VinFast VF5 India Launch: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ భారత మార్కెట్లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే కొన్ని ఈవీ మోడళ్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న కంపెనీ.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో రెండు చిన్న ఎలక్ట్రిక్ SUVలను విడుదల చేసే అవకాశం ఉంది. వాటిలో VF3, VF5 మోడళ్లు ఉన్నాయి. వీటిలో VF5 ఇప్పటికే భారత రోడ్లపై టెస్టింగ్‌లో కనిపించడం ఆసక్తిని పెంచుతోంది.
విన్ ఫాస్ట్ VF5ను భారత్ లో విడుదల చేస్తే, టాటా పంచ్ EV లాంటి కార్లకు పోటీ ఇవ్వనుంది. మరోవైపు చిన్న పరిమాణంలో ఉండే VF3 ప్రధానంగా నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని తయారుచేయబడింది. ఇది MG కామెట్ EV లాంటి మోడళ్లతో పోటీపడే అవకాశం ఉంది. VF5 డిజైన్ పరంగా చిన్న SUV రూపాన్ని కలిగి ఉంటుంది. సిటీలో రోజువారీ ప్రయాణాలతో పాటు కుటుంబ అవసరాలకు కూడా ఉపయోగపడేలా దీన్ని తయారు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లలో VF5 రెండు బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. మొదటి వెర్షన్ లో 29.6kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఫ్రంట్ యాక్సిల్ పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 95bhp పవర్, 135Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 268 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. మరో వెర్షన్‌లో పెద్ద 37.23kWh బ్యాటరీ ఉంటుంది. ఇందులో 136bhp పవర్, 135Nm టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ వెర్షన్ 326 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. భారత మార్కెట్‌లో ఏ బ్యాటరీ ఆప్షన్‌ను తీసుకువస్తుందనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
VF5లో రోజువారీ వినియోగానికి అవసరమైన అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. దీనితో పాటు లెదరెట్ సీట్లు, నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్, PM2.5 ఎయిర్ ఫిల్టర్, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. భద్రత కోసం మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ESP, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ SUVలో 260 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. వెనుక సీట్లను మడిచినప్పుడు ఈ సామర్థ్యాన్ని 900 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. 16, 17 అంగుళాల వీల్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. భారత ఈవీ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో VF5ను తీసుకురావడం ద్వారా విన్ ఫాస్ట్ చిన్న ఎలక్ట్రిక్ SUV విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.
Read Also: కొత్త లుక్.. సరికొత్త ఫీచర్లు.. కొత్త బాలెనో వచ్చేస్తోంది!