Narsapur Politics: పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కూటమి అధికారంలో రావడానికి తమ పదవులను సైతం త్యాగం చేశారు కొంత మంది టిడిపి నేతలు .. వెంటిలేటర్‌పై ఉన్న టిడిపిని ముందు బతికించుకుంటే పదవులు సంగతి తర్వాత అయినా చూసుకోవచ్చని .. తమకి తాము సర్ది చెప్పుకొని, సీట్లు త్యాగం చేసి పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు కష్టపడ్డారు.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక పదవుల యోగమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో .. ఏడాది కావస్తున్నా తమను ఎవరు పట్టించుకోకపోవడంతో ఢీలా పడిపోతున్నారు .. మా సంగతి ఏంటి బాస్ అంటూ టిడిపి అగ్ర నాయకత్వం వైపు ఆ సెగ్మెంట్ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు .. ఇంతకీ ఎవరా నాయకులు? ఆ నియోజకవర్గం ఏది?
నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అటువంటి కోటలో 2019లో వైసీపీ పాగా వేసింది. ఆ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చతికల పడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో పొత్తూరి రామరాజు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలను తీసుకున్నారు. మరో పక్క పార్టీకి ఆర్థికంగా కొవ్వలి నాయుడు తన సహకారాన్ని అందించారు. దీంతో వైసిపి అధికారంలో ఉన్నప్పటికీ నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం తగ్గకుండా ప్రజల తరఫున పోరాటం చేసింది.
పొత్తుల లెక్కలతో జనసేనకు దక్కిన నర్సాపురం
2024 ఎన్నికల్లో అయితే కొవ్వలి నాయుడుకు లేదంటే నియోజకవర్గ ఇన్చార్జి పొత్తూరి రామరాజుల్లో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని అందరూ ఆశించారు. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుల లెక్కలతో వారిద్దరి ఆశలు నెరవేరలేదు. పొత్తులో భాగంగా నర్సాపురం జనసేనకి దక్కింది. జనసేన నాయకుడు బొమ్మిడి నాయకర్ ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
పార్టీ పరంగా కొవ్వలి నాయుడికి దక్కని ప్రాధాన్యత
టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకు రామరాజు, కొవ్వలి నాయుడులు నాయకర్ గెలుపు కోసం పనిచేశారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గ ఇన్చార్జి కాబట్టి రామరాజు కు కూడా కొంతమేర తగిన గుర్తింపు దక్కిందని చెప్పవచ్చు. అయితే పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా, పార్టీ బలోపేతానికి కృషి చేసిన కొవ్వలి నాయుడిని రాష్ట్ర నాయకత్వం ఇంతవరకు గుర్తించకపోవడంపై నరసాపురం టిడిపి కార్యకర్తలు కొంత మేర అసంతృప్తితో కనిపిస్తున్నారు
కొవ్వలి ఫౌండేషన్‌తో నాయుడు సేవా కార్యక్రమాలు
జనసేననుంచి నాయకర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామరాజు, కొవ్వలి నాయుడులు నర్సాపురంలో టీడీపీ పట్టు సడలకుండా చూసుకుంటూ.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. కొవ్వలి నాయుడు ఎన్నో ఏళ్ల క్రితమే కొవ్వలి ఫౌండేషన్ స్థాపించి నర్సాపురం నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ పేదవారిని ఆదుకుంటూ తన వంతు సహాయం చేస్తున్నారు.
అధిష్టానం వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్న క్యాడర్
పేద విద్యార్థిని విద్యార్థులకు ఫీజులు కడుతూ వారి విద్యాభివృద్ధికి సహకరిస్తున్నారు.. అయితే టిడిపి కోసం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కష్టపడిన జిల్లా స్థాయి నేతలకు కనీస గుర్తింపు ఇవ్వడంలో అధిష్టానం విఫలమైందని కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: పొలిటికల్ ఫ్యూచర్ కోసం.. కిమిడి ఫ్యామిలీ వార్
పార్టీలు మారి జనసేనలో చేరిన కొత్తపల్లికి కార్పొరేషన్ పదవి
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పదవులు వస్తాయని ఆశించిన వారు … ఇప్పుడు ఏడాది కావస్తున్నా రాష్ట్ర పార్టీ నేతలు గుర్తింపు ఇవ్వకపోవడంతో తమలో తామే మధనపడే పరిస్థితికు వచ్చేశారు. టిడిపిలో దీర్ఘకాలం పనిచేసి, తర్వాత వైసీపీలోకి వెళ్లి, తిరిగి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు . అయితే ఆ పదవి పట్ల ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. పదవిని ప్రకటించిన తర్వాత నెలల తరబడి ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. భవిష్యత్తులో ఉన్నత పదవి ఇస్తామని జనసేన అధిష్టానం నుండి స్పష్టమైన హామీ రావడంతో ఇటీవలే కొత్తపల్లి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
రామరాజు, కొవ్వలి నాయుడుల పరిస్థితి ఏంటి అంటున్న తమ్ముళ్లు
జనసేన పార్టీలో చేరిన కొత్తపల్లికి కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా దక్కిందని, టిడిపి కోసం కష్టపడ్డ రామరాజు, కొవ్వలి నాయుడుల పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిద్దరికీ సముచిత స్థానం కల్పించాలని టిడిపి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో అయినా రామరాజుని, కొవ్వలి నాయుడుని టీడీపీ అధిష్టానం గుర్తిస్తుందో? లేదో? చూడాలి.