పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించిన వైసీపీ అధినేత జగన్ కి.. మైనార్టీ వర్గాల హీరోగా ఎలివేషన్ ఇస్తూ అభినందన కార్యక్రమాలు మొదలవుతాయని అనుకున్నారంతా. కానీ రాజ్యసభలో ఓటు తేడా కొట్టడంతో జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు, ముస్లింల పొగడ్తలు.. ఇవన్నీ వాయిదా పడ్డాయి. అయితే విచిత్రంగా జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడంటూ ప్రచారం మొదలైంది. జగన్ హిందువులకోసం ఏమేం చేశారనే పాయింట్లపై వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్లు పడుతున్నాయి. వీటికి అదే స్థాయిలో టీడీపీ నుంచి కౌంటర్లు కూడా పడుతున్నాయనుకోండి.
జగన్ ఏమేం చేశారంటే..
అర్చకుల సంక్షేమానికి అగ్రపీఠం వేసి వారికి రూ.48.33 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన జగన్ నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం మొదలు పెట్టింది.
గోవింద కోటి, రామకోటి రాసిన పిల్లలకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తూ తన హయాంలో జగన్ నిర్ణయం తీసుకున్నారని, చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించడానికి కృషి చేసిన జగన్ నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడంటూ చెప్పుకొచ్చారు.
గో ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సాహమిస్తూ.. తన హయాంలో గో మహా సమ్మేళనాన్ని జగన్ నిర్వహించారని..
రాష్ట్రంలోని ఈనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకి అండగా నిలుస్తూ.. వారికి రైతు భరోసాతో పాటు…. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందజేశారని..
హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీటీడీ బోర్డుని బలోపేతం చేసి, తిరుమలలో నూతన సంస్కరణలు తీసుకొచ్చారని..
రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఆలయాలు నిర్మించి, దాదాపు 300 ఆలయాల జీర్ణోద్ధారణ చేశారని..
వంశపారంపర్య అర్చకులకి రిటైర్మెంట్ ప్రస్తావన లేకుండా.. ఓపిక ఉన్నంత వరకూ అర్చకత్వం చేసుకునే అవకాశం కూడా జగనే కల్పించారని..
దేశ విదేశాల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తన హయాంలో శ్రీకారం చుట్టి.. హిందూ ధర్మ పరిరక్షణకి నడుం బిగించారని చెబుతూ ఉదయాన్నుంచి ట్వీట్లు పడుతూనే ఉన్నాయి.
దేశ విదేశాల్లోనూ టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తన హయాంలో శ్రీకారం చుట్టి.. హిందూ ధర్మ పరిరక్షణకి నడుం బిగించిన @ysjagan గారు.#YSJaganProtectsTemples#DharmoRakshatiRakshitah#YSRCPForTemples#RamNavami#AndhraPradesh pic.twitter.com/YmDnFEW6ju
— YSR Congress Party (@YSRCParty) April 6, 2025
సూపర్ ఎలివేషన్..
శ్రీరామ నవమి సందర్భంగా జగన్ ని హిందూ ధర్మ పరిరక్షకుడంటూ హైలైట్ చేయాలనుకున్నారు. కానీ ఈ ప్రచారం సోషల్ మీడియాలో బెడిసికొట్టింది. క్రిస్టమస్, రంజాన్ సందర్భంగా ఆయా మతాల కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నారని, కానీ ఉగాది నాడు మాత్రం ఆయన జనంలోకి రాలేదని.. దీనికి లాజిక్ ఏంటని ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది జగన్ ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు శ్రీరామన నవమి రోజు కూడా కనీసం పూజ చేస్తున్న ఫొటోలు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో జగన్ ఉన్నారని, అలాంటి జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు ఎలా అవుతారని వారు ప్రశ్నిస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు సతీ సమేతంగా ఎప్పుడూ పట్టు వస్త్రాలు సమర్పించలేదని, అలాంటి జగన్ ని ధర్మ పరిరక్షకుడిగా ఎలా భావించాలని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. హిందూ ధర్మ పరిరక్షకుడంటూ జగన్ కి ఎలివేషన్ ఇవ్వాలనుకున్నవారు కాస్తా, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక సతమతం అవుతున్నారు.
ప్రధాని మోదీ అయినా, యూపీ సీఎం యోగి అయినా, ఏపీలో సనాతన ధర్మాన్ని కాపాడతానంటున్న డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ అయినా.. తమని తాము ఎప్పుడూ హందూ ధర్మ పరిరక్షకులుగా చెప్పుకోలేదు. ఆయా పార్టీలు, అభిమానులు కూడా వారికి అంత హైప్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ అనుకోకుండా జగన్ ఆ పని చేశారు. అలా హైప్ ఇవ్వాలనుకుని మరీ చిక్కుల్లో పడ్డారు వైసీపీ నేతలు.