Kia’s India EV and Hybrid Plan: భారత కార్ల మార్కెట్ లో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కియా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. 2026 ఇన్వెస్టర్ డే సమ్మిట్ లో భారత్ కోసం కొత్త ఎలక్ట్రిఫైడ్ మోడళ్లపై కీలక ప్రకటన చేసింది. మొత్తం 5 హైబ్రిడ్ వాహనాలతో పాటు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకురావడానికి కియా సిద్ధమవుతోంది.
కియా రాబోయే మోడళ్లలో సోరెంటో HEVకి ప్రత్యేక స్థానం ఉంది. సెప్టెంబర్ 4న భారత మార్కెట్లో సోరెంటో త్రీ-రో SUVని విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. భారత్‌లో కియా నుంచి వచ్చే తొలి హైబ్రిడ్ మోడల్ ఇదే కానుంది. సోరెంటో హైబ్రిడ్‌లో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌కు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీని యాడ్చేస్తారు. 238PS పవర్, 380Nm టార్క్ ఉత్పత్తి కానుంది. AWD సిస్టమ్ కూడా ఇందులో ఉండనుంది. డీజిల్ వెర్షన్‌లో 2.0 లీటర్ టర్బో ఇంజన్ వచ్చే అవకాశం ఉంది.
సోరెంటో తర్వాత కియా కార్నివాల్‌కు కూడా హైబ్రిడ్ టెక్నాలజీ తీసుకురానుంది. ఈ మోడల్ కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఇందులో సోరెంటోలో ఉపయోగించే 1.6 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించే అవకాశముంది. అయితే కార్నివాల్ HEVకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను కియా ఇంకా వెల్లడించలేదు.
భారత్‌లో కియాకు మంచి అమ్మకాలు అందిస్తున్న సెల్టోస్‌కు కూడా హైబ్రిడ్ వెర్షన్ రాబోతోంది. ఇది 2027 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సెల్టోస్ HEVలో 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిపే అవకాశం ఉంది.
కియా సెకెండ్ జెనరేషన్ సోనెట్‌ను 2027లో విడుదల చేయనుంది. ఈ కొత్త సోనెట్ కు స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్‌ను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, హైబ్రిడ్ వెర్షన్ 2028 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కేరెన్స్ క్లావిస్‌కు కూడా 2029 నాటికి హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను తీసుకురావాలని కియా భావిస్తోంది.
హైబ్రిడ్‌లతో పాటు కొత్త ఎలక్ట్రిక్ SUVపై కూడా కియా పని చేస్తోంది. సోనెట్, సెల్టోస్ మధ్య స్థానంలో ఉండే ఈ B-సెగ్మెంట్ SUV పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో రానుంది. ఈ కొత్త EVకు మారుతి సుజుకి e-Vitara, టాటా కర్వ్ EV లాంటి మోడళ్లు ప్రధాన ప్రత్యర్థులుగా ఉండే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ఇదే ప్లాట్ ఫామ్ ఆధారంగా పెట్రోల్, హైబ్రిడ్ వెర్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.
Read Also: చక్రాలు లేకుండా పరుగులు.. 4 కాళ్లతో నడిచే హైడ్రోజన్ రోబోట్ వచ్చేస్తోంది!