Bank Employees In Cyber Fraud Hyderabad | ప్రైవేట్ బ్యాంకుల అధికారులు సైబర్ నేరగాళ్లతో కలిసి పనిచేస్తున్నట్లు బయటపడింది. నేపాల్, చైనా దేశాల్లో కూర్చుని, దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని.. యాప్ల ద్వారా వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులతో స్థానిక ప్రైవేట్ బ్యాంకుల మేనేజర్లు కుమ్మక్కవుతున్నారు. ప్రజలందరూ బ్యాంకులపై ఎంతో నమ్మకంతో తమ డబ్బుని ఖాతాల్లో దాచుకుంటారు. అలాంటిది బ్యాంకు అధికారులే దోపిడీలు చేస్తుండడం ఆందోళన కలిగించే విషయం. రెండు కేసుల దర్యాప్తు నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు వీరి పాత్రను గుర్తించారు. ఆర్బిఎల్, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకులకు చెందిన ముగ్గురు బ్యాంకు అధికారులను అరెస్టు చేశారు.
ప్రత్యేక బృందాలు పది రాష్ట్రాల్లో చేసిన దాడుల్లో ఈ ముగ్గురితో సహా మొత్తం 52 మందిని పట్టుకున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నిందితులపై నగరంలో 33, రాష్ట్రంలో 74, దేశవ్యాప్తంగా 576 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామన్నారు. డీసీపీ దార కవిత, ఏసీపీ ఆర్‌జీ శివ మారుతిలతో కలిసి బుధవారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ ఆనంద్ ఈ వివరాలు వెల్లడించారు.
సేవింగ్స్ ఖాతాలకు ఒక రేటు, కరెంట్ ఖాతాలకు ఒక రేటు అనే విధంగా సైబర్ నేరాల సూత్రధారులు.. బాధితుల నుంచి నగదు డిపాజిట్ చేయించుకోవడానికి సేవింగ్స్ ఖాతాలు, కాజేసిన భారీ మొత్తాలను డ్రా చేసుకోవడానికి కరెంట్ ఖాతాలు అవసరం. దీనికోసం వీరు నేపాల్ నుంచి కొందరిని దళారులుగా మార్చుకున్నారు. వీరు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో సంచరిస్తూ.. స్థానిక మధ్యవర్తుల ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా బ్యాంకు ఖాతాలు తెరిచి ఇవ్వాలని, లావాదేవీల్లో నిబంధనల ఉల్లంఘనలను కూడా చూసీ చూడనట్లు వదిలేయాలని చెప్పి ఒప్పందాలు చేసుకుంటున్నారు. సేవింగ్స్ ఖాతాకు రూ.50 వేల వరకు, కరెంట్ ఖాతాకు రూ.80 వేల వరకు తీసుకుంటున్న బ్యాంకు అధికారులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. ఆయా ఖాతాలకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ సేవలను ఆపరేట్ చేయడానికి అవసరమైన వివరాలన్నీ ఈ బ్యాంకు అధికారులు టెలిగ్రామ్ యాప్ ద్వారా సూత్రధారులకు చేరవేస్తున్నారు.
Also Read: 5 పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ వైద్యురాలు.. సోషల్ మీడియాతో ఆటకట్టు
కేసుల దర్యాప్తులో వెలుగు చూసిన లింకులు
నేపాల్ నుంచి మహేష్ అనే వ్యక్తి ద్వారా బెంగళూరు విద్యారణ్యపురంలోని ఆర్బిఎల్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ శుభం కుమార్ ఝా, మల్లీశ్వరంలోని యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హరూన్ రషీద్, ఫ్యాబ్రికేషన్ వ్యాపారి ఆర్.మోహన్ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించారు. వివిధ బ్యాంకుల్లో 20 బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వీరు సహకరించారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.23 కోట్లు కాజేశారు. హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన రూ.93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో బెంగళూరు లింకులు గుర్తించిన పోలీసులు ఆ ముగ్గురినీ పట్టుకొని కటకటాల్లోకి పంపారు. అలాగే గతంలోనే జరిగిన, రూ.2.06 కోట్ల దోపిడీతో ముడిపడి ఉన్న మరో ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో హైదరాబాద్ జేఎన్టీయూలో ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ సేల్స్ మేనేజర్ కాటా శ్రీనివాస్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇతడితో పాటు తమ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరవడానికి సహకరించిన వారినీ పోలీసులు అరెస్టు చేశారు.
తొలిసారిగా క్రిప్టో కరెన్సీ స్వాధీనం
ఈ ఫ్రాడ్‌లో పలువురు నిందితులు నగరానికి చెందిన వారే అని తేలింది. వీరంతా టెలిగ్రామ్ యాప్ ద్వారా నేరగాళ్ల నెట్‌వర్క్‌లోకి ప్రవేశించారు. వీరి నుంచి రూ.47.5 లక్షల నగదుతో పాటు క్రిప్టో కరెన్సీ రూపంలో ఉన్న రూ.40 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రిప్టో కరెన్సీని సీజ్ చేయడం.. నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఈ ఖాతాల ద్వారా జరిగే ప్రతి లావాదేవీకి గాను కాటా శ్రీనివాస్‌కు ఒక శాతం కమీషన్‌గా ముట్టేదని పోలీసులు వెల్లడించారు.
పలు మోసాల్లో నిందితులుగా..
ఈ కేసులో వీరితో పాటు అరెస్టు అయిన 52 మంది నిందితులు ఆన్‌లైన్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఎర వేసి, వివిధ రకాలైన పేర్లు చెప్పి నగర వాసుల నుంచి రూ.8.83 కోట్లు కాజేసిన కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారు. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఎర వేసి, పెట్టుబడుల పేరుతో స్వాహా చేసే ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌తో పాటు డిజిటల్ స్కామ్స్ కేసుల్లోనూ వీరు నిందితులుగా ఉన్నారు. కాగా పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.2.87 కోట్లు ఫ్రీజ్ చేశారు.
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు
‘‘సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి మేము ఉక్కుపాదం మోపుతున్నాం. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పిరామల్ ఫైనాన్స్ సంస్థతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం’’ అని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.