Austrian Couple Welfare Fraud: ప్రజలకు చేయూత అందించేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. ఆర్థికంగా వెనుకబడిన వారిని అండగా నిలిచే ప్రయత్నం చేస్తాయి. కానీ, కొంత మంది స్కీమ్ లోని లొసుగులను ఉపయోగించుకుని పెద్ద పెద్ద స్కామ్ లకు పాల్పడుతారు. అప్పనంగా డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తారు. అచ్చంగా ఇలాంటి పనే చేసింది ఓ వృద్ధ జంట. ప్రభుత్వం పథకంలోని లూప్ హోల్స్ పట్టుకుని భారీ కుంభకోణానికి పాల్పడింది. ఇందుకోసం గత నాలుగు దశాబ్దాల్లో ఏకంగా 12 సార్లు విడాకులు తీసుకున్నారు. మళ్లీ కొద్ది రోజుల్లోనే కలిసిపోయేవారు. చివరకు అసలు విషయం బయటపడింది. వీళ్లు చేసిన పని చూసి అధికారులు షాకయ్యారు. ఈఘటన ఆస్ట్రియాలోని వియాన్నాలో జరిగింది.
ఒంటరి మహిళలకు ఆస్ట్రియా సర్కారు ఆర్థికసాయం
ఆస్ట్రియా ప్రభుత్వం భర్త చనిపోయిన లేదంటే భర్తతో విడాకులు తీసుకున్న మహిళలకు ఆర్థికసాయం అందిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో అర్హులైన మహిళలు ప్రతి సంవత్సరం 28, 300 డాలరు, భారత కరెన్సీలో సుమారు రూ.24 లక్షల ఆర్థికసాయాన్ని పొందుతారు. ఈ పథకంలోని లూప్ హోల్స్ ను పట్టుకుని ఓ జంట మాస్టర్ ప్లాన్ వేసింది. విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా 43 ఏండ్ల సంసార జీవితంలో ఏకంగా 12 సార్లు ఈ పథకానికి అప్లై చేసుకుంది. ప్రభుత్వం నుంచి ఏకంగా 3.42 లక్షల డాలర్లు, భారత కరెన్సీలో సుమారు రూ. 3 కోట్లు కొల్లగొట్టింది.
అసలు విషయం తెలిసి అధికారులు షాక్
73 ఏండ్ల మహిళ 1980లో తొలిసారి వివాహం చేసుకుంది. 1981లో ఆమె భర్త చనిపోయాడు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం పొందింది. ఆ తర్వాత ఓ ట్రక్ డ్రైవర్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తనతో కూడా విడిపోయింది. మరోసారి ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవడం, తర్వాత విడిపోవడం కామన్ అయ్యింది. గత 43 ఏళ్లుగా వాళ్లు ఇలాగే నాటకమాడుతున్నారు. రీసెంట్ గా సదరు మహిళ తన భర్తకు 12వ సారి విడాకులు ఇచ్చింది. ఎప్పటిలాగే పెన్షన్ కోసం అప్లై చేసుకుంది. అధికారులకు డౌట్ వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఈ ఘటన ఆస్ట్రియాలో అందరినీ షాక్ కి గురి చేసింది.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా కష్టాలు పడే మహిళల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని మిస్ యూజ్ చేయడం పట్ల ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన వెలుగు చూడటంతో ఇంకా ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయేమోనని ఆరా తీస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న లబ్దిదారుల లిస్టును వెరిఫై చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు భారీ కుంభకోణానికి పాల్పడిన మహిళతో పాటు దీనికి సహకరించి వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, కటకటాల్లోకి పంపించారు.
Read Also: కేవలం రూ.85తో ఇల్లు కొనేసింది.. కానీ, దాని రెన్నోవేషన్‌కు ఎంత అయ్యిందో తెలిస్తే.. ఏమైపోతారో!