Tata’s Next Big Electric SUV Lineup: భారత ఎలక్ట్రిక్ మార్కెట్లో టాప్ లో కొనసాగుతున్న టాటా మోటార్స్, రానున్న సంవత్సరాల్లో తన EV పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో టియాగో.EV, పంచ్.EV, నెక్సాన్.EV, కర్వ్.EV, హారియర్.EV లాంటి మోడళ్లతో బలమైన స్థానం సంపాదించిన టాటా, ఇప్పుడు మరో నాలుగు కొత్త ఎలక్ట్రిక్ SUVలను తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి టాటా EV శ్రేణిలో మొత్తం 10 ఎలక్ట్రిక్ మోడళ్లు ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆరు మోడళ్లకు అడిషనల్ గా సియెర్రా.EV, సఫారీ.EV, అవినయ ఎక్స్, అవినయ 3-రో SUVలను కంపెనీ మార్కెట్లోకి తీసుకురానుంది.
టాటా సియెర్రా.EV జూన్ 30, 2026న భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఒకప్పుడు కొనుగోలుదారుల్లో మంచి గుర్తింపు పొందిన సియెర్రా పేరు ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి రానుంది. ఈ SUVలో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్లు, ఏరోడైనమిక్ వీల్స్, ప్రత్యేక EV బ్యాడ్జింగ్ లాంటి మార్పులు కనిపించనున్నాయి. ఇంటీరియర్ పరంగా కూడా సియెర్రా.EV ప్రీమియం అనుభూతిని అందించనుంది. ఇందులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్, డాల్బీ అట్మోస్‌తో కూడిన JBL సౌండ్ సిస్టమ్, వైర్ లెస్ ఆపిల్ కా ర్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. సియెర్రా.EV, టాటా Acti.EV+ ప్లాట్ ఫారమ్‌పై రూపొందించబడింది. ఇందులో 55kWh నుంచి 75kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్లలో డ్యూయల్ మోటార్ ఆధారిత ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది.
ఇక టాటా తొలి మూడు వరుసల ఎలక్ట్రిక్ SUVగా సఫారీ.EV రాబోతోంది. ఈ ఏడాది పండుగ సీజన్ లో దీన్ని కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది. హారియర్.EVలో ఉపయోగించిన Acti.EV+ ప్లాట్ ఫారమ్‌పైనే ఈ మోడల్ కూడా రెడీ అవుతోంది. ఇందులో 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్ లతో పాటు కొత్త 80kWh బ్యాటరీ ఆప్షన్ ను కూడా అందించే అవకాశం ఉంది.
టాటా ఫ్యూచర్ ప్రణాళికల్లో భాగంగా ప్రీమియం, లగ్జరీ ఎలక్ట్రిక్ SUV విభాగంలోకి కూడా అడుగుపెట్టనుంది. ఇందుకోసం కంపెనీ అవిన్యా పేరుతో ప్రత్యేక EV శ్రేణిని రూపొందిస్తోంది. ఇందులో తొలి మోడల్ గా అవిన్యా ఎక్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ 2027 ప్రారంభంలో మార్కెట్లోకి రావచ్చని అంచనా. అవిన్యా ఎక్స్ అత్యాధునికక డిజైన్, క్రేజీ టెక్నాలజీతో కూడిన క్యాబిన్, కొత్త తరం ఎలక్ట్రిక్ ప్లాట్ ఫారమ్‌పై ఆధారపడి ఉండనుంది.
దీని తర్వాత మూడు వరుసల సీటింగ్ తో మరో అవిన్యా SUVను కూడా కంపెనీ తీసుకురానుంది. టాటా మోటార్స్ భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ మోడల్స్ ను తీసుకురాబోతోంది.
Read Also: స్కార్పియో ఫేస్ లిఫ్ట్ To BE 07 EV.. మహీంద్రా నుంచి ఏకంగా 6 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!