అసెంబ్లీలో వైసీపీ సభ్యులు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి సభలోకి రాకుండా పారిపోతున్నారంటూ సాక్షాత్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చాలా పెద్ద కామెంట్ చేశారు. సహజంగా ఇలాంటి కామెంట్లపై వెంటనే వైసీపీ నుంచి రియాక్షన్ రావాలి. సభకు వస్తున్నామనో, లేక రాలేకపోతున్నామనో, అసలు తాము సంతకాలు పెట్టలేదనో, లేక తమ పేరుతో ఇంకెవరైనా పెడుతున్నారనో అనాలి. కానీ ఇంత వరకు వైసీపీ నుంచి సౌండ్ లేదు. అంటే దొంగ సంతకాలు నిజమేనని ఆ పార్టీ ఒప్పుకున్నట్టైందని టీడీపీ ఎద్దేవా చేస్తోంది. ఆఖరికి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేతలు కూడా ఇంత చీప్ గా ప్రవర్తిస్తారా అంటూ కౌంటర్లిస్తున్నారు.
సింగిల్ సింహం..!
వైసీపీ వాళ్లు జగన్ ని సింగిల్ సింహంతో పోలుస్తుంటారు. ప్రతి ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా జగన్ సింగిల్ గా బరిలో దిగుతారనేది వారి మాటల సారాంశం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ని ఒంటరి చేశారంటూ టీడీపీ ఓ రేంజ్ లో కౌంటర్లివ్వడం విశేషం. ఎమ్మెల్యేలుగా తమపై అనర్హత వేటు పడుతుందేమోననే భయంతో కొంతమంది అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకాలు పెడుతున్నారు. అయితే సభకు మాత్రం రావడం లేదు. ఇది జగన్ తీర్మానానికి విరుద్ధం. తనను ప్రతిపక్షనేతగా గుర్తిస్తేనే సభకు వస్తామని భీష్మించుకు కూర్చున్నారాయన. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఆయన శపథం పట్టించుకోకుండా తమ సీట్లు కాపాడుకోవడం కోసం పాకులాడటం విశేషం.
జగన్ కి ప్రతిపక్ష నేత హోదా కావాలి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం తమ పదవులు మిగలాలి. ఈ క్రమంలో స్పష్టంగా అక్కడ సంఘర్షణ మొదలైంది. ఒకవేళ జగన్ పై అనర్హత వేటు పడినా.. ఆయన మాత్రం తన సీటులో గెలిచే అవకాశాలు ఎక్కువ. అదే సమయంలో మిగతా వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే.. ఆయా ప్రాంతాల్లో వారు గెలవాలంటే కత్తిమీద సాము చేయాలి. ఆర్థికంగా బాగా చితికిపోతారనేది వేరే విషయం. దీంతో వారంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు. అయితే ఇక్కడ సంతకాలపై వైసీపీ పూర్తిగా కార్నర్ అయిపోయింది. తమ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారనే విషయంపై కనీసం స్పందించడానికి కూడా ఆ పార్టీ తరపున ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. ఈ విషయంలో వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా తేలు కుట్టిన దొంగలా మారింది. కనీసం దానిపై స్పందించేంత సాహసం కూడా వైసీపీ నేతలెవరూ చేయట్లేదు. జగన్ పేరెత్తితేనే అంతెత్తున ఎగిరిపడే సోషల్ మీడియా మేథావులు కూడా ఈ దొంగసంతకాలను కవర్ చేయలేక కష్టపడుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ స్పందించలేదంటే దానర్థం దొంగ సంతకాలు నిజమనే. దీంతో ఆ పార్టీ పరువు పూర్తిగా మంటగలిసిందని అంటున్నారు. అయితే ఇక్కడ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రం స్పందించారు. ఇక్కడ కూడా ఆయన బహుజన ఎమ్మెల్యేలను దొంగలన్నారంటూ టాపిక్ ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం విశేషం. ఆయన రెస్పాన్స్ ని మాత్రం వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటోంది కానీ, పార్టీ తరపున ఎవ్వరూ మాట్లాడే సాహసం చేయడం లేదు.
దొంగ సంతకాలపై వైసీపీ సైలెన్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ మాటను బేఖాతరు చేసి అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెడుతున్న వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా..? లేక జగన్ కూడా ఎందుకీ తలనొప్పి అనుకుంటూ అసెంబ్లీకి వచ్చేస్తారా..? వేచి చూడాలి.