BYD Denza India Entry Confirmed: చైనా ఆటోమొబైల్ దిగ్గజం BYDకు చెందిన లగ్జరీ బ్రాండ్ డెంజా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఇండియా ఎంట్రీని అధికారికంగా వెల్లడించింది. డెంజా ఇండియా సోషల్ మీడియా ఖాతాలో బ్రాండ్ లోగోతో పాటు ‘కమింగ్ సూన్’ అంటూ పోస్టు చేసింది. భారత మార్కెట్లో అధునాతన, హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ వాహనాలను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రాబోయే నెలల్లో డెంజా కార్లు భారత్‌లోకి వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఈ బ్రాండ్ మొదటగా Z9 GT షూటింగ్ బ్రేక్, D9 లగ్జరీ MPVలను తీసుకురావచ్చని తెలుస్తోంది. అధునాతన టెక్నాలజీ, ఎక్కువ పనితీరు, ప్రీమియం ఫీచర్లతో ఈ రెండు మోడళ్లను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.
భారత్‌కు రాబోయే మోడళ్లలో Z9 GT ప్రత్యేకంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇది నాలుగు డోర్ల షూటింగ్ బ్రేక్ బాడీతో వస్తుంది. ఇందులో 122.5kWh బ్యాటరీ ప్యాక్‌తో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి కలిపి ఏకంగా 1,156hp పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు 0-100kph వేగాన్ని కేవలం 2.7 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. గరిష్ట వేగం 270kphగా ఉంటుంది. WLTP సర్టిఫికేషన్ ప్రకారం సుమారు 600 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
Z9 GTలో రియర్-వీల్ స్టీరింగ్‌తో పాటు కొన్ని ప్రత్యేక డ్రైవింగ్ ఫీచర్లు ఉన్నాయి. ‘క్రాబ్ వాక్’ ద్వారా కారు కొంత మేర పక్కకు కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ‘కంపాస్ టర్న్ 360°’ ఫీచర్ ద్వారా వాహనం దాదాపు అదే ప్రాంతంలో పూర్తి టర్న్ తీసుకుంటుంది. క్యాబిన్ లో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, కెమెరా ఫీడ్ కోసం అదనపు డిస్‌ప్లేలు, Level 2+ ADAS, లెదర్ సీట్లు, 20 స్పీకర్ ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు సీట్లలో పవర్ అడ్జస్ట్ మెంట్‌తో పాటు హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లు కూడా ఉంటాయి. భారత్‌లో Z9 GT ధర సుమారు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.
డెంజా తీసుకురానున్న మరో ముఖ్యమైన మోడల్ D9. ఇది పెద్ద లగ్జరీ MPVగా ఉంటుంది. భారత మార్కెట్లో MG M9, టయోటా వెల్ఫైర్ లాంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఇండియా స్పెక్ D9లో 103kWh బ్యాటరీ ప్యాక్, 313hp పవర్, 360Nm టార్క్ అందించే ఫ్రంట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండొచ్చని సమాచారం. WLTP ప్రకారం సుమారు 520 కిలోమీటర్ల రేంజ్ లభించవచ్చు. 200kW DC ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
D9లో 2+2+3 సీటింగ్ లేఅవుట్ ఉంటుంది. రెండో వరుసలో కెప్టెన్ సీట్లకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్ మెంట్, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ వంటి ఫీచర్లు ఉంటాయి. త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ థై ఎక్స్ టెండర్లు, డైనాడియో సౌండ్ సిస్టమ్, లెదర్ ఇంటీరియర్, యాంబియంట్ లైటింగ్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉండవచ్చు. భారత్‌లో D9 ధర సుమారు రూ.90 లక్షల వద్ద ఉండొచ్చని అంచనా.
Read Also: అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!