CM Revanth Reddy: టెంపర్‌మెంట్‌లో తగ్గేదేలే.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పేశారు. 20 ఏళ్లైనా రాజకీయాల్లో తన టెంపర్‌మెంట్ మార్చుకోలేదని.. మార్చుకోబోనని అన్నారు. ట్రాన్స్‌ఫార్మ్ కావాలని కొందరు తనకు సలహాలిస్తున్నారు కానీ.. తాను హుందాగా ఉంటే అర్థం చేసుకునే వాళ్లు ఉండాలిగా అంటూ కొట్టిపడేశారు. సీఎంగా ఉంటూ రేవంత్‌రెడ్డి అలా మాట్లాడుతారా అంటూ ఇన్నాళ్లూ కేటీఆర్, హరీశ్ రావులు చేస్తున్న బ్లేమ్ గేమ్‌పై ఇలా సూటిగా, సుత్తి లేకుండా కౌంటర్ ఇచ్చారు. తాను మారేదే లేదని.. టెంపర్‌మెంట్ తగ్గించుకునేదే లేదని తేల్చిపడేశారు రేవంత్. ముఖ్యమంత్రిగా విజ్‌డమ్‌లో తన స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకుంటున్నానని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి చాలా కూల్‌గా.. స్మూత్‌గా.. కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రొటీన్‌కు భిన్నంగా ఏమాత్రం ఆవేశపడకుండా.. ఏమాత్రం ఉగ్రరూపం ప్రదర్శించకుండా.. చాలా పొలైట్‌గా తాను తలుచుకుంటే ఏం చేయగలనో చక్కగా వివరించి హెచ్చరించారు. తెలంగాణ గరం.. నరం.. బేషరం.. అనే నానుడు ఉందని గుర్తు చేశారు. రాజకీయాల్లో మొదటి పదేళ్లు గరం గరంగా ఉంటారని.. మరో పదేళ్లు నరం.. ఆ తర్వాత పదేళ్లు బేషరంగా బతుకుతారనే సామత సరికాదన్నారు. తాను మరో పదేళ్లు సీఎంగా ఉన్నా.. ఇంతే పవర్‌ఫుల్‌గా ఉంటానని తేల్చి చెప్పారు.
కేటీఆర్ వీపు పగలకొట్టించలేనా?
సోషల్ మీడియాలో తనపై, తన సర్కారుపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. పాలనపై పట్టు లేదని, ప్రజల్లో కోపం ఉందంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పెయిడ్ పోస్టులతో చేస్తున్న న్యూసెన్స్‌పై మండిపడ్డారు. ఆనాడు ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టినట్టు.. ఇప్పుడు కేటీఆర్ ఇంటి తలుపులు పగలగొట్టి.. వీపు పగలకొట్టించలేనా? అని సూటిగా ప్రశ్నించారు. అప్పుడు ఉన్నది ఇదే పోలీసులు.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారని గుర్తు చేశారు. సీఎంగా తాను ఆర్డర్స్ ఇస్తే పోలీసులతో కేటీఆర్‌ను, బీఆర్ఎస్ నేతలను అణిచివేయలేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గడీల్లో పెరగకున్నా.. నల్లమల్ల అడవుల్లో క్రూర మృగాల మధ్య పెరిగానని.. ఏం తెలీకుండానే 20 ఏళ్లు ప్రతిపక్షంలో రాణించానా? అంటూ గట్టిగానే జవాబు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. రాజు అనే వాడు విజ్ఞతతో ఉండాలని తాను సహనం ప్రదర్శిస్తున్నా.. లేదంటేనా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి.
ఫేక్ ప్రచారం దుమ్ముదులిపిన రేవంత్
ప్రజలకు తన మీద కోపం ఉందని బీఆర్ఎస్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు తన మీద ఎందుకు కోపం ఉంటుందని.. రైతులకు రుణమాఫీ చేసినందుకా? 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నందుకా? 43 లక్షల మంది ఆడబిడ్డలకు 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నందుకా? నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు ఇస్తున్నందుకా? మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకా? తన మీద ప్రజలకు ఎందుకు కోపం ఉంటుందని సీఎం రేవంత్ సూటిగా ప్రశ్నించారు. పదేళ్లు అక్రమంగా సంపాదించుకున్న నల్లధనంతో.. సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.
Also Read : రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
రేవంత్‌కు పాలనలో పట్టు రాలేదని ఎలా అంటున్నారు? రోజుకు 18 గంటలు పని చేస్తున్నానని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో సచివాలయంలో అడుగు కూడా పెట్టనిచ్చే వారు కాదని.. ఇప్పుడు అదే సెక్రటేరియట్‌లో బిల్లులు రాలేదని కొందరు ధర్నాలు కూడా చేస్తున్నారని.. తామే అనుమతి ఇవ్వక పోతే సచివాలయంలోకి సామాన్యులు వచ్చే వారా అని నిలదీశారు.
రవీంద్రభారతిలో జరిగిన “ప్రజాపాలనలో కొలువుల పండుగ” సందర్భంగా 922 మందికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. 10 నెలల్లో 59 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. దేశంలోనే అభివృద్ధికి చిరునామా దక్షిణాది రాష్ట్రాలని.. అందులోనూ తెలంగాణ మరింత ముందుందని అన్నారు. మన రాష్ట్రంలో నిరుద్యోగ శాతం 8 నుంచి 6కు తగ్గిందని.. దేశంలో అతితక్కువగా ధరల పెరుగుదల 1.3 శాతం ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని లెక్కలు చెప్పారు. ఇదంతా సుపరిపాలనకు నిదర్శనమని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.