TG Sarpanch Elections: కాంగ్రెస్ అంటేనే కథలు కథలుగా మ్యాటర్ ఉంటుంది. ఇదో ఫుట్ బాల్ గ్రౌండ్ మాదిరి అన్నట్లు. ఎవరి ఆట వారు ఆడి వెళ్తుంటారు. ఎవరికి నచ్చింది వాళ్లు చేస్తుంటారు. అదే కాంగ్రెస్. కానీ క్రమశిక్షణ అనేది కూడా ఉంటుంది కదా. ఎవరికి నచ్చిన గేమ్ వారు ఆడుతానంటే ఎప్పటికీ కుదరదు కదా.. అందుకే ఇప్పుడు హైకమాండ్ కూడా డిసిప్లిన్ అస్త్రాన్ని బయటకు తీస్తోంది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి నష్టం చేసే వారిపై నజర్ పెట్టింది. వీటికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సవాల్, అటు జూబ్లీహిల్స్ బైపోల్ టెస్ట్ ఉండనే ఉన్నాయి. మరి లెక్క సెట్ అవుతుందా?
క్యాడర్‌ను యాక్టివెట్ చేస్తున్న కాంగ్రెస్
రైట్ ఇదీ మ్యాటర్. కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెంచుతోంది. కార్యకర్తలను మళ్లీ యాక్టివేట్ చేసే పనిలో ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ.. లోకల్ బాడీ ఎన్నికల్లోనూ సత్తా చాటితే ఆ పట్టు వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. అయితే ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. కాంగ్రెస్ పరిస్థితి తెలిసిందే కదా.. ఇంటర్నల్ వార్ పెరుగుతోంది. కొత్త, పాత నేతలకు మధ్య పడట్లేదు. పైకే నవ్వులు.. లోలోపల మాత్రం కంటికి కనిపించని శత్రుత్వాలు. ఇదీ సీన్. ఇక్కడ చూడండి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన గొల్లకురుమ నేతలు గాంధీ భవన్ దగ్గర గొర్రెలు తీసుకొచ్చి నిరసన తెలిపారు. క్యాబినెట్ లో అవకాశం ఇవ్వడం, గొల్లకురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 వేల కోట్లు ఇవ్వాలన్న డిమాండ్లు వినిపించారు. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా సీరియస్ అయ్యారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్ లో ఇలాంటి విషయాలన్నీ చర్చకు వచ్చాయి. ఇందులో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. పదవుల కోసం గాంధీ భవన్ లో ధర్నా చేయడం, రాంగ్ సిగ్నల్స్ పంపినట్లు అవుతుందన్న మాటను సీఎం రేవంత్ వినిపించారు. గాంధీ భవన్ లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దని, ఏదైనా ఉంటే సీఎం లేదంటే పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకురావాలన్నారు.
కష్టపడుతున్న వారు, కష్టపడని వారి లిస్టులు
ఇదే కాదు.. పార్టీకోసం నిజంగా కష్టపడుతున్న వారెవరు.. యాక్టింగ్ చేస్తున్న వారెవరు.. రివర్స్ లో తీసుకెళ్లాలనుకుంటున్న వాళ్లెవరు ఇది తేల్చాలని డిసైడ్ అయ్యారు. పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని రెండు జాబితాలుగా రెడీ చేసి అందరికీ పని అప్పగించాలన్నారు. అంటే పని చేసిన వారిని ఒక లిస్ట్, చేయని వారిది ఇంకో లిస్ట్ రెడీ చేయబోతున్నారన్న మాట. డిసిప్లిన్ తో పని చేసిన వారికి ప్రమోషన్, చేయని వారికి డిమోషన్ ఇందులో ఎలాంటి మొహమాటం లేదని ఘాటుగానే సిగ్నల్స్ పంపారు. తాజా మీటింగ్ కాంగ్రెస్ లో టాప్ టు బాటమ్ అందరినీ అలర్ట్ చేసినట్లైంది. మంత్రుల పనితీరుపైనా గరంగరంగానే ఘాటు డీలింగ్ నడిచింది. నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ ఎందుకు జరగట్లేదు, ఇంఛార్జ్ మంత్రులు సరిగా దృష్టి సారించకపోవడం, ఇవన్నీ చర్చకు వచ్చాయి. లోకల్ బాడీ ఎన్నికల బాధ్యత మంత్రులదే అని సీఎం క్లారిటీగా చెప్పేశారు కూడా. కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందంటున్నారు. లోకల్ బాడీతో పాటే.. జూబ్లీహిల్స్ బైపోల్ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారింది. ఇదే టైంలో నేతలు ఎవరికి వారే తామే అభ్యర్థులమని, గెలుపు పక్కా అని ప్రకటించుకుంటున్నారు. తలా ఒక మాట మాట్లాడొద్దని, ఇది పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుందన్నారు సీఎం. ఉప ఎన్నికపై హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోవద్దంటున్నారు సీఎం రేవంత్. సో పార్టీలో ఐక్యత ముఖ్యం. గెలవాలంటే కమిట్ మెంట్ కీలకం. ఇదే దిశానిర్దేశం చేస్తున్నారు. మరి హస్తం నేతలు ఫాలో అవుతారా?
యూనిటీగా ముందుకు సాగే ఫార్ములా ఏది?
ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య పొసగట్లేదు. ఎమ్మెల్యేలకు కిందిస్థాయి క్యాడర్ కు గ్యాప్ ఉంది. ఇక పార్టీలో పాత, కొత్త నేతల మధ్య ఇంకా సయోధ్య రాలేదు. ఉప్పు నిప్పులాగే సీన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తవాసి సాధ్యమా? జిల్లా ఇంఛార్జ్ మంత్రులపై పెద్ద బాధ్యత, కానీ అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే ఆశావాహులు.. ఈ సవాళ్లను అధిగమించి గెలుపు సాధ్యమా? ఏం జరగబోతోంది? కాంగ్రెస్ లో కథలు చాలా టిపికల్ గా ఉంటాయి. ఎవరి గేమ్ వారు ఆడుతుంటారు. నచ్చినట్లు చేద్దామనుకుంటారు. కానీ ఇప్పుడు అవన్నీ కుదరవు అంటోంది హైకమాండ్. ఒకే లైన్ లో యూనిటీగా ముందుకు సాగాల్సిందే అని స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపుతున్నారు. కష్టపడి పని చేసిన వాళ్లకు కచ్చితంగా పదవుల్లో న్యాయం జరుగుతుందన్న మాట వినిపిస్తున్నారు. హామీ ఇస్తున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు ఇప్పుడు టెస్టింగ్ టైమ్ గా మారాయి. ఈ ఎన్నికల్లో నూటికి నూరు శాతం పంచాయతీలు, జడ్పీలను కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకైతే భారీ టాస్క్ ఇచ్చేశారు. ఈ టార్గెట్ రీచ్ అయ్యేందుకు కొన్ని జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులను మార్చడం, ముగ్గురు సీనియర్ మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వడం వంటి స్ట్రాటజిక్ యాక్షన్స్ చేపట్టారు. ఈ చర్యలు ఎన్నికల్లో గెలుపు కోసం కీలకమన్న చర్చ జరుగుతోంది.
పటాన్ చెరులో గూడెం వర్సెస్ శ్నీనివాస్ గౌడ్
రాబోయే లోకల్ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేవిగా ఉంటాయన్న వాదనను వినిపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలు, జడ్పీలను దాదాపు క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ బాధ్యత జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులతోపాటు ఎమ్మెల్యేలపై ఉందని హైకమాండ్ ఇప్పటికే స్పష్టం చేసింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి టికెట్లు ఇవ్వడం ఈ ఎన్నికల్లో కీలకం అన్న సిగ్నల్స్ పంపించింది. అయితే ఇక్కడే చాలా ట్విస్టులు ఉన్నాయి మరి. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ వార్ ఓ రేంజ్ లో నడుస్తోంది. ఇవి ఎన్నికల ఫలితాలపై ఏదైనా ఎఫెక్ట్ చూపుతాయా అన్న ఆందోళన పార్టీ నేతల్లో పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు, చేవెళ్ల లో కాలె యాదయ్య, రాజేంద్రనగర్ లో ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ, ఖైరతాబాద్ – దానం నాగేందర్, బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల – డాక్టర్ సంజయ్, పటాన్‌చెరు – గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల – కృష్ణ మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య పొసగడం లేదు.
జగిత్యాలలో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి
ముఖ్యంగా పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్ మధ్య ఘర్షణ ఉంది. అటు జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌తో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య వివాదం నడుస్తోంది. ఇద్దరూ ఒకే వేదికను అస్సలు పంచుకోవడం లేదు. గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డితో సరితా తిరుపతయ్య మధ్య అసమ్మతి ఉంది. ఖైరతాబాద్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో విజయా రెడ్డి మధ్య కోఆర్డినేషన్ సరిగా లేదంటున్నారు. ఈ విభేదాలు పార్టీ యూనిటీకి దెబ్బగా మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తమ అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారని, పాత కాంగ్రెస్ కేడర్‌ను పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, సీఎం రేవంత్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ఇలా పార్టీ మారిన సందర్భాల్లో ఇలాంటివి కామనే. 2014 నుంచి పదవులు లేక ఆశలు కోల్పోయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆశావాహులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ టికెట్ల కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజామద్దతు, గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేయడం ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్ మంత్రులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే వీటికి కొంత గ్రౌండ్ వర్క్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇటీవల డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం టీపీసీసీ ప్రత్యేక పరిశీలకులను నియమించి, ఫైనల్ లిస్ట్ తెప్పించినట్లే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రత్యేక సర్వేల ద్వారా అభ్యర్థులను గుర్తించాలనే డిమాండ్ ఉంది. సీనియారిటీ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుంటే రెబల్స్ సమస్య తగ్గుతుందని అనుకుంటున్నారు. ఈ ఫార్ములా ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
ఐక్యత కోసం మీనాక్షి నటరాజన్ సమావేశాలు
నేతలందరిలో యూనిటీ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పలుమార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించినప్పటికీ, పాత, కొత్త నేతల మధ్య విభేదాలు తొలగలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో కూడా పార్టీ కేడర్ గ్రూపులుగా చీలిపోయి కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గమే తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ నుంచి గతంలో అజారుద్దీన్ పోటీ చేశారు. చాలా గ్రూప్ వార్ ఉంది. క్యాడర్ లో యూనిటీ లేదు. ఇంతలోనే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో బైపోల్ రావడం ఖాయమైంది. ఈ గ్యాప్ లోనే కాంగ్రెస్ నుంచి ఎవరికి వారు పోటీ చేస్తామన్న వాదన పెరుగుతోంది. అప్లికేషన్ పెట్టుకోవాలని, ఆ తర్వాత వడపోత ఉంటుందని, సీడబ్లూసీ ఫైనల్ గా అభ్యర్థిని ప్రకటిస్తుందని అంటున్నారు. అటు లేటెస్ట్ గా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను సైతం పరిగణలోకి తీసుకుంది. ఈ ప్రకారం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని పట్టాలెక్కించే పని పెట్టుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని, ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో నెల రోజుల గడువు అవసరమని కోర్టులో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వీటికి తోడు రిజర్వేషన్ల ప్రక్రియపై పార్టీ పరంగా ఎలా ముందుకెళ్లాలన్నది ఆలోచిస్తున్నారు.
Also Read: వేల కోట్లతో యుద్ధం.! ఇజ్రాయెల్‌కి మిగిలిందేంటి?
కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలవకపోతే విపక్షాలకు అడ్వాంటేజ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ సాధించాలంటే, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు… గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం కీలకం. అదే సమయంలో అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడం అన్నిటికంటే ముఖ్యం. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం ఇంకా ముఖ్యం. సర్వేల ద్వారా అసలైన అభ్యర్థుల్ని ఎంపిక చేయడం, సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వడం, రెబల్స్ బెడద తగ్గించుకోవడం ఇవన్నీ కీ రోల్ పోషించబోతున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యమైందంటేంటే.. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు చూపించకపోతే ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ అవుతుంది. ప్రభుత్వంపై మరింత దాడి పెరుగుతుంది. అయితే ఆ అవకాశం ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీగా లేరు. 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంపై జనానికి పదే పదే వివరిస్తున్నారు. త్వరలోనే రాజీవ్ యువవికాసం కూడా ఉంటుందంటున్నారు.
Story By Vidya, Bigtv