Botsa Vs Atchannaidu: శాసనమండలిలో ఇసుక వ్యవహారం అధికార టీడీపీ-విపక్ష వైసీపీ మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. వైసీపీ ప్రభుత్వం 10 టన్నుల లారీ కేవలం 12 వేలకు మాత్రమే దొరికేదన్నారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇవాళ కూడా అదే రేటుకు ఇసుక లభిస్తుందన్నారు.
ఇసుకపై రచ్చ
ఉచితంగా ఇస్తే ధర తగ్గాలని బొత్స పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆ లెక్కన ఎలాగలేదన్నా నాలుగువేలు తగ్గాల్సి ఉందన్నారు. ఎనిమిది వేలకు దొరకాల్సిన ఇసుక 12 వేలకు దొరుకుతుందన్నారు. ఆ ఇసుక ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి ప్రాంతం నుంచి ఆ ఇసుక వస్తుందన్నారు.
లెక్కలు వివరించిన మంత్రులు
వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకున్నారు. గతంలో ఇసుక రీచ్‌ల వద్ద రేటు 370 రూపాయలు ఉండేదన్నారు. గతంలో ఇసు రీచ్ ల వద్ద రుసుం వసూలు చేసే వారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి రుసుం వసూలు చేయలేదన్నారు. లోడింగ్, అన్ లోడింగ్, ట్రాన్స్‌పోర్టు ఛార్జులు మాత్రమే వినియోగదారులు చెల్లించు కోవాలన్నారు.
విశాఖలో ఒకప్పుడు రూ. 1700 అమ్మారని, ఇప్పుడు రూ. 600 లభిస్తుందన్నారు. ఇసుకను తీసుకొచ్చి స్టాక్ పాయింట్‌లో స్టోరేజ్ చేయడం వల్ల లోడింగ్ ఛార్జీలు రెట్టింపు అవుతాయన్నారు. విజయవాడలో ప్రస్తుతం రూ. 300 కే వస్తుందన్నారు. దీనిపై విచారణ చేయవచ్చన్నారు. దీనిపై సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు.
ఇదీ అసలు
మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం విపక్షం సంతృప్తి చెందలేదు. ఈలోగా మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై వివరాలు బయటపెట్టారు. 2024లో ప్రజలు మాకు అధికారం ఇచ్చారన్నారు. శ్రీకాకుళంలో ట్రాక్టర్ ఇసుక గతంలో రూ.8500 వుండేదన్నారు. ఇప్పుడు రూ. 1800 లకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారని వివరించారు. పోటీతత్వం పెరగడం వల్ల తక్కువకే ఇసుక లభిస్తుందన్నారు.
ఇసుక వినియోగం విశాఖలో ఎక్కువగా ఉందన్నారు. ఒకప్పుడు లారీ ఇసుక రూ.50 వేలు లేదా రూ. 60 వేలు ఉండేదన్నారు. ఇప్పుడు అదే ఇసుక రూ. 28 వేలకు దొరుకుతుందన్నారు. ఉచిత ఇసుక పెట్టామని, లోడింగ్, అన్ లోడింగ్, రవాణా ఖర్చులు తప్పితే దీనిపై ప్రభుత్వానికి ఒక్క పైసా ఆదాయం రాలేదన్నారు.
తొలుత సీనరేజ్ ఛార్జీలు పెట్టామని దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. ఇసుక దందాపై పేపర్‌లో వస్తే వెంటనే కలెక్టర్లకు సమాచారం ఇస్తున్నామని తెలిపారు. తక్కువ ధరకు వినియోగదారులకు అందాలన్నదే తమ ఉద్దేశమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టన్ను రూ. 12 వేలు ఉండేదన్నారు. ఇప్పుడు సగానికి పైగానే తగ్గిందన్నారు.
మంత్రి పార్థసారధి నోరు విప్పారు. గడిచిన ఐదేళ్లలో విశాఖలో లారీ ఇసుక రూ. 12 వేలకు దొరికిందేమో సభ్యులు వెరిఫై చేసుకోవాలన్నారు. ఈ విషయంలో దీనికైనా సిద్ధమేనని సమాధానం ఇచ్చారు. వెంటనే బొత్స జోక్యం చేసుకున్నారు. పదండి వెళ్దామన్నారు. వెంటనే మంత్రి మాట్లాడుతూ ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు లెక్కగట్టకుండా సభకు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వాళ్లు నిరూపించుకోవడానికి ఏమీ ఉండదన్నారు. కేవలం బురద జల్లడమే వారి పని అని చెప్పుకొచ్చారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విశాఖలో తాము వచ్చినప్పుడు టన్ను రూ. 1700 నుంచి రూ. 2 వేలు మాత్రమే పలికిందన్నారు. వాహనాలకు జీపీఎస్ స్టిసమ్ ఏర్పాటు చేశామని ట్రాకింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో ఇసుక అనేది కీలకమన్నారు. అందుకే ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు.