New MG Windsor EV Facelift: భారత కార్ల మార్కెట్ లో ఎలక్ట్రిక్ మోడల్స్ కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ (MG Motor) విండ్సర్ ఈవీ (Windsor EV)కి కొత్త అప్ డేట్స్ ఇవ్వబోతోంది. ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను వచ్చే ఏడాది మార్కెట్ లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో డిజైన్ ఛేంజెస్ తో పాటు మరింత పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బ్యాటరీల కంటే పెద్దదైన 61kWh బ్యాటరీ సెటప్ ను తీసుకురానుంది.
కొత్త MG విండ్సర్ EV ఫేస్‌లిఫ్ట్ లో కీలక మార్పు బ్యాటరీలోనే ఉండనుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ కారులో 38kWh, 52.9kWh బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో వరుసగా 332 కిలోమీటర్లు, 449 కిలోమీటర్ల రేంజ్ లభిస్తోంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ లో 61kWh బ్యాటరీ ప్యాక్ తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మరింత దూరం ప్రయాణించే అవకాశం ఉంది. అయితే, ఈ బ్యాటరీతో ఎంత రేంజ్ వస్తుందనేది కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
బ్యాటరీ అప్ గ్రేడ్ తో పాటు కారు బయట, లోపలి డిజైన్‌లోనూ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్త ఫ్రంట్ డిజైన్, అప్‌డేటెడ్ లైటింగ్ సెటప్, కొత్త ఫీచర్లతో క్యాబిన్ ను మరింత అదిరిపోయేలా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మోడల్ లో ఫ్రంట్ యాక్సిల్ కు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ నే కొత్త వెర్షన్‌లోనూ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అయితే, మోటార్ పవర్, టార్క్ వివరాలు ఎలా ఉంటాయనేది త్వరలో తెలియనుంది. ఇప్పటి వరకు ఫేస్ లిఫ్ట్ టెస్ట్ మోడల్స్ కనిపించలేదు. కనిపించిన తర్వాత పూర్తి డిజైన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
MG విండ్సర్ EV 2024లో ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. స్టార్టింగ్ లో 38kWh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత 2025లో 52.9kWh బ్యాటరీ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ కారు తక్కువ ధరలో మంచి ప్లేస్, అద్భుతమైన ప్రయాణం అందిస్తుంది. అంతేకాదు, MG బ్రాండ్ లో ఎక్కువగా అమ్ముడవుతున్న మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2026 నాటికి విండ్సర్ EV అమ్మకాలు 80,000 యూనిట్ల మార్కును దాటాయి. దీంతో కంపెనీ ఈ మోడల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం MG విండ్సర్ EV ధరలు రూ.14.85 లక్షల నుంచి రూ.19.15 లక్షల వరకు ఉన్నాయి. కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో పెద్ద బ్యాటరీ, మరిన్ని ఫీచర్లు రానుండటంతో ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ధర కొంత పెరిగే అవకాశం ఉంది.
Read Also: కొత్త కార్లు, బైక్‌లకు పేర్లు ఎలా పెడతారు? బాబోయ్.. ఇంత ప్రాపెస్ ఉంటుందా?