New Mahindra Thar OG 2026: మహీంద్రా థార్ 3-డోర్‌కు మరోసారి అప్‌డేట్ వచ్చింది. ఈసారి కొత్త ఫీచర్లతో పాటు ‘OG’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన థార్.. పనితీరు, సౌకర్యం, భద్రత విషయంలో కూడా కీలక మార్పులు పొందింది. రూ.10.32 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో మహీంద్రా థార్ OGను విడుదల చేసింది. టాప్ వేరియంట్ ధర రూ.18.99 లక్షల వరకు ఉంది. ఈ కొత్త మోడల్ డెలివరీలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి.
థార్ OGలో AXT, LXT, ZXT అనే మూడు ప్రధాన ట్రిమ్‌లు ఉన్నాయి. బేస్ AXT వేరియంట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, మాన్యువల్ గేర్‌బాక్స్, RWDతో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ.10.32 లక్షలు. ప్రత్యేకత ఏమిటంటే.. పలు అప్‌డేట్లు వచ్చినప్పటికీ ఈ ప్రారంభ ధర 2025 మోడల్‌తో పోలిస్తే మారలేదు. LXT, ZXT వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. టాప్ ఎండ్ ZXT 2.2 డీజిల్ 4WD ఆటోమేటిక్ ధర రూ.18.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
థార్ OG ముందు భాగంలో కొత్త గ్రిల్, సవరించిన బంపర్లు, కొత్త లైటింగ్ డిజైన్‌ను తీసుకొచ్చారు. టాప్ ZXT వేరియంట్‌లో C-ఆకారపు DRLలతో LED హెడ్‌ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. కొత్త 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా టాప్ వేరియంట్ కు ప్రత్యేకం. వెనుక భాగంలో కొత్త డిజైన్ టెయిల్ ల్యాంప్స్ కనిపిస్తాయి. ఫెండర్, టెయిల్‌గేట్‌పై ‘OG’ బ్యాడ్జింగ్ ఉంటుంది. ఆర్టెమిస్ సిల్వర్, జీన్స్ బ్లూ లాంటి కొత్త కలర్ ఆప్షన్లు కూడా ఈ మోడల్‌లో చేరాయి.
థార్ OG ఇంటీరియర్‌లో ట్రఫుల్ బ్రౌన్ లెదరెట్ అప్‌హోల్స్టరీని అందించారు. రెండో వరుసలో కప్‌హోల్డర్లతో కూడిన ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే శబ్దం, వైబ్రేషన్లు తగ్గేలా మార్పులు చేసినట్లు మహీంద్రా చెబుతోంది. LXT నుంచి 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 6 స్పీకర్ ఆడియో, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ZXTలో వైర్ లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. థార్ OGలో భద్రతపై కూడా దృష్టి పెట్టారు. ESP 9.3 సిస్టమ్‌లో రోల్ ఓవర్ మిటిగేషన్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే 6 ఎయిర్ బ్యాగ్‌లు, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్, రియర్ కెమెరా లాంటి ఫీచర్లు టాప్ ZXT వేరియంట్ లోనే ఉన్నాయి.
థార్ OGలో M_Glyde 4G ప్లాట్‌ఫామ్, కొత్త సస్పెన్షన్ సెటప్‌తో పాటు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వచ్చింది. దీంతో ముఖ్యంగా తక్కువ వేగంలో, పార్కింగ్ సమయంలో స్టీరింగ్‌ను తిప్పడం సులభంగా ఉండే అవకాశం ఉంది. 4WD వేరియంట్లలో ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, మడ్, సాండ్, స్నో వంటి టెర్రైన్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఇవి గతుకుల రోడ్లు, జారుడు ప్రదేశాల్లోనూ నియంత్రణకు ఉపయోగపడతాయి.
థార్ OG మూడు ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. 1.5 లీటర్ డీజిల్ 119hp, 300Nm ఉత్పత్తి చేస్తుంది. 2.2 లీటర్ డీజిల్ 152hp, 330Nm అందిస్తుంది. ఇక 2.0 లీటర్ టర్బో పెట్రోల్ 162hp, 330Nm పవర్‌ను ఇస్తుంది.
Read Also: హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!