Ysrcp Discuss: ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారుతున్నాయా? అధినేతల మాదిరిగా మిగతా నేతలు వ్యవహరించడం లేదా? బొత్స భిన్నంగా వ్యవహరించడం వెనుక ఏం జరుగుతోంది? ఆయనపై వైసీపీలో ఎందుకు చర్చ మొదలైంది? జనసేన వైపు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది?
ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండేవి. ఒకరి నొకరు బహిరంగంగా విమర్శించు కునేవారు. ఏదైనా కార్యక్రమంలో ఎదురెదురు కలిస్తే మాట్లాడుకునేవారు. రాజ్‌భవన్ ఎట్ హోం కార్యక్రమంలో అయితే అన్ని పార్టీల నేతలు కలిసి మాట్లాడుకునేవారు. గడిచిన పదేళ్లు ఏపీలో ఆ సంస్కృతి లేదు. కంప్లీట్‌గా మారిపోయింది. నేతలు ఎదురుపడినా పలకరించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు బొత్స రూటు మార్చినట్టు కనిపిస్తోంది.
విజయవాడలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు మండలి ప్రతిపక్ష హోదాలో బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. గడిచిన పదేళ్లు ఈ విధంగా ఎవరూ పాల్గొనలేదు. కేబినెట్ హోదా కలిగిన ఆయనకు మంత్రులతోపాటు సీటు కేటాయించారు. మంత్రి నారా లోకేష్ స్టేజ్‌పైకి వస్తూ సహచర మంత్రులు, అధికారులను పలకరిస్తూ వచ్చారు.
అదే వరుసలోవున్న బొత్స వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. బొత్స కూడా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ పలకరించారు. ఈ సన్నివేశం అక్కడున్న వారందర్నీ ఆకట్టు కుంది. వైసీపీకి చెందిన నేత ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావడం గడిచిన పదేళ్లలో ఇదే తొలిసారి. గతంలో ఆ పార్టీ అనుసరించిన విధానానికి భిన్నంగా వ్యవహరించారు.
ALSO READ: పంచగ్రామాల సమస్యకు ఫుల్‌స్టాప్.. 92 వేల మందికి ఊరట
గతంలో పీఏసీ ఎన్నికలు జరిగినప్పుడు తన కారు దగ్గరకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పలకరించారు బొత్స. ఆ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో సమీపంలోవున్న వైసీపీ నేతలు పక్కకు వెళ్లిపోయారు.
గడిచిన పదేళ్లు అధికార ప్రభుత్వాలు నిర్వహించే ఏ కార్యక్రమానికి విపక్ష నేతలు హాజరుకాలేదు. బొత్సకు ఆ ఫ్రీడమ్ ఉందని అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఆయన మళ్లీ పూర్వ సంప్రదాయాలను పాటిస్తున్నారని అంటున్నారు. ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే.. రెండోవైపు బొత్స వ్యవహారశైలిని జాగ్రత్తగా గమనిస్తోంది వైసీపీ హైకమాండ్.
బొత్స కదలికలపై ఫ్యాన్ పార్టీలో చిన్నపాటి చర్చ మొదలైపోయింది. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచే బొత్స రూటు క్లియర్ చేసుకున్నారా? హైకమాండ్ ఆలోచనలకు దూరంగా ఉంటున్నారా? అధికార పార్టీకి కాసింత దగ్గరవుతున్నట్లు కొందరు నేతలు మాట్లాడుకోవడం మొదలైంది. మొత్తానికి రాబోయే రోజుల్లో బొత్స గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.