Ather Konark Name Explained: ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ‘కోనార్క్’ అనే పేరు పెట్టింది. అసలు ఈ స్కూటర్ కు ఆ పేరు ఎందుకు పెట్టింది? అనే విషయంపై కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. మొదట కంపెనీ విడుదల చేసిన ఏథర్ 450 స్కూటర్ పేరు కారణంగా చాలా మంది వినియోగదారులు ఏథర్ ను విదేశీ, ముఖ్యంగా యూరోపియన్ బ్రాండ్ గా భావించారని చెప్పారు. అందుకే ఇప్పుడు భారతీయతను ప్రతిబింబించే పేర్లను ఎంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.
సోషల్ మీడియాలో ఒక వినియోగదారుడి ప్రశ్నకు స్పందించిన తరుణ్ మెహతా, కంపెనీ నేమ్ స్ట్రాటజీ గురించి వివరించారు. 450 అనే సంఖ్యతో మొదటి స్కూటర్‌ను విడుదల చేసిన తర్వాత, అది భారతీయ బ్రాండ్ అనే భావన కంటే యూరోపియన్ కంపెనీ అన్న అభిప్రాయం వినియోగదారుల్లో ఏర్పడిందని తెలిపారు. ఆ అనుభవం తర్వాతే రిజ్టా, కోనార్క్ వంటి భారతీయ పేర్లను ఎంచుకునే దిశగా కంపెనీ అడుగులు వేసిందని చెప్పారు. భారతీయ పేర్లకు కస్టమర్ల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఈ పేర్ల వల్ల బ్రాండ్‌కు భారతీయ గుర్తింపు మరింత బలపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏథర్ ప్రారంభించిన మొదటి స్కూటర్ 450 ప్రధానంగా టెక్నాలజీ, పనితీరు ఆధారంగా రూపొందించిన మోడల్. అందుకే దానికి సంఖ్య ఆధారిత పేరు పెట్టారు. అయితే, ఆ పేరు వల్ల బ్రాండ్ విదేశీదనే భావన ఏర్పడటం కంపెనీ ఊహించలేదు. దీంతో తర్వాతి మోడల్స్ కు పూర్తిగా భిన్నమైన నామకరణ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఆ మార్పులో భాగంగానే 2024లో కుటుంబాల కోసం రూపొందించిన రిజ్టా స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు త్వరలో విడుదల కానున్న కోనార్క్ కూడా అదే దిశలో మరో అడుగుగా నిలవనుంది. భారతీయ సంస్కృతి, స్థానిక గుర్తింపును ప్రతిబింబించే పేర్లతో వినియోగదారులకు మరింత దగ్గర కావాలన్నదే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది.
Yeah… After naming the first scooter '450' and hearing from customers that we might be an European brand
… We did a hard pivot into proper Indian names:
Rizta
KonarcIt's amazing to see our customers showing love and affection for Indian names ❤️😁 https://t.co/lNKpRjrj2w
— Tarun Mehta (@tarunsmehta) August 5, 2026
ఇక ఇప్పటివరకు పనితీరు ఆధారిత స్కూటర్లపై ఎక్కువ దృష్టి పెట్టిన ఏథర్, ఇప్పుడు కుటుంబాలు, రోజువారీ వినియోగదారులు, మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వారిని కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ వ్యూహంలో భాగంగానే తక్కువ ధరలో అందుబాటులో ఉండే కొత్త మాస్ మార్కెట్ స్కూటర్ ను తీసుకొస్తోంది. ఏథర్ ఎనర్జీ కొత్త EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన తొలి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోనార్క్‌ను ఆగస్టు 29న జరిగే ఏథర్ కమ్యూనిటీ డే 2026 కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ స్కూటర్ కంపెనీకి కొత్త బలాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అటు తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా మాట్లాడిన తరుణ్ మెహతా, ప్రస్తుతం ఏథర్ స్కూటర్లకు భారీ డిమాండ్ ఉందని తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రీ ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 158 శాతం పెరిగి సుమారు 1.5 లక్షల యూనిట్లకు చేరుకున్నాయన్నారు.
Read Also: ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రాండ్ ఎంట్రీ, జస్ట్ రూ. లక్షకే కొత్త ఫ్యామిలీ ఈవీ!