New Maruti Wagon R Flex-Fuel Price: దేశంలో తొలి ప్లెక్స్ ప్యూయల్ కారును తీసుకొచ్చిన మారుతి సుజుకి.. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వాగన్ ఆర్ బయో ఫ్లెక్స్ మోడల్ ధరను ప్రకటించింది. రూ.7.24 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. హై ఇథనాల్ మిశ్రమంతో పనిచేసే ఈ కొత్త వెర్షన్ ప్రస్తుతం కమర్షియల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి తీసుకువచ్చింది.
వాగన్ ఆర్ బయోఫ్లెక్స్, సాధారణ వాగన్ ఆర్ ZXi+ 1.2 లీటర్ మాన్యువల్ వేరియంట్ ఆధారంగా తయారైంది. అయితే, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కారణంగా ఈ మోడల్ ధర స్టాండర్డ్ వెర్షన్ కంటే రూ.86,000 ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ ధర నాన్ మెటాలిక్, మెటాలిక్ పెయింట్ ఎంపికలకు ఒకే విధంగా వర్తిస్తుంది. ఈ కొత్త బయోఫ్లెక్స్ మోడల్ లో మారుతి తన పాపులర్ 1.2 లీటర్ K12N నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించింది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ జత చేశారు. E85 వరకు ఇథనాల్ మిశ్రమం కలిగిన ఇంధనంతో ఈ ఇంజన్ పనిచేసేలా ప్రత్యేక మార్పులు చేశారు. హై ఇథనాల్ ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు కొత్త ఫ్యూయల్ ఇంజెక్టర్లు, అప్ గ్రేడ్ చేసిన ఫ్యూయల్ పంప్, కొత్త ఫ్యూయల్ లైన్లు, ప్రత్యేక ఇథనాల్ సెన్సార్, రీకాలిబ్రేట్ ECU లాంటివి మార్చారు. ఈ నేపథ్యంలో ఈ కారు అన్ని రకాల ఇంధన మిశ్రమాలకు అనుగుణంగా పని చేయనుంది.
ఇంజన్ పనితీరు వివరాలను మారుతి ఇంకా వెల్లడించలేదు. అయితే, సాధారణ వాగన్ ఆర్ ZXi+ మోడల్ 91 హెచ్‌పీ పవర్, 114 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, మాన్యువల్ వెర్షన్‌లో లీటర్‌కు 23.56 కిలోమీటర్లు, AMT వెర్షన్‌లో 24.43 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో ఇంధన సామర్థ్యం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇటీవల నిర్వహించిన E20, E85 ఇంధనాల పోలిక పరీక్షల్లో E85 ఇంధనంతో మైలేజ్ కొంత మేర తగ్గినట్లు తేలింది. అయితే, ఇథనాల్ ధర తక్కువగా ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఖర్చులను కొంత వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
డిజైన్ పరంగా చూస్తే.. సాధారణ వాగన్ ఆర్‌తో పోలిస్తే పెద్ద మార్పులు కనిపించవు. వాహనం పక్క భాగంలో ‘Flex Fuel’ స్టిక్కర్లు, వెనుక భాగంలో ‘BioFlex’ బ్యాడ్జ్ మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి. మిగతా ఎక్స్ టీరియర్ డిజైన్ సేమ్ ఉంటుంది. ఇంటీరియర్‌లో కూడా పెద్ద మార్పులు లేవు. బ్లాక్ బీజ్ డ్యూయల్ టోన్ క్యాబిన్, ఫ్యాబ్రిక్ సీట్లు, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, మల్టీమీడియా కంట్రోల్స్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, ఆరు ఎయిర్ బ్యాగ్ లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లాంటి భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, వెనుక ఏసీ వెంట్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, నాలుగు స్పీకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు లాంటి సౌకర్యాలు కూడా ఈ మోడల్ లో ఉండే అవకాశం ఉంది.
Read Also: హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులపై క్రేజీ ఆఫర్లు.. ఎన్ని వేలు డిస్కౌంట్ ఇస్తుందంటే!