Upcoming Kia Syros EV India Launch: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి మరో క్రేజీ ఈవీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా త్వరలో సైరోస్ EVను తీసుకురాబోతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, కొన్ని డీలర్ షిప్ లలో ఇప్పటికే రూ.25,000 టోకెన్ ధరతో అనధికారిక బుకింగ్‌లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. కియా ఇప్పటికే కేరెన్స్ క్లావిస్ EVను పరిచయం చేసింది. ఇప్పుడు అదే టెక్నాలజీని సైరోస్ EVలో కూడా ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ, రేంజ్ పరంగా ఈ కారు మంచి ఆకర్షణగా నిలవొచ్చని ఆటో రంగం భావిస్తోంది.
తాజాగా లీకైన సమాచారం ప్రకారం, సైరోస్ EV రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మొదటి వేరియంట్‌లో 42kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా, రెండో వేరియంట్ లో 51.4kWh బ్యాటరీ ఇవ్వనున్నారు. ఈ రెండు బ్యాటరీలతో రేంజ్ కూడా ఆకట్టుకునేలా ఉండొచ్చని తెలుస్తోంది. చిన్న బ్యాటరీతో సుమారు 420 కిలోమీటర్లు, పెద్ద బ్యాటరీతో 520 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా. రోజువారీ వినియోగంతో పాటు లాంగ్ డ్రైవ్ లకు కూడా ఈ రేంజ్ సరిపోతుందని భావిస్తున్నారు.
డిజైన్ పరంగా కూడా సైరోస్ EV ప్రత్యేకంగా కనిపించనుంది. పెట్రోల్ వెర్షన్ తో పోలిస్తే ఇందులో కొత్త స్టైల్ అల్లాయ్ వీల్స్, EV బ్యాడ్జింగ్, నియాన్ గ్రీన్ బ్రేక్ కాలిపర్లు, అలాగే చిన్న మార్పులతో కూడిన ఫ్రంట్ డిజైన్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయంలో భారత రోడ్లపై చాలాసార్లు కనిపించడం కూడా ఆసక్తిని పెంచుతోంది. క్యాబిన్ విషయానికి వస్తే, పెట్రోల్ మోడల్ లో ఉన్న లేఅవుట్ ను ఎక్కువగా అలాగే ఉంచి, కొత్త కలర్ థీమ్ తో అందించనున్నట్లు సమాచారం.
ఫీచర్ల పరంగా కూడా కియా ఎలాంటి రాజీ పడేలా కనిపించడం లేదు. ఈ SUVలో 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్ ప్లే, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, రియర్ సీట్ వెంటిలేషన్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అయితే ADAS లాంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉంటాయా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
ధర విషయానికి వస్తే, రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ధరలో వస్తే, టాటా నెక్సాన్ EV, MG విండ్సర్ EV వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.
Read Also: స్టైలిష్ డిజైన్.. క్రేజీ ఫీచర్స్.. టాటా సియెర్రా జూబ్లీ ఎడిషన్ చూస్తే మతిపోవాల్సిందే!