స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే జరుగుతోంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలై 11 మంది ఎమ్మెల్యేలకే పరిమితం కావడంతో ఓడిన కీలక, ముఖ్య నేతలు, సీనియర్లు, మాజీ మంత్రులు, ద్వితియ శ్రేణి నేతలు, కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ సైతం జంపింగ్ చేసేస్తున్న పరిస్థితి. అయితే ఎవరున్నా, లేకున్నా జెండా మోసే కార్యకర్త, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎప్పటికీ పర్మినెంట్ అనే డైలాగ్‌ను గుర్తు చేసుకుంటూ క్యాడర్ ముందుకెళ్తున్నది. ఇదే క్రమంలో టీడీపీ, జనసేన పార్టీలు చేరికలతో హౌస్ ఫుల్ అవుతున్న పరిస్థితులు కూడా చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తయితే వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నప్పటికీ ఈ పార్టీలోనూ చేరడానికి సీనియర్లు, మాజీలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉండటం గమనార్హం. దీంతో అధినేత మాత్రం ఒకరు పోతే వంద మంది తయారు చేస్తానన్న ధీమాతో క్యాడర్‌ను కాపాడుకుంటూ, రానున్న ఎన్నికలకు సిద్ధం అంటూ ప్రజాక్షేత్రంలోకి వచ్చేస్తున్నారు.
అవన్నీ మామూలే..
ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత నేతలు జంపింగ్‌లు చేయడం పరిపాటిగా వస్తున్నదే. ఇది అన్ని రాజకీయ పార్టీల్లో ఉండేదే. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో ఇక చాలు బాబోయ్ అనేంతలా 23 మంది సిట్టింగ్‌లు వైసీపీకి గుడ్ బై చెప్పేసి సైకిలెక్కేశారు. దీంతో ఇంకా వైసీపీ బతికి బట్ట కడుతుందా? అని చర్చించుకుంటున్న సమయంలో, ఐదేళ్లు తిరగక మునుపే వైసీపీలోకి అంతకుమించి నేతలు జంప్ అయిన పరిస్థితి. దీంతో సీన్ రివర్స్ అయినట్లు అయ్యింది. ఆఖరికి 2019 ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో, ఎవర్ని పక్కనెట్టాలో కూడా దిక్కుతోచని స్థితి వైసీపీకి వచ్చి పడింది. పార్టీలు మార్పు, చేరికలు అని మామూలుగానే నడుస్తుంటాయ్. ఇవాళ ఈ పార్టీలో ఉన్న నేత రేపొద్దున్న ఎప్పుడు కండువా మార్చేసి ఉంటారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితులు సైతం అందరూ చూసే ఉంటారు. 2024 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఏపీలో నెలకొంది. వైఎస్ జగన్‌కు వరుస షాకులిస్తూ చచ్చే వరకూ పార్టీలోనో ఉంటానని, చచ్చాక వైసీపీ కండువానే కప్పుకుని పోతానని చెప్పిన నేతలే జంప్ అయిన వారిలో ఉన్నారు, ముహూర్తం ఫిక్స్ చేసుకుని కండువా మార్చడానికి సిద్ధమై కూర్చున్నారు. సరైన సమయం రావాలే కానీ జంప్ కావడానికి రెడీగా ఉన్న లీడర్లు లెక్కలేనంత మందే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
హౌస్ ఫుల్!
ఎన్నికల ముందే మొదలైన జంపింగ్‌లు, వైసీపీ ఓడిన తర్వాత ఇంకాస్త పెరిగి, నాన్ స్టాప్‌గా కొనసాగుతూనే ఉన్నాయి. అటు టీడీపీ, ఇటు జనసేనలోకి కండువాలు కప్పేసుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ ఎక్కడికక్కడ సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతున్నారు. టీడీపీ కాదంటే జనసేన ఇక్కడా రెడ్ సిగ్నల్ బీజేపీ అన్నట్లుగా నేతలు వెళ్లిపోతున్నారు. కొత్త నేతల రాకతో పాత నేతలతో పంచాయితీలు కూడా నడుస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల చేరికలను సిట్టింగ్‌లు వ్యతిరేకిస్తుండటం, ఆఖరికి కొట్టుకుంటున్న ఘటనలు కోకొల్లలు. ఈ పరిస్థితి క్యాడర్ మధ్యే కాదు నేతల్లోనూ ఉంది. ఇప్పట్లో ఈ చేరికలు, గొడవలకు ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేంతవరకూ నేతలు పాలి‘ట్రిక్స్’ చేస్తూనే ఉంటారంతే. అయితే మారిన తర్వాత కూడా ఐదేళ్లపాటు అదే పార్టీలో ఉంటారా అంటే అదీ ప్రశ్నార్థకమే. ఎందుకంటే నామినేటెడ్ పదవో, ఏదో ఒక రీతిన లాభం చేకూరేలా ఉంటే తప్ప ఆయా పార్టీల్లో మసలుకోలేని పరిస్థితి అయితే నేతల్లో ఉంది. ఇందుకు చక్కటి ఉదాహరణే వైసీపీ నుంచి జంప్ అయిన మాజీ మంత్రి, సీనియర్ నేత. పార్టీ మారగానే ఎమ్మెల్సీ అని ఆ తర్వాత మంత్రి పదవి కూడా దక్కుతుందని ఎంతో ఆశపడ్డారు కానీ అవన్నీ అడియాసలే అయ్యాయి. మరోవైపు అధికారంలో ఉన్న పార్టీలతో మనకెందుకులే అని వ్యాపారాలు కాపాడుకోవడానికి, స్థానికంగా భయపడి వెళ్లిపోతున్న వాళ్లు ఎంత మందో లెక్కేలేదు. భారీగా, ఊహించని రీతిలో చేరికలు ఉంటాయని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటూ ఉన్నారు.
జగన్ ధీమా ఏంటి?
ఎన్నికల ముందు, ఆ తర్వాత, ఇప్పటికీ వైసీపీ నేతల జంపింగ్‌లు సాగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నియోజకవర్గాలు, కొన్ని జిల్లాల్లో వైసీపీకి పెద్ద దిక్కు అనేదే లేకుండానే పోయింది. అయినా సరే అధినేత మాత్రం ధీమాగానే ఉన్నారు. ఎందుకంటే 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను చూస్తే చాలామందే సాధారణ కార్యకర్తలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్లే ఉన్నారు. ఒకరు పోతే వంద మందిని తయారు చేస్తాననే నమ్మకమే జగన్ ధీమాకు కారణమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు వైసీపీకి యువ రక్తం ఎక్కిస్తే ఇంకాస్త ఊపు ఉంటుందనే ఆలోచన సైతం అధినేతకు ఉందని మరికొందరు చెబుతున్నారు. అయినా పార్టీ ఆవిర్భావం సమయంలో, ఆ తర్వాత ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ మాత్రమే గెలిచారు, ఉన్నారు కూడా. ఆ తర్వాతే పార్టీకి అమాంతం ఆదరణ రావడం, అప్పటి వరకూ రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవ్వడం మొదలైంది. అందుకే ఎవర్నీ తక్కువ అంచనా వేయలేం, వేయకూడదు కూడా అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పటి వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్క చూపులు చూడకపోవడం కాసింత పార్టీకి ప్లస్ అనే చెప్పుకోవచ్చు.
Also Read: ఖర్చుల్లో జగన్ రారాజు.. ఏది పట్టుకున్నా కోట్లలో
ఇది కదా ట్విస్ట్ అంటే?
రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, అధికారంలో ఉన్నప్పుడు ఆహో, ఓహో అని జగన్‌ను పొగిడిన నేతలే నేడు జగన్ వ్యవహార తీరు బాగాలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కోటరీని మొత్తం పక్కనెట్టడం, నేతలు, కార్యకర్తలు, అభిమానులతో నేరుగా కలుసుకోవడం, జనంలోకి వస్తుండటంతో ఇప్పుడిప్పుడే పార్టీ గాడిన పడుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికితోడు యంగ్ లీడర్ కావడంతో భవిష్యత్ కోసం యువ నేతలు, సీనియర్లు, మాజీలు ఇతర పార్టీల నుంచి రావడానికి సిద్ధమయ్యారంటే ఇదొక ట్విస్టే అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత శైలజానాథ్ ఆయన ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా రాయలసీమలో పదుల సంఖ్యలో నేతలు ఇదే బాట పట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాలోనూ జగన్ సమక్షంలో చేరడానికి, జనంలోకి వచ్చాక కండువా కప్పుకుంటారనే చర్చ జరుగుతోంది. అటు టీడీపీ, జనసేనలో హౌస్‌ఫుల్ అవుతున్న కొద్దీ, ఇటు వైసీపీకి యువ రక్తం, సినియార్టీని జగన్ చూస్తున్నారన్న మాట. చివరికి ఎవరు ఏ పార్టీలో చేరిపోతారో, ఎక్కడ మిగిలిపోతారో అని ఆయా పార్టీల క్యాడర్ చూస్తోంది.