October 2026 Car Launches: భారత కారు మార్కెట్లో అక్టోబర్ నెల మరింత సందడిగా మారనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని ప్రముఖ కార్లు త్వరలో ఫేస్ లిఫ్ట్ వెర్షన్లలో అందుబాటులోకి రానున్నాయి. మెర్సిడెస్ బెంజ్, హోండా, స్కోడా, టయోటా, వోక్స్ వ్యాగన్ సంస్థలు తమ మోడళ్లకు కొత్త లుక్ తో పాటు క్రేజీ ఫీచర్లను తీసుకురాబోతున్నాయి. కొన్ని కార్లలో ఇంజిన్, గేర్ బాక్స్ ఆప్షన్లలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.
అక్టోబర్ 5న మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ ఫేస్ లిఫ్ట్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త మోడల్‌లో ముందు భాగం డిజైన్ లో మార్పులు కనిపించనున్నాయి. పెద్దగా కనిపించే ఇల్యూమినేటెడ్ గ్రిల్, కొత్త హెడ్ ల్యాంప్స్, స్టార్ డిజైన్ తో కూడిన DRLsతో ఆకట్టుకోనుంది. ఇంటీరియర్ లో ప్రీమియం లుక్ కొనసాగనుంది. 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.4-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. S580 వెర్షన్ లో 4.0-లీటర్ V8 ఇంజన్ సుమారు 537 hp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది.
అక్టోబర్ 6న హోండా ఎలివేట్ ఫేస్ లిఫ్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ LED లైట్లు, కొత్త బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్ లాంటి మార్పులతో రానుంది. క్యాబిన్‌లో కూడా కొత్త అప్‌హోల్స్టరీతో పాటు అదనపు ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఫీచర్లతో రానుంది. ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ అలాగే ఉంటుంది.
స్కోడా స్లావియా ఫేస్ లిఫ్ట్ కూడా అక్టోబర్ 6న విడుదలయ్యే అవకాశం ఉంది. డిజైన్ మార్పులతో పాటు గేర్‌బాక్స్ విషయంలోనూ ముఖ్యమైన అప్‌డేట్ రావచ్చని తెలుస్తోంది. 1.0-లీటర్ TSI ఇంజన్‌తో కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అందించే అవకాశం ఉంది. 1.5-లీటర్ TSI ఇంజన్ కు 7 స్పీడ్ DSG కొనసాగుతుంది. 10.1 అంగుళాల టచ్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, కొన్ని వేరియంట్లలో రియర్ సీట్ మసాజ్ ఫంక్షన్ లాంటి ఫీచర్లు కూడా రావచ్చు.
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 14న మార్కెట్లోకి రావచ్చని అంచనా. బాలెనోతో ప్లాట్ ఫామ్‌ను పంచుకునే ఈ హ్యాచ్‌బ్యాక్ లో ముందు, వెనుక డిజైన్ తో పాటు లైటింగ్ లో మార్పులు రావచ్చు. కొత్త అల్లాయ్ వీల్స్, క్యాబిన్ అప్ డేట్స్, అదనపు ఫీచర్లు కూడా లభించే అవకాశం ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అలాగే ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్ బాక్స్ ఆప్షన్లతో పాటు CNG వెర్షన్ కూడా కొనసాగవచ్చని తెలుస్తోంది.
అక్టోబర్ 25న వోక్స్ వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ రావచ్చని సమాచారం. కొత్త లుక్‌తో పాటు ఇంటీరియర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇతర ఫీచర్లలో అప్‌డేట్స్ ఉండొచ్చు. 1.0 లీటర్ TSIకి 8 స్పీడ్ ఆటోమేటిక్, 1.5-లీటర్ TSIకి 7 స్పీడ్ DSG కొనసాగవచ్చని అంచనా. 360 డిగ్రీ కెమెరా, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్ మెంట్ సాఫ్ట్ వేర్ లాంటి ఫీచర్లు కూడా జోడించే అవకాశం ఉంది.
Read Also: హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ షురూ.. లాంచింగ్ ఎప్పుడంటే?