వాస్తవానికి పవన్ కల్యాణ్ పై వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా విపరీతమైన విద్వేష వార్తలిచ్చేది. ఎన్నికల ఫలితాల తర్వాత ఏడాది వరకు ఇదే జరిగింది. కానీ ఇప్పుడిప్పుడే వారి మాటతీరు మారుతోంది. పవన్ పై ఎక్కడలేని సింపతీ చూపిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ తో పోల్చి చూస్తే పవన్ డమ్మీగా మారిపోయారంటూ కౌంటర్లిస్తున్నారు. ఇక్కడ లోకేష్, పవన్ ని తొక్కేస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి మూలస్తంభమైన పవన్ మోసపోయారంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. అంటే ఎలాగైనా కూటమిలో చిచ్చు పెట్టాలనేది వారి ప్లాన్. అందుకే పవన్ పై జాలి చూపించడం మొదలు పెట్టారు.
లోకేష్ వర్సెస్ పవన్..
టీడీపీ రాజకీయ వారసుడిగా లోకేష్ ని ప్రొజెక్ట్ చేసే క్రమంలో పవన్ కల్యాణ్ ని సైడ్ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. అటు ప్రభుత్వ పరమైన నిర్ణయాలు, ఎంఓయూలు కుదుర్చుకోవడంలో కూడా లోకేష్ పాత్ర ఎక్కువగా ఉంటోందని, పవన్ కి ఆ పాటి ప్రాధాన్యత లేదని అంటున్నారు. తన ఉనికిని చాటుకోడానికి పవన్ వివాదాస్పద వ్యాఖ్యలను ఎంచుకుంటున్నారనేది వైసీపీ అనుకూల మీడియా కథనాల సారాంశం.
దూరం పెంచేలా..
అసలీ సింపతీ గేమ్ ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మొదలు పెట్టారు. టీడీపీ అనుకూల మీడియాలో కేవలం చంద్రబాబు, లోకేష్ వార్తలే వస్తున్నాయని, పవన్ ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారాయన. క్రమంగా వైసీపీ అనుకూల మీడియా కూడా పవన్ పై సింపతీ చూపించడం మొదలు పెట్టింది. ఇటీవల లోకేష్ కి ప్రభుత్వంలో ప్రయారిటీ పెరిగిపోతోందని, అదే సమయంలో పవన్ మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదని అంటున్నారు. ఈ మాటల మర్మం అందరికీ తెలిసిందే. పవన్-చంద్రబాబు మధ్య దూరం మొదలైతే.. ఆ దూరాన్ని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తోంది వైసీపీ. మరి అది సాధ్యమేనా..? ఇలాంటి వార్తలతో కూటమిలో విభేదాలు మొదలవుతాయా..? అనేది తేలాల్సి ఉంది.
ఎప్పటికైనా నష్టమే..
సింహం, సింగిల్ జర్నీ అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పుకున్నారు వైసీపీ నేతలు. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసినా తమకు పరవా లేదని, కలవకపోయినా ఇబ్బంది లేదని అన్నారు. అయితే కూటమి వల్ల తమకు నష్టం ఉందని వారు ఊహించినా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఓ దశలో పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడారు. టీడీపీ విదిల్చిన సీట్లను పవన్ తీసుకుంటున్నారని, జనసేనని తాకట్టు పెట్టారని కూడా విమర్శించారు. కానీ పవన్ ఈసారి అలాంటి వ్యాఖ్యల్ని లైట్ తీసుకున్నారు. వైసీపీ విమర్శలను పట్టించుకోలేదు, కూటమి కుదిర్చారు. చివరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో వైసీపీకి విషయం బోధపడింది. అప్పట్లో కూటమి వల్ల తమకు ఇబ్బందుల్లేవు అని చెప్పిన వైసీపీ నేతలే, ఎన్నికల తర్వాత పవన్ వల్లే తమకు నష్టం జరిగిందని ఒప్పుకున్నారు. దీంతో ఇప్పుడు వారి టార్గెట్ మారింది. కూటమి కుదురుగా ఉంటే ఎప్పటికైనా తమకు నష్టమేనని తెలిసొచ్చింది. అందుకే పవన్ పై జాలి చూపిస్తూ.. ఆయన్ను కూటమినుంచి దూరం చేయాలనుకుంటున్నారు.