70 Years of the Seatbelt: వాహనాలలో ఉండే సేఫ్టీ ఫీచర్లలో అత్యంత కీలకమైనది సీట్ బెల్ట్. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్ ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. అలాంటి సీట్ బెల్ట్ 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇంతకీ ఈ సీట్ బెల్ట్ ను తొలిసారి కనిపెట్టింది ఎవరు? ఏ కంపెనీ మొదట ఉపయోగించింది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తొలిసారి అధికారిక సీట్ బెల్ట్ ఎప్పుడు పేటెంట్ పొందారనే దానిపై కొంత వివాదం ఉన్నప్పటికీ.. ఆవిష్కర్తలు రోజర్ గ్రిస్‌వోల్డ్, హ్యూ డి హావెన్ 1955లో పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వోల్వో టూ పాయింట్, క్రాస్ చెస్ట్ డైగోనల్ బెల్ట్ 1956లో తొలిసారి అందుబాటులోకి వచ్చింది.
అమెజాన్ ప్రోటోటైప్ వోల్వో కొత్త టూ పాయింట్ బెల్ట్ ను ఉపయోగించిన మొదటి కారుగా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం మూడు సంవత్సరాల తరువాత, 1959లో వోల్వో తన వాహనాలలో ప్రామాణిక భద్రతా ఫీచర్ గా లేటెస్ట్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ ను అందించిన మొదటి ఆటోమేకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తుది వెర్షన్ ను వోల్వో డిజైన్ ఇంజనీర్ నిల్స్ బోహ్లిన్ సృష్టించారు. అప్పటి నుంచి ఇది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడే ఫీచర్ గా మారిపోయింది.
ఇక 70 వసంతాల సీట్ బెల్ట్ వేడుక సందర్భంగా వోల్వో రాబోయే EX60 SUVలో కొత్త సీట్ బెల్ట్ టెక్నాలజీని పరిచయం చేయబోతోంది. ఇది ఈ సంవత్సరం చివర్లో అందుబాటులోకి రానుంది. కంపెనీ దీనిని మల్టీ అడాప్టివ్ సీట్ బెల్ట్ గా పిలుస్తుంది. స్వీడన్ లోని భద్రతా నిపుణులు ఇది కారులో భద్రత కోసం మరో పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు.
మల్టీ అడాప్టివ్ సీట్ బెల్ట్ వెహికల్ లోపల, బయట సెన్సార్ల నెట్ వర్క్ ను ఉపయోగించి ప్రతి ప్రయాణీకుడికి సంబంధించిన సీటింగ్ పొజిషన్, ఇంపాక్ట్ డైనమిక్స్ కు సంబంధించి రియల్ టైమ్ డేటాను సేకరిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా, సిస్టమ్ ఆటోమేటిక్ గా సీట్ బెల్ట్ లోడ్ ను సర్దుబాటు చేస్తుంది. ప్రతి ప్రయాణీకుడికి సరైన నియంత్రణ వ్యూహాన్ని ఎంచుకుంటుంది. ప్రమాద సమయంలో ప్రాణాలకు హాని కలగకుండా కాపాడుతుంది. ఇది ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.
“వోల్వో ఎప్పుడూ భద్రతా ఫీచర్ల ఆవిష్కరణలలో ముందంజలో ఉంటుంది. సీట్ బెల్ట్ లాంటి ముఖ్యమైన ఫీచర్లపై కొత్త డెలప్ మెంట్స్ తీసుకొస్తున్నాం” అని వోల్వో కార్ UK మేనేజింగ్ డైరెక్టర్ నికోల్ మెలిల్లో షా వెల్లడించారు. 70 సంవత్సరాలుగా, సీట్ బెల్ట్ పెద్దగా మారలేదు. ఇప్పుడు, సాంప్రదాయ త్రీ పాయింట్ బెల్ట్ ను ప్రారంభించిన కంపెనీ తన కార్లను మరింత సురక్షితంగా చేయడానికి కొత్త టెక్నాలజీని వాడుతుంది.
Read Also: ఈవీ కారు ఎక్కితే వికారం రావడానికి కారణం ఇదేనట.. పరిష్కారం కనుగొన్న మెర్సిడెస్!