాయి.. అమ్మకాలు తగ్గి, కంపెనీలు నష్టపోయినప్పుడు లంచాలు ఎందుకిస్తాయని జగన్ అన్నారు. స్కాం అని ఎలా అంటారని ప్రశ్నించారు. రాజ్ కేసిరెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించారని ఆరోపించారు.
విజయసాయి అందుకే..
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి అని అన్నారు. రాజ్యసభ సభ్యునిగా మూడున్నర ఏళ్లు పదవీకాలం ఉండగా.. చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆరోపించారు. ప్రలోభాలకు లోనై తన సీటును విజయసాయిరెడ్డి అమ్మేశారని జగన్ అన్నారు.