MG Windsor EV Indulge Edition: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంజీ మోటార్, విండ్సర్ ఈవీకి కొత్త ఎడిషన్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్ పేరుతో రానున్న ఈ ప్రత్యేక మోడల్‌కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. కొత్త ఎడిషన్ లో అదిరిపోయే కలర్, డిఫరెంట్ సీట్ అప్‌హోల్స్టరీతో పాటు వెనుక ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక ఫీచర్‌ను అందించనున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న విండ్సర్ ఈవీతో పోలిస్తే కొత్త ఎడిషన్‌లో ఎలాంటి మార్పులు ఉండనున్నాయో చూద్దాం..
ఎంజీ విండ్సర్ ఈవీ మార్కెట్లోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో 80,000 మందికి పైగా వినియోగదారులను చేరుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఇండల్జ్ ఎడిషన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. తాజాగా బయటకు ఫోటోలు ఈ స్పెషల్ మోడల్‌లో ఉండే మార్పులపై ఆసక్తిని పెంచుతున్నాయి.
కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్‌లో ప్రధానంగా కనిపించే మార్పు దాని కలర్. ఈ మోడల్‌కు ‘షాడో గోల్డ్’ అనే కొత్త కలర్ థీమ్‌ను అందించనున్నారు. దీనికి జతగా 18 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ ను ఏర్పాటు చేశారు. కారు వెనుక క్వార్టర్ గ్లాస్‌పై ‘ఇండల్జ్’ బ్యాడ్జ్ లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, కారు మొత్తం డిజైన్‌లో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించడం లేదు. ఎల్‌ఈడీ లైటింగ్, బాడీ క్లాడింగ్, పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉండే రూఫ్, బ్లాక్ ఓఆర్‌వీఎంలు లాంటి అంశాలు సాధారణ విండ్సర్ ఈవీలో మాదిరిగానే కొనసాగనున్నాయి. వెనుక భాగం డిజైన్ కూడా దాదాపు అలాగే ఉండనుంది.
కారు లోపల కూడా కొన్ని మార్పులు చేశారు. సాధారణ విండ్సర్ ఈవీలో కనిపించే నలుపు, ఐవరీ కలర్ థీమ్‌ను కొనసాగిస్తూనే, ఇండల్జ్ ఎడిషన్‌లో సీట్లకు కొత్త ‘అర్బన్ టాన్’, బ్లాక్ కలర్ కాంబినేషన్ అందించనున్నారు. లెదరెట్ సీట్లపై ఈ రంగుల కలయిక కారు ఇంటీరియర్‌కు కొత్త రూపాన్ని ఇస్తుంది. ముందు సీట్ల హెడ్ రెస్ట్ లపై ‘ఇండల్జ్’ అనే పేరును ప్రత్యేకంగా పొందుపరిచారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు భాగంలో నెక్ కుషన్లు, వెనుక సీట్లలో కూర్చునేవారి కోసం పిల్లోలను కూడా అందించనున్నారు. ఇండల్జ్ ఎడిషన్‌లో అందరి దృష్టిని ఆకర్షించే మరో ఫీచర్ వెనుక సీట్ల ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన రూఫ్‌పై అమర్చే ఫ్లిప్ డౌన్ స్క్రీన్. కంపెనీ దీనిని ‘ప్రైవ్ స్క్రీన్’గా పేర్కొంటోంది. ప్రయాణ సమయంలో వెనుక కూర్చున్నవారికి వినోదాన్ని అందించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే, ఈ స్క్రీన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అందుబాటులో ఉండే ఫంక్షన్లపై కంపెనీ అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న విండ్సర్ ఈవీ 38kWh, 52.9kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. వీటి క్లెయిమ్ చేసిన రేంజ్‌లు వరుసగా 332 కిలోమీటర్లు, 449 కిలోమీటర్లుగా ఉన్నాయి. రెండు వేరియంట్లలోనూ ముందు చక్రాలకు శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 136hp పవర్, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇండల్జ్ ఎడిషన్‌లోనూ ఇదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు కొనసాగే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్‌షోరూమ్ ధరలు సుమారు రూ.14.70 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉన్నాయి. కొత్త రంగు, అదనపు సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుంటే ఇండల్జ్ ఎడిషన్ ధర సాధారణ మోడల్ కంటే కొంత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
Read Also: భారత్ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!