India’s Electric Scooter Market: భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌కు చెందిన హోండా, సుజుకి, యమహా కంపెనీలు దుమ్మురేపుతున్నాయి. 2026లో ఇప్పటివరకు ఈ మూడు సంస్థల ఇ స్కూటర్ల అమ్మకాలు 10 వేల యూనిట్ల మార్కును దాటాయి. అయితే, మొత్తం ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ తో పోలిస్తే వీటి వాటా ఇంకా తక్కువగానే ఉంది. ధరలు, మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టైమ్, డీలర్ నెట్ వర్క్ లావటి అంశాలు ఈ కంపెనీల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి.
వాహన్ రిటైల్ లెక్కల ప్రకారం, 2026 జనవరి 1 నుంచి అక్టోబర్ 8 వరకు హోండా, సుజుకి, యమహా కంపెనీలు కలిపి 10,735 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మాయి. ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఈ మూడు జపాన్ సంస్థల అమ్మకాలు తొలిసారిగా 10 వేల మార్కును దాటాయి. ఈ మూడు కంపెనీలలో హోండా అత్యధిక అమ్మకాలతో ముందంజలో ఉండగా, సుజుకి రెండో స్థానంలో నిలిచింది. యమహా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మార్కెట్లో వాటాను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2026లో అక్టోబర్ 8 వరకు 5,536 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మింది. ఈ మూడు కంపెనీల మొత్తం అమ్మకాల్లో హోండా వాటా 51 శాతానికి పైగా ఉంది. యాక్టివా-ఇ, QC1 మోడళ్లతో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి వచ్చిన హోండా, సెప్టెంబర్‌లో అత్యధికంగా 1,107 యూనిట్లను అమ్మింది. ఒక నెలలో వెయ్యి యూనిట్ల అమ్మకాలను దాటడం ఇదే తొలిసారి. తాజాగా పరిచయం చేసిన QC3 ఇ-స్కూటర్ కూడా అమ్మకాలను పెంచేందుకు ఉపయోగపడే అవకాశం ఉంది.
సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తన ఇ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి ప్రవేశించింది. అక్టోబర్ 8 నాటికి ఈ మోడల్ అమ్మకాలు 4,133 యూనిట్లకు చేరాయి. మూడు కంపెనీల మొత్తం అమ్మకాల్లో సుజుకి వాటా సుమారు 39 శాతంగా ఉంది. జూలైలో 606 యూనిట్లు, ఆగస్టులో 674 యూనిట్లు, సెప్టెంబర్‌లో 657 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.88 లక్షలుగా ఉంది.
యమహా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈసీ-06ను రివర్ మొబిలిటీ సహకారంతో అభివృద్ధి చేసింది. 2026లో అక్టోబర్ 8 వరకు 1,066 యూనిట్లను విక్రయించింది. మూడు కంపెనీల మొత్తం అమ్మకాల్లో యమహా వాటా సుమారు 10 శాతంగా ఉంది. ఈ మోడల్ కు సెప్టెంబర్‌లో అత్యధికంగా 232 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి యమహా మరింత విస్తృతమైన విక్రయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
Read Also: బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!