AP Politics : జోగి రమేష్. జగన్‌కు నమ్మినబంటు. అధినేత కోసం ఏదైనా చేస్తారు. చంద్రబాబు ఇంటిపైనా దాడి చేస్తారు. టీడీపీ ఆఫీసునైనా ధ్వంసం చేస్తారు. ప్రెస్‌మీట్లు పెట్టి తిడతారు. బూతులు మాట్లాడుతారు. అంతగా విశ్వాసంగా పని చేశారు కాబట్టే.. ఆయన్ను మంత్రిని కూడా చేశారు. అలాంటి జోగి రమేష్ సడెన్‌గా జగన్‌కు షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి యూ టర్న్ తీసుకున్నారు. జై అమరావతి.. జైజై అమరావతి.. అంటూ కొత్త నినాదం అందుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతియే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందంటూ బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేశారు. ఎందుకు? సడెన్‌గా అమరావతిపై అంత ప్రేమ ఎందుకు వచ్చింది? అమరావతియే రాజధాని అనేది పార్టీ విధానమా? ఆయన సొంత అభిప్రాయమా? జగనే జోగితో లీకు ఇచ్చారా? జగన్‌కు జోగి షాక్ ఇచ్చారా? కేసుల భయంతోనే అలా మాట్టాడారా? ఇలా జోగి రమేష్ కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో కాక రేపుతున్నాయి.
జైజై అమరావతి..
అమరావతిలోనే క్యాపిటల్ ఉంటే బాగుండేది.. 3 రాజధానులతో నష్టపోయామంటూ.. దారుణ ఓటమి తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్‌కు తత్వం బోధపడింది. అమరావతినే రాజధానిగా కొనసాగించి ఉంచితే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అంటూ బిగ్ టీవీ బిగ్ ఇంటర్వూలో జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని.. ప్రజలు కోరుకున్నట్టు అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని జోగి రమేష్ అన్నారు. తాము మళ్లీ మూడు రాజధానుల జోలికి వెళ్లమని చెప్పారు. మళ్లీ జగన్ సీఎం అయ్యాక.. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తారని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా అమరావతినే రాజధాని చేయాలని కోరారని.. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ నాయకులైనా ప్రజల తీర్పును గౌరవించాల్సిందే అన్నారు.
నా భార్య నన్ను తిట్టింది..
తాము అధికారంలో ఉన్నపుడు అమరావతి రైతులపై తమ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు దాడులు చేశారని.. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై దాడులు చేయడం తప్పేనని జోగి రమేష్ అంగీకరించారు. ఆ తప్పు ఇప్పుడు తమకు తెలిసొచ్చిందన్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై చేసిన కామెంట్స్ సైతం వైసీపీకి తీరని నష్టం చేసిందన్నారు జోగి రమేష్. తన భార్య కూడా తనను నిలదీసిందని.. అసెంబ్లీకి వెళ్లేది ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడేందుకా? చంద్రబాబు భార్యపై అలా మాట్లాడొచ్చా? అని ప్రశ్నించినట్టు చెప్పారు.
జోగి భయపడుతున్నారా?
మాజీ మంత్రి జోగి రమేష్‌లో సడెన్‌గా ఇంతటి ఛేంజ్ ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ కనిపిస్తు్న్నాయి. అమరావతియే ఏపీకి ఏకైక రాజధాని అనేది వైసీపీ స్టాండా? జగనే అలా చెప్పారా? జోగి రమేషే అలా అంటున్నారా? అనేదానిపై క్లారిటీ లేదు. ఆ ప్రాంత నేత కాబట్టే.. ఆయన అలా జరిగిన నష్టాన్ని కవర్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారా? అనే డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ను కాదని జోగి వ్యక్తిగతంగా ఈ కామెంట్స్ చేశారా? అలా చేసి ఉంటే రమేష్ లెక్క ఏమై ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ తదితరులు జైల్లో పడుతున్న ఇబ్బందులు చూసి.. తనకూ అదే గతి పడుతుందని భయపడుతున్నారా? కేసుల వర్రీతోనే జోగి ఇలా జై అమరావతి నినాదం అందుకున్నారా? జగన్‌కు సంబంధం లేకుండా అనేశారా? జగన్‌కు తెలిస్తే ఊరుకుంటారా? ఇలా అనేక కోణాలు కనిపిస్తున్నాయి ఈ ఎపిసోడ్‌లో. లేదంటే.. జగనే కావాలనే జోగి రమేష్‌తో అమరావతికి అనుకూలంగా మాట్లాడించారా? 3 రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకుందా? అని కూడా అంటున్నారు.
మరోవైపు, రాజధాని అమరావతి మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఎడిటర్ కెఎస్ఆర్, కృష్ణంరాజు చిత్రపటాల మహిళలు చెప్పులతో కొట్టారు. అసభ్యకర మాటలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.