2026 Toyota Glanza Facelift Teased: కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి టయోటా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. టయోటా గ్లాంజా ఫేస్ లిఫ్ట్ ను కంపెనీ తొలిసారిగా టీజ్ చేసింది. అక్టోబర్ 14న ఈ కొత్త మోడల్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. టీజర్‌లో కారు ఫ్రంట్ డిజైన్‌లో చేసిన కొన్ని మార్పులను చూపించారు. కొత్త లుక్‌తో పాటు అదనపు ఫీచర్లు, ఇంజిన్‌లోనూ మార్పులు ఉండవచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.
టీజర్‌ను బట్టి చూస్తే, కొత్త గ్లాంజాలో పెద్ద గ్రిల్‌ను అందించనున్నారు. హనీకోంబ్ మెష్ డిజైన్‌తో పాటు రెండు వైపులా క్రోమ్ స్ట్రిప్స్ ఉండనున్నాయి. ప్రస్తుతం గ్రిల్‌పై ఉన్న టయోటా లోగో స్థానంలోనూ మార్పు కనిపిస్తోంది. హెడ్‌లైట్ల మధ్య ఉండే క్రోమ్ స్ట్రిప్ కారుకు మరింత ప్రీమియం లుక్ ఇచ్చేలా ఉంది. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్‌ను కూడా రీడిజైన్ చేసినట్లు టీజర్‌లో కనిపిస్తోంది. అయితే, హెడ్‌లైట్లు, LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, వెనుక టెయిల్ లైట్లలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ కు కొత్త డిజైన్ ఇచ్చే అవకాశం ఉంది.
ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇంటీరియర్ డిజైన్ ప్రస్తుత కారుకు దగ్గరగా ఉండొచ్చని అంచనా. అయితే, వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొన్ని కొత్త ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, మెరుగైన సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండవచ్చని తెలుస్తోంది. భద్రత విషయంలోనూ అప్‌డేట్‌లు రావచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ADAS ఫీచర్లను అందించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఫీచర్లన్నీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
ప్రస్తుత గ్లాంజాలో ఉన్న 1.2 లీటర్ K12N నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ స్థానంలో, కొత్త Z12E మూడు సిలిండర్ల ఇంజిన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదే ఇంజిన్‌ను 2026 మారుతి బాలెనోలోనూ ఉపయోగించవచ్చని తెలుస్తోంది.
ఈ ఇంజిన్ 83hp పవర్, 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా. పవర్ కొంత తగ్గినా, మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ లభించే అవకాశం ఉంది. CNG వేరియంట్ కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం. ప్రస్తుతం ఉన్న 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు కొనసాగవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం టయోటా గ్లాంజా ధరలు రూ.6.73 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉన్నాయి. ఫేస్ లిఫ్ట్ తో ధరల్లో మార్పులు ఉండవచ్చని అంచనా. మార్కెట్లో మారుతి బాలెనో, హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లకు ఇది పోటీగా నిలవనుంది. అయితే, కొత్త గ్లాంజా ఫీచర్లు, ఇంజిన్, వేరియంట్లు, ధరలపై పూర్తి వివరాలు అధికారిక లాంచ్ సమయంలోనే వెల్లడి కానున్నాయి.
Read Also: సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!