Innova Hycross Facelift 2026: టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross) కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. త్వరలో కొత్త లుక్ లో మార్కెట్లోకి రానుంది. నవంబర్ 25న ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ ను భారత్ లో విడుదల చేసేందుకు టయోటా రెడీ అయ్యింది. ఇప్పటికే కంపెనీ ‘ది స్టేజ్ ఈజ్ సెట్ ఫర్ యాన్ ఐకానిక్ ఎవల్యూషన్’ అనే ట్యాగ్ లైన్‌తో టీజర్‌ను విడుదల చేసింది. కొత్త డిజైన్‌తో పాటు ఇంటీరియర్‌లోనూ కీలక మార్పులు చేయబోతోంది.
కొత్త ఇన్నోవా హైక్రాస్ ముందు భాగంలో ప్రధాన మార్పులు కనిపించనున్నాయి. గత మోడల్‌తో పోలిస్తే సూపర్ గ్రిల్‌ను అందించనున్నారు. మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా తయారు చేసిన టయోటా టైసర్ లో కనిపించే డిజైన్ లాగే కొత్త DRLలు ఉండనున్నాయి. అంతేకాకుండా, సన్నని LED హెడ్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, అప్డేటెడ్ LED టెయిల్ ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఈ ఫేస్ లిఫ్ట్ ను మరింత క్రేజీగా మార్చనున్నాయి.
ఇంటీరియర్‌లో టయోటా మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ స్థానంలో పెద్ద 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌ను అందించే అవకాశం ఉంది. దీనికి జతగా 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా రావచ్చు. న్యూ క్యాబిన్ థీమ్, చక్కటి సీట్ అప్హోల్స్టరీ, కొత్త ట్రిమ్స్ తో లోపలి భాగాన్ని మరింత ప్రీమియంగా మార్చనున్నారు. 360 డిగ్రీల కెమెరా, ADAS టెక్నాలజీలోనూ అప్‌గ్రేడ్స్ ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత మోడల్లోని JBL సౌండ్ సిస్టమ్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, పార్కింగ్ సెన్సార్లు లాంటి ఫీచర్లు అలాగే కంటిన్యూ కానున్నాయి.
ఇంజిన్ పరంగా కూడా ఇన్నోవా హైక్రాస్లో కీలక మార్పులతో వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఫ్లెక్స్ ఫ్యూయల్ పవర్ ట్రెయిన్‌ను ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.0 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్లు అలాగే కొనసాగనున్నాయి. పెట్రోల్ ఇంజిన్ 171 PS పవర్, 204 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ వెర్షన్ 189 PS పవర్, 191 Nm టార్క్ అందిస్తుంది.
ప్రస్తుతం ఇన్నోవా హైక్రాస్ ధరలు రూ.18.70 లక్షల నుంచి రూ.31.84 లక్షల వరకు ఉన్నాయి. కొత్త ఫేస్ లిఫ్ట్ లో మార్పులను బట్టి ధరలు సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.
Read Also: రేంజ్ రోవర్ తలదన్నే లుక్.. హోండా అవన్సియర్ ఏముంది భయ్యా!