Maruti Fronx Sales: ఇండియన్ కారు మార్కెట్ లో మారుతి సుజుకి (Maruti Suzuki) కార్లకు ఉన్న ఆదరణ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా SUV సెగ్మెంట్ లో కంపెనీకి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx) మరో రికార్డు సాధించింది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశీయంగా 6 లక్షలకు పైగా యూనిట్లు సేల్ చేసి సరికొత్త మైలురాయిని అందుకుంది. అంతేకాదు, ప్రస్తుత ఫైనిన్షియల్ ఇయర్ లో నెక్సా (Nexa) గ్రూప్ లో ఎక్కువగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది.
మారుతి ఫ్రాంక్స్ 2023 ఏప్రిల్‌లో ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. అప్పటి నుంచి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ కొనసాగుతోంది. అక్టోబర్ 2026 నాటికి ఈ కారు ఇండియన్ మార్కెట్లో మొత్తం 6,03,463 యూనిట్లను అమ్మింది. నెక్సా ద్వారా అమ్ముతున్న SUVలలో 6 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకున్న తొలి మోడల్ గా గుర్తింపు పొందింది. ఇక విదేశీ మార్కెట్లకు కూడా ఈ కారును మారుతి ఎగుమతి చేస్తోంది. ఇప్పటి వరకు 2.20 లక్షలకు పైగా ఫ్రాంక్స్ యూనిట్లు ఇతర దేశాలకు వెళ్లాయి.
2027 ఆర్థిక సంవత్సరంలో ఫ్రాంక్స్ అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2026 మధ్య మొత్తం 1,30,149 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 93,808 యూనిట్లతో పోలిస్తే ఇది 39 శాతం ఎక్కువ. నెక్సా శ్రేణిలో ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్న బాలెనోను ఫ్రాంక్స్ వెనక్కి నెట్టింది. బాలెనో 1,29,488 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. అంటే ఈ రెండు మోడళ్ల మధ్య తేడా కేవలం 661 యూనిట్లు.
2026 అక్టోబర్ నెలలో ఫ్రాంక్స్ మరోసారి 20 వేల యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. ఈ నెలలో మొత్తం 20,014 యూనిట్లు అమ్ముడయ్యాయి. విడుదలైనప్పటి నుంచి ఒక నెలలో 20 వేల యూనిట్ల విక్రయాలను దాటడం ఇది నాలుగోసారి. ప్రస్తుత అమ్మకాల వేగం ఇలాగే కొనసాగితే, 2027 మార్చి నాటికి ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల యూనిట్ల అమ్మకాల రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం మారుతి ఫ్రాంక్స్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ.6.90 లక్షల నుంచి రూ.11.89 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ CNG, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. కాంపాక్ట్ SUV విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్ లాంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది.
Read Also: పెద్ద బ్యాటరీతో విండ్సర్ EV ఫేస్ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఇక రేంజ్ మామూలుగా ఉండదండోయ్!