ఈనెల 18నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవి నాలుగో సమావేశాలు. అయితే ఈ సమావేశాలకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే తాను అసెంబ్లీకి రానని తెగేసి చెప్పారు జగన్. అన్నట్టుగానే గత సమావేశాలకు ఆయనతోపాటు ఎమ్మెల్యేలెవరూ రాలేదు. ఈసారి కూడా ఆయన అసెంబ్లీకి వచ్చేలా లేరు. జగన్ సహా ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నట్టుగా లేరు. ఒకవేళ టీడీపీ నేతలు హెచ్చరించినట్టుగా అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు తెస్తే, పార్టీపై కాస్తో కూస్తో సింపతీ వస్తుందనే ఆశలో వారు ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ సహా అసెంబ్లీ సమావేశాలపై ఎవరూ స్పందించకపోవడానికి కారణం ఇదేనంటున్నారు.
సాక్షిలో పోరాటం..
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలు ఓ వరం అని చెప్పాలి. ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, ఆ విమర్శలతో ప్రజల్లో ఆసక్తి రేకెత్తించాలన్నా అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంటారు. కానీ వైసీపీ మాత్రం ఆ పని చేయడం లేదు. ఎంతసేపు సాక్షి ఛానెల్ లో విమర్శలు చేస్తే చాలు, తమ ప్రసంగాలు సాక్షి పేపర్ లో వస్తే చాలు అనుకుంటున్నారు. జగన్ కూడా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలన్నీ ప్రెస్ మీట్ లో చెబుతుంటారు. పోనీ ఆ ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ లందరికీ ప్రశ్నలు వేసే అవకాశం ఇస్తారా అంటే అదీ లేదు. కొంతమందిని సెలక్టివ్ గా ప్రెస్ మీట్ కి పిలిపించుకుని, తమకి నచ్చిన ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానం చెబుతారు. అది కూడా కష్టం అనుకుంటే ఆయన మీడియా సమావేశాన్ని ఎడిట్ చేసి, ఆ తర్వాత లైవ్ టెలికాస్ట్ చేస్తుంటారు.
జగన్ అసెంబ్లీకి రాకపోతే ఏం జరుగుతుంది?
జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈపాటికే హెచ్చరించారు ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు. జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప ఎన్నికలొస్తాయని చరుకలంటించారు. కానీ ఈ మాటల్ని వైసీపీ సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. అసలు డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలపై వైసీపీ అస్సలు స్పందించలేదు. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలైనా కూడా ఎమ్మెల్యేలలో కదలిక లేదు. సో.. వారంతా అసెంబ్లీకి వచ్చేందుకు వెనకాడుతున్నారనే అనుకోవాలి. ఒకవేళ నిజంగానే నిబంధనల ప్రకారం అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, ఉప ఎన్నికలు జరిపిస్తే అంతకంటే కావాల్సిందేముంది అన్నట్టుగా వైసీపీ ఎదురు చూస్తోంది. సింపతీ కోసం జనంలోకి వెళ్లేందుకు ఓ అవకాశం కోసం వారు ఎదురు చూస్తున్నారు. గెలుపు, ఓటములు పక్కనపెడితే.. కూటమి ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ప్రజలకు చెప్పే అవకాశం ఉంది.
మరి మండలి సంగతేంటి?
అసెంబ్లీకి రాలేమని మారాం చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, అదే పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం ఠంచనుగా మండలికి హాజరవుతున్నారు. మండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అదే పని జగన్ ఆధ్వర్యంలో అసెంబ్లీలో కూడా చేయొచ్చు కదా అంటే వారి నుంచి సమాధానం లేదు. మండలికి వస్తాం, అసెంబ్లీకి రాలేము అని చెబుతున్న వైసీపీ నేతల మాటల్లో లాజిక్ ఏంటో వారికే తెలియాలి.