Anantapur News: వైసీపీలో ఏం జరుగుతోంది? నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను మార్చే పనిలో హైకమాండ్ పడిందా? నేతల మధ్య ఆధిపత్య పోరే ఇందుకు కారణమా? చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందా? దీనిపై అధినేత జగన్ ఫోకస్ పెట్టారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో వైసీపీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాలపై నేతలు పెదవి విరుస్తున్నారు. మరికొందరైతే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. వైసీపీకి దూరమవ్వాలనే నేతల జాబితా భారీగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలను కాపాడుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీకావు.
ప్రస్తుతం నియోజకవర్గాల ఇన్‌ఛార్జులపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం. చాలామందిని మార్చింది. రేపో మాపో మరికొందరు ఉన్నబోతున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరిపాకాన పడింది. తొలుత అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం విషయానికొద్దాం.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి-మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆధిపత్యం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారం హైకమాండ్ వద్దకు వెళ్లింది. వైసీపీలో కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అధిష్టానికి ఫిర్యాదు చేశారు తోపుదుర్తి.
ALSO READ: టీటీడీలో కొత్త మార్పులు.. అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్ అనుచరుల ఆగడాలు అంతు లేకుండా పోతోందని వివరించారట తోపుదుర్తి. వారిపై వేటు వేయకుంటే పార్టీకి కష్టాలు తప్పవని ప్రస్తావించారు. దీంతో నియోజకవర్గంలో కిందిస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న వైసీపీ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి చెందిన కొందరు అనుచరులపై వేటు వేసింది.
ఒక విధంగా చెప్పాలంటే హైకమాండ్ వద్ద తన పంతం నెగ్గించుకున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. తన వర్గానికి చెందిన కొందరు నేతలపై పార్టీ వేటు వేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇలా అయితే పార్టీ మనుగడ కష్టమనే అభిప్రాయాన్ని సహచరుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.
చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇన్‌ఛార్జులను మార్చడమే దీనికి కారణంగా చెబుతున్నారు. రేపటి రోజున ఈ వ్యవహరం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో? అసంతృప్త నేతలు ఆ పార్టీలో కంటిన్యూ అవుతారా? లేక మరో పార్టీలోకి జంప్ అవుతారా అనేది చూడాలి.