Buggana with Jagan: వైసీపీలో ఏం జరుగుతోంది? ఉత్తరాది, సీమ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? కేవలం కృష్ణా, గుంటూరు నేతలు మాత్రమే రియాక్ట్ అవుతున్నారా? వైసీపీ అధిష్టానం వారిని పక్కనపెట్టిందా? వాళ్లే దూరంగా ఉంటున్నారా? మాజీ మంత్రి బుగ్గన మనసు మారబోతోందా? స్థానిక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారా? ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
బుగ్గన ఆలోచనేంటి?
వైసీపీ హయాంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆనాటి ఆర్థికమంత్రిగా ఆయన కష్టాలు అన్నీఇన్నీ కావు. నిధుల కోసం వారంలో మూడు రోజులు ఢిల్లీకి వెళ్లేవారు. అసెంబ్లీలో పిట్ట కథలు చెప్పేవారు. ఆయన మాటలు సభ్యులను విపరీతంగా ఆకట్టుకున్నాయని అప్పుడప్పుడు కొందరు నేతల మాట. కేబినెట్ విస్తరణలోనూ ఆయన్ని టచ్ చేయలేదు జగన్.
మరో విషయం ఏంటంటే.. వైసీపీ రూలింగ్‌లో అమరావతి కంటే ఢిల్లీలో ఆయన ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. ఆ విధంగా బీజేపీ పెద్దలతో క్రమంగా పరిచయాలు పెరిగాయి. ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాయని అనుకోండి. అదే వేరే విషయం. మరి ఏమనుకున్నారో తెలీదుగానీ లోకల్ పాలిటిక్స్ కు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. పొలిటికల్ పిచ్ మార్చాలని ఆలోచన చేస్తున్నారట.
యాక్టివ్‌గా కొడుకు అర్జున్
ఈ లెక్కన డోన్ నియోజకవర్గానికి దూరం కావాలని అనుకుంటున్నారట. స్థానికంగా వైసీపీ తరపున బుగ్గన కొడుకు అర్జున్ యాక్టివ్‌గా ఉన్నాడు. కొద్దినెలలుగా అర్జున్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తున్నారట బుగ్గన. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి కొన్నాళ్లు ఇబ్బందులు తప్పవని సన్నిహితుల వద్ద వాపోయారట.
ALSO READ: ఎకరం 99 పైసలే.. ఏపీలో కారు చౌకగా ప్రభుత్వ భూములు
ఢిల్లీ రాజకీయాలపై బుగ్గన గురి
అలాగని రాజకీయాలకు ఆయన దూరం కారని అంటున్నారు సన్నిహితులు. వచ్చే ఎన్నికల నాటికి లోక్‌సభకు పోటీ చేయాలని స్కెచ్ వేస్తున్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ వద్ద చెప్పినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఇన్నాళ్లు వైసీపీ తరపున ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టేవారు విజయసాయిరెడ్డి. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ లోటును భర్తీ చేయాలన్నది బుగ్గన ఆలోచనగా చెబుతున్నారు సన్నిహితులు.
ఆర్థికమంత్రిగా గడిచిన ఐదేళ్లు కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించారు. ఈ విషయంలో పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అనుకుంటున్నట్లు సమాచారం. మాజీ సీఎం జగన్.. బుగ్గనను ఢిల్లీ వైపు పంపిస్తారా? అన్నది అసలు పాయింట్. ఇప్పటికే ఎంపీ మిధున్‌రెడ్డి ఆ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. పెద్దగా ఫలితం కనిపించలేదని తెలుస్తోంది. కచ్చితంగా తనకు అధినేత అవకాశం ఇస్తారని అంటున్నారు.
ఎన్నికల ముందు నిర్ణయం?
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారాయన. వైసీపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాకుంటే ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. వీలైతే కమలం వైపు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు. రాబోయే రోజుల్లో ఏం జరగుతుందో చూడాలి.