YS Sharmila on Hero Prabhas: సంచలన సినిమాల హీరో ప్రభాస్ అంటే తెలియని వారుంటారా.. అదేనండీ పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ కాబట్టి.. అసలు ఎవరికీ అంతగా పరిచయం చేయాల్సిన పేరు కూడా కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ, తనకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదని.. తెగేసి చెప్పేశారు. అసలు షర్మిళ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ పై షర్మిళ సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో షర్మిళ పార్టీని స్థాపించిన సమయంలో, సోషల్ మీడియాలో పలువురు విపరీతంగా ట్రోలింగ్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదికూడా ఏకంగా హీరో ప్రభాస్ తో షర్మిళ సన్నిహితంగా ఉంటారని, ఆమె వ్యక్తిగత హననానికి దారి తీసే విధంగా ట్రోలింగ్స్ సాగాయి. అది కూడా వైసీపీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసి ఈ ప్రచారం సాగించిందన్నది షర్మిళ ఆరోపణ. ఇలా ప్రచారం సాగడంపై నాడే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
తాజాగా తాను ఎదుర్కొన్న సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై వైయస్ షర్మిళ మాట్లాడుతూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్స్ చేయడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. తనకు ప్రభాస్ కు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు వైసీపీ సైతాన్ సైన్యం విస్తృత రీతిలో ప్రచారం సాగించిందన్నారు. మాజీ సీఎం, తన అన్న జగన్ కు ఈ విషయం తెలిసి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.
తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, తాను ఇప్పటి వరకు ప్రభాస్ ను నేరుగా ఎప్పుడూ చూడలేదన్నారు. నేటికీ ప్రభాస్ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. తనకు క్యారెక్టర్ లేనట్లు, 5 సంవత్సరాలుగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగించారని, మీకు చెల్లెలి మీద ప్రేమ ఉందా.. ప్రేమే ఉంటే ఇలాంటి అభాండాలు ఎవరైనా వేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి వాటిని ప్రచారం చేయిస్తారా అంటూ షర్మిళ ఆవేదన చెందారు. ఏది ఏమైనా సోషల్ మీడియా ట్రోలింగ్స్ హద్దులు దాటితే, ఎవరిపైనైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని షర్మిళ ఈ సందర్భంగా అన్నారు. షర్మిళ చేసిన ఈ కామెంట్స్ పొలిటికల్ హాట్ టాపిక్ గా మారాయి.