BigTV English

Iran Vs Israel: వేల కోట్లతో యుద్ధం.! ఇజ్రాయెల్‌కి మిగిలిందేంటి?

Iran Vs Israel: వేల కోట్లతో యుద్ధం.! ఇజ్రాయెల్‌కి మిగిలిందేంటి?

Iran Vs Israel: యుద్ధం.. ఇంకా ముగియలేదా? ఇంకా మిగిలే ఉందా? అయితే అందుకు తగిన ఆధారాలేంటి? అణు కేంద్రాలను విధ్వంసం చేయడమే ఒక టార్గెట్ గా తామీ యుద్ధం చేస్తున్నామన్న ఇజ్రాయెల్ యూఎస్.. ఆ పని పూర్తి చేయలేదా? పర్పస్ సర్వైవ్ కాలేదా? అసలు ఇరాన్ లో ఏం జరిగింది? తర్వాత ఏం జరగబోతోంది? తెలియాలంటే మీరీ స్టోరీ చూసి తీరాల్సిందే.


US దాడులకు ముందు ఇరాన్ 400 కిలోల యురేనియం తరలింపు

వేల కోట్లతో యుద్ధం చేసిన ఇజ్రాయెల్ కి మిగిలిందేంటి?అమెరికా దాడులకు ముందు.. ఇరాన్ పది అణు బాంబులు తయారు చేయడానికి సరిపడా.. యురేనియం తరలించిందా? అమెరికా కన్నుగప్పి.. ఇరాన్ 400 కిలోల యురేనియం దాచి ఉంచిందా? ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ దాడులకు ముందే ఈ తరలింపు జరిగిపోయిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇరాన్- ఇజ్రాయెల్ వార్ లో అమెరికా దాడులు అత్యంత కీలకమని ముందే గుర్తించింది ఇరాన్. ఎందుకంటే యూఎస్ ఆర్మీ అమ్ముల పొదిలోని బంకర్ బస్టర్ బాంబులు తమ దేశ అణు నిల్వలు మొత్తం ఖాళీ చేయించడం ఖాయమని గుర్తించిన ఇరాన్ రెండు వ్యూహాలు రచించింది. వాటిలో ఒకటి- అమెరికాను ఖతార్ యాంగిల్ లో టార్గెట్ చేయడం. రెండు అసలు అమెరికా తమ అణు నిల్వలు ఖాళీ చేయడం కన్నా ముందు- మనమే ఖాళీ చేస్తే ఎలా ఉంటుందో అన్న ఎత్తుగడ వేయటం. అందులో భాగంగా ఇరాన్ 60 శాతం మేర శుద్ధి చేసిన యురేనియం తరలింపు కార్యక్రమం జరిగింది. ఇదెంత సులువంటే కంటైనర్లు మాత్రమే కాదు.. కార్లలో కూడా వీటిని అవలీలగా తరలించవచ్చు. దీన్ని దాచి జాగ్రత్తగా చిన్నతరహా అణ్వాయుధాలను సులువుగా చేయవచ్చన్నది NPR అనే అమెరికా పత్రికకు చెప్పారు అణ్వాయుధ నిపుణులు.


ఈ తరలింపును ఒప్పకున్న VP జేడి వాన్స్, IAEA చీఫ్ గ్రాస్సీ

యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్‌ రాఫెల్ గ్రాస్సీ ఇద్దరూ ఈ తరలింపును ఒప్పుకున్నారు. దీంతో ఇపుడీ యురేనియం చుట్టూ అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు నడిచేలా కనిపిస్తున్నాయ్. అయితే ఈ మిగులు నిల్వల ద్వారా ఇరాన్ ఏం చేయనుందన్న కొత్త డిబేట్ కి తెరలేచింది. ఇప్పటికే యూఎస్- ఇరాన్ మధ్య అణు ఒప్పందం సమస్య కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. ఈలోగా అంతర్జాతీయ అణు శక్తి సంస్థ.. ఇరాన్ గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అణు ఉల్లంఘనకు పాల్పడిందని గుర్తించిన ఇజ్రాయెల్.. ఈయుద్ధానికి తెగబడింది. మేము ఇరాన్ అణు గుండెలను దెబ్బ తీశామని సగర్వ ప్రకటనలు సైతం చేసింది ఇజ్రాయెల్. ఈమేరకు ఆపరేషన్ రైజింగ్ లయన్ టార్గెట్ హండ్రెడ్ పర్సంట్ ఫినీష్ చేశామని గొప్పగా చెప్పుకొచ్చింది. తమ యుద్ధం పర్పస్ సర్వైవ్ అయ్యిందని నెతన్యాహూ ఒక ప్రధానిగా ఎంతో హ్యాపీ ఫీలయ్యారు. కానీ ప్రస్తుతం అందుతున్న రిపోర్టులను బట్టీ చూస్తే ఈ వార్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ చెబుతున్న మాట ఏంటంటే.. ఇరాన్ తమ యురేనియం ఎంతో తెలివిగా దాచి పెట్టిందన్న మాట నిజమేనంటోంది. ఈ విషయాన్ని వాళ్లు రహస్యంగా ఉంచలేక పోయారని చెబుతోంది. ఇంకా వారి దగ్గర 400 కిలోల యురేనియం నిల్వలున్నాయనీ స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులు ప్రారంభించడానికి వారం ముందు తమ యూఎన్ బృందం పరిశీలకులు ఈ వస్తువును చివరిసారిగా చూశారనీ చెప్పుకొస్తోంది IAEA.

ఇరాన్ దగ్గర 60 శాతం శుద్ధి చేసిన యురేనియం

ప్రస్తుతం ఇరాన్ దగ్గర 60 శాతం మేర శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నాయి. ఈ మొత్తం అణ్వాయుధ తయారీకి అవసరమయ్యే 90 శాతానికి తక్కువ. అయితే దీని ద్వారా కూడా చిన్నపాటి అణ్వాయుధాల తయారీ చేసే వెసలుబాటు ఉంది. దీన్ని.. ఇస్ఫహాన్ కి దగ్గర్లో మరో అణు కేంద్రంలో లోతుగా నిల్వ చేసినట్టు భావిస్తున్నారు. మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు మూడు అణు కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టు చూపించాయి. దెబ్బ తిన్న భవనాలు, ధూళిని సైతం క్యాప్చర్ చేశాయి. వీటన్నిటినీ చూసి తమ బంకర్ బస్టర్ బాంబు ఇరాన్ అణు నిల్వలన్నిటినీ నాశనం చేసిందని చెప్పుకున్నారు కానీ, అదంతా నిజం కాదని. ఇంకా యుద్ధం మిగిలే ఉందని తెలియడంతో ఈ ఆనందం మొత్తం ఆవిరవుతోన్న పరిస్థితి. కారణం తాము చేసిన దాడులు కేవలం పైపైవే. ఆ ప్రాంతాల నుంచి అణు నిల్వలను ఎప్పుడో తప్పించారని తెలియడంతో.. ఈ మొత్తం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్టే కనిపిస్తోందని అంటున్నారు నిపుణులు. ఇరానియన్ అణు కేంద్రాల నుంచి అణు నిల్వలు పక్కకు తప్పించారా లేదా? అనడానికి గల సైంటిఫిక్ ఎవిడెన్సులు ఏంటని చూస్తే.. అమెరికా దాడి చేయడానికి ముందు- తర్వాత కొన్ని శాటిలైట్ పిక్చర్స్ తీసి చూశారు. వీటిలో స్పష్టంగా గమనించిన తేడా ఏంటంటే, 16 కార్గో ట్రక్కులు అక్కడ మొదట ఉండగా.. తర్వాత అవి కనిపించలేదనీ.. దీన్ని బట్టీ చూస్తే ఈ ట్రక్కుల ద్వారా అణు నిల్వలు రహస్య ప్రాంతాలకు తరలించి ఉంటారనీ అంటారు నిపుణులు.

ఇదంతా 24 గంటల వ్వవధిలో జరిగింది-ఫ్రీ ప్రెస్

ఇదంతా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జరిగినట్టు తెలుస్తోంది. కొన్ని వాహనాలు ఇక్కడికి వచ్చి వెళ్లాయనీ.. గుర్తు తెలియని వస్తువులను తరలించినట్టు కనిపించాయని.. అమెరికా అధికారుల మాట నిజం చేస్తూ ఫ్రీ ప్రెస్ రిపోర్ట్ చేసింది. ఈ టైంలో.. అమెరికా- ఇజ్రాయెల్ నిఘా అధికారులకు ఈ కదలిక గురించి తెలుసనీ.. అయితే వీటిపై చర్య తీసుకోకూడదని.. ట్రంప్ ఆదేశం కసం వేచి చూడాలని వారు భావించినట్టు సమాచారం. ఇక న్యూయార్క్ టైమ్స్ కూడా ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబులు వేసే ముందే అక్కడి నుంచి అణు సరుకు తరలి వెళ్లిపోయినట్టు తన కథనం ద్వారా తెలియ చేసింది. 12 రోజుల యుద్దం తర్వాత ఇజ్రాయెల్- ఇరాన్ మద్య కాల్పుల విరమణ కుదరడం. మొదట ఒప్పుకోకున్నా.. ఇరాన్ ఎట్టకేలకు దీన్ని అంగీకరించింది. ఇజ్రాయెల్ కూడా ఈ వార్త నిజమని వెంటనే చెప్పింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పారు కూడా. అయితే ఇదంతా ఇప్పుడు వృధా ప్రయాసగా మారినట్టుగా భావించాల్సి వస్తోంది. కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఈ యుద్ధం చేసిన ఇజ్రాయెల్ కి మిగిలిందేంటన్న ప్రశ్న తలెత్తుతోంది.
అయితే ఇక్కడ ఇజ్రాయెల్ కి మిగిలిందల్లా ఒకే ఒక్క ఊరట. అదే ఇరానియన్ అణు శాస్త్రవేత్తలను హతం చేయడం. మరి దీని ద్వారా ఇరాన్ ఇక అణ్వాయుధ తయారీకి దూరమైనట్టేనా? ఇంతకీ సైనికులు కాని సైంటిస్టులను చంపం ఎంత వరకూ సమంజసం? ఈ విషయంలో అంతర్జాతీయ మానవతా హక్కుల నిపుణులు ఏమంటున్నారు? సరిగ్గా ఇదే విషయంలో న్యాయ నిపుణల మాట ఏమిటి?

14 మంది ఇరానియం సైంటిస్టులను చంపిన ఇజ్రాయెల్

అందుకే ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్?ఈ యుద్ధం ద్వారా.. ఇజ్రాయెల్ ఏం సాధించిందో చూస్తే.. 14 మంది ఇరానియన్ సైంటిస్టులను టార్గెట్ చేసుకుని హతం చేయడం. వీరిలో ఎక్కువ మంది ఇరాన్ అణు కార్యక్రమంలో పాలు పంచుకున్నవారే. వారు ఎవరని చూస్తే.. ఫెరియెదౌన్‌ అబ్బాసీ అనే అణు ఇంజనీర్, మహమ్మద్‌ మాహ్దీ టెహ్రాంచీ అనే భౌతిక శాస్త్ర నిపుణుడు, అక్బర్‌ మటాలి జాదే అనే కెమెకల్‌ ఇంజనీర్‌, సయీద్‌ బెరాజీ అనే మెటీరియల్స్‌ ఇంజనీర్‌, ఆమీర్‌ హస్సన్‌ ఫాకాహీ అనే ఫిజిక్స్ సైంటిస్ట్, అల్‌ హమీద్‌ మినుషార్‌ రియాక్టర్‌ ఫిజిక్స్‌ ఎక్స్ పర్ట్, మాన్సోర్‌ అస్గరీ అనే ఫిజిక్స్‌ సైంటిస్ట్, రెజా డవలపార్కీ దర్యానీ అనే అణు ఇంజనీర్‌, అలీ బాఖియా కాథెహెర్మి అనే మెకానికల్‌ ఇంజనీర్.. వీళ్లంతా ఆపరేషన్‌ నార్నియాకు బలయ్యారని చానల్‌-9, చానల్‌-12 వార్తా కథనాల ద్వారా తెలిసింది. ఇరాన్ కి ఇదొరకరంగా చెబితే అణు కార్యక్రమ పరంగా అతి పెద్ద దెబ్బ. ఎందుకంటే ఆటామిక్ సైన్స్ అంటే అదేమంత తేలికైనది కాదు. ఇందులో ఎంతో నిష్ణాతులైతే తప్ప.. ఈ సైన్స్ ని హ్యాండిల్ చేయలేం. మరి ఈ ప్రాణ నష్టం ద్వారా ఇరాన్ అణు సాంకేతిక పరిజ్ఞానం కుంటు పడుతుందా? అన్న చర్చకు తెరలేచింది.

ఇది ఇరాన్‌కి చావు దెబ్బతో సమానం

అసోసియేటెడ్ ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ లోని ఇజ్రాయెల్ రాయబారి మాట్లాడుతూ.. ఈ హత్యలు ఇరాన్ కి దాదాపు చావు దెబ్బతో సమానం. ఇప్పట్లో ఇరాన్ అణ్వాయుధ తయారీ సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెబుతున్నారు. ఇజ్రాయెలీ నిఘా వ్యవస్థ ద్వారా వీరిని గుర్తించారు.. తర్వాత హతమార్చారు. ఇది ఇరానియన్ ఆటామిక్ ప్రొగ్రామ్ ని కొన్నేళ్లకు వెనక్కు నెట్టడమే అంటారు.. రాయబారి జాషువా జర్కా. అయితే వీరి స్థానాన్ని ఆక్రమించగల ఎందరో యువ సైంటిస్టులు సిద్ధంగా ఉన్నారని అంటారు కొందరు విశ్లేషకులు. కేవలం యురోపియన్ ఆర్మీ బంబాట్ మెంట్.. ఇరాన్ అణు పరిజ్ఞానాన్ని నిర్మూలించలేవు. అది సాధ్యం కాని పని. కాబట్టి చర్చలు మాత్రమే శరణ్యం అన్న సంకేతాలు అందుతున్నాయి. ఇరాన్ అనేక దశకాలుగా అణు పరిజ్ఞానాన్ని సంపాదిస్తూ వస్తోంది. ఈ శాస్త్రవేత్తలను హతమార్చడం ద్వారా.. వారి అణు ఆశయాన్ని అడ్డుకోలేవు. కేవలం ఇరాన్ అని మాత్రమే కాదు.. ప్రపంచంలో ఏ దేశ ప్రభుత్వమే అయినా సరే.. వారి వారి జాతీయ ఆశయాలను సమూలంగా నాశనం చేయడం అంత తేలికైన పని కాదని అన్నారు- యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ.

ఇరాన్ మళ్లీ అణ్వాయుధం సమీకరిస్తుంది-ఇజ్రాయెల్

ఇరాన్ ఎంతో కాలంగా తన అణు కార్యక్రమం శాంతియుతంగా నడుస్తున్నట్టు చెబుతోంది. ఆ మాటకొస్తే ఇది పౌర అవసరాల కోసం చేస్తున్నట్టుగానూ చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయం ఎవ్వరూ నమ్మలేదు. దానికి తోడు అణు శక్తి సంస్థ సైతం రిపోర్ట్ చేయడంతో ఇజ్రాయెల్ అనూహ్యంగా ఇరాన్ పై విరుచుకుపడింది. ఎలాగైనా సరే ఇరాన్ మళ్లీ తమ అణ్వాయుధాన్ని సమీకరించే అవకాశం లేక పోలదని అంచనా వేస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన వారి మెదళ్లలో ఎంతో అణు పరిజ్ఞానం నిక్షిప్తమై ఉంది. ఇది వారికి చేటు తెస్తుందని తెలిసినా.. ఈ పరిజ్ఞానం విస్తరిస్తూ వచ్చారు. అందుకు కారణం అదొక జాతీయ లక్ష్యం. ఆ టార్గెట్ లో భాగంగా.. ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధం అన్న ఆలోచనతోనే వారీ సాహసానికి పాల్పడుతుంటారు. జూన్ 13న ఇజ్రాయెల్ చేసిన తొలి విడత దాడుల్లోనే 9 మంది ఇరాన్ అణు శాస్త్ర వేత్తలు మరణించినట్టు చెబుతారు ఇజ్రాయెల్ సైనిక అధికారులు. వారు గత కొన్నేళ్లుగా అణు పరిజ్ఞానంలో ఆరితేరుతున్నట్టు స్పష్టమైన నిఘా పెట్టి మరీ వారిని గుర్తించింది ఇజ్రాయెల్. భారత్ గానీ మొన్నటి ఆపరేషన్ సిందూర్ లో.. పాక్ ఉగ్రవాదులను ఏ విధంగా నిఘా పెట్టి గుర్తించి మరీ అటాక్ చేసిందో. ఇదీ అంతే. ఇరాన్ స్టేట్ టీవీ కథనాలను అనుసరించి చెబితే ఇరానియన్ అతి పెద్ద అణు శాస్త్రవేత్త మొహమద్ రజా సాబెర్- ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్టు తెలుస్తోంది. జూన్ 13న తన 17 ఏళ్ల కుమారుడు మరణించిన తర్వాత ఈ దాడి జరిగిట్టు చెబుతోంది స్టేట్ టీవీ.

ఈ మిషన్ ఫాలో అవుతున్న స్కాలర్లున్నారు- ఫిట్స్ ప్యాట్రిక్

కొన్ని దశకాలుగా.. ఇరాన్ ఇటు అణు పరిశోధనలతో పాటు- అటు బాలిస్టిక్ క్షిపణులకు సరిపడా వార్ హెడ్స్ అందించే దిశగా ఎన్నో ప్రయోగాలు చేసిందనీ.. అంటారు. దీంతో పాటు అణ్వాయుధ తయారీలో తమకంటూ ఒక సొంత పరిజ్ఞానం తయారు చేసుకుంది. దానికి తోడు ఎప్పటి నుంచో ఈ టెక్నాజీని ఫాలో అవుతున్న స్కాలర్లు వెంటనే ఈ మిషన్ని అందుకుంటారని విశ్లేషిస్తారు.. అణు వ్యాప్తి నిరోధక నిపుణుడైన మార్క్ ఫిట్స్ ప్యాట్రిక్. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై దాడి, కొందరు ఇరానియన్లను హతమార్చడం ద్వారా.. కొంత కాలం పాటు ఈ ప్రాజెక్టు వెనకబడే ఛాన్సు లేక పోలేదు. కానీ ఎప్పటికైనా తిరిగి పుంజుకోదన్న గ్యారంటీ లేదన్నది కొందరు నిపుణులు స్పష్టంగా చెబుతోన్న మాట. ఎప్పుడూగానీ ఏ విషయంలోగానీ రిజర్వ్ బెంచ్ అన్నదొకటి ఉంటుంది. ఇది క్రికెట్ వంటి జట్లకు కావచ్చు- అణ్వాయుధాల తయారీ కావచ్చు. ఇదొక డీఫాల్ట్ ప్రోగ్రాం. ఏది ఏమైనా ఇరాన్ తన అణు కార్యక్రమం- ఎట్టకేలకు పూర్తి చేయడానికే అవకాశముందని అంటారు ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ విశ్లేషకులు. ఇరాన్ తిరిగి ఈ అణు కార్యక్రమాలను ఎప్పుడు మొదలు పెడుతుంది? అన్నదొక చర్చగా మారింది. అయితే ఈ కార్యక్రమానికి చెందిన పరికరాలు ఏ స్థాయిలో నాశనం చేశారో దాన్నిబట్టీ ఇదంతా ఆధారపడి ఉంటుందని అంటారు నిపుణులు.

శుద్ధి చేసిన యురేనియం ఉంటే చాలు-పావెల్

అణ్వాయుధ తయారీలో అత్యంత ముఖ్యమైనది శుద్ధి చేసిన యురేనియం. ఇది ఉంటే చాలు.. మిగిలినదంతా ఏమంత కష్టతరం కాదని అంటారు జెనీవాకు చెందిన విశ్లేషకుడు పావెల్. సైంటిస్టులను చంపడం అంటే ఈ కార్యక్రమం పట్ల భయం కలిగేలా చేయడం. అంతే తప్ప మొత్తంగా ఆపడానికి కాదన్నది పావెల్ అంటోన్న మాట. ఈ విషయంలో ఇజ్రాయెల్ రాయబారి అంటోన్న మాట ఏంటంటే వచ్చే రోజుల్లో ఇరాన్ కోసం అణ్వాయుధం తయారు చేయడానికి కొత్త తరం సైంటిస్టులు జంకుతారనేది నిజం. అలాగని ఇరాన్ ఈ సమస్యను ఎప్పటికీ అధిగమించలేదని చెప్పడానికి వీల్లేదని అంటారు వీరు. ఎందుకంటే ఇరాన్ బేసిక్ థియరీ ఏంటంటే, మతం. మత ప్రాతిపథికన ఈ మొత్తం ప్రొగ్రాం ప్లాన్ చేస్తోంది. ఈ మొత్తం మిషన్ వ్యతిరేకిస్తూన్న ఇజ్రాయెల్ దగ్గర కూడా అణ్వాయుధాలు పుష్కలంగా ఉన్నాయి. తద్వారా లెబనాన్, పాలస్తీనా మీద అది చేసే దాడులు ఇరానియన్ ఇస్లామిస్టులకు తీవ్ర అభ్యంతరకరం. వీరి ప్రోద్బలం ద్వారా కొత్త సైంటిస్టులు పుట్టుకు రారని అనడానికి వీల్లేదు. సైన్సు పట్ల ఆసక్తి ద్వారా చేయలేని పని మతం ద్వారా చేయడం ఏమంత కష్టం కాదు. పాక్ ప్రస్తుతం తన ఉగ్రవాదులను ఎలా తయారు చేస్తోందో ఇదీ అంతేనని అంటారు వీరు. ఇప్పుడే కాదు గతంలో కూడా.. ఇరానియన్ అణు సైంటిస్టులే టార్గెట్ గా ఇజ్రాయెల్ ఎన్నో దాడులు చేసింది. అయితే ఈసారి మాత్రమే బాహటంగా తాము శాస్త్రవేత్తలను హతమార్చినట్టు చెబుతోంది ఇజ్రాయెల్. 2020లో ఇరాన్ అగ్ర అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫక్రీజాను రిమోట్ కంట్రోల్డ్ మెషిన్ గన్ తో సరిగ్గా ఇలాగే హతమార్చింది ఇజ్రాయెల్‌. అలాగని వారి అణు కార్యక్రమం ఏదీ ఆగలేదు. కాకుంటే ఆలస్యం జరిగింది. ఇప్పుడు కూడా అంతే. కాసింత లేటవుతుందేమోగానీ అది బొత్తిగా ఆగిపోయే ఛాన్స్ లేదని అంటారు పారిస్ కి చెందిన విశ్లేషకుడు లోవా రివెల్.

ఫక్రీజా లాంటి సైంటిస్టును చంపకుంటే.. ఇరాన్ అణు కార్యక్రమం ఎప్పుడో పూర్తయ్యేది

అయితే ఇక్కడ ఇజ్రాయెల్ రాయబారి తేల్చి చెప్పేదేంటంటే ఇదే ఫక్రీజాను తాము చంపకుంటే.. ఈ అణు కార్యక్రమం ఎప్పుడో పూర్తి అయ్యి ఉండేది. ఇరాన్ సైతం అణ్వాయుధ దేశంగా తయారై ఉండేది. తాము నిరంతరం వారి అణు కీలు ఎరిగి వాత పెడుతూ వచ్చాం కాబట్టే.. ఇప్పటికీ ఇరాన్ శుద్ధి చేసిన అణు నిల్వలను మాత్రమే కలిగి ఉందని తేల్చి చెబుతోంది.. ఇజ్రాయెల్.

అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం చూస్తే సైనికులు కాని వారిని చంపడాన్ని నేరంగా భావిస్తుంది. అయితే వారు ఆయుధ తయారీలో భాగమైనపుడు.. అందునా అణ్వాయుధ తయారీలో పార్టిసిపేట్ చేసినపుడు వారిని హతమార్చడం ఏమంత తప్పు కాదని అంటారు న్యాయనిపుణులు. ఇరానియన్ అణు శాస్త్రవేత్తల ఆలోచన ఏంటంటే ఇజ్రాయెల్ మొత్తాన్ని లేకుండా చేయడం కోసమే ఈ అణ్వాయుధ తయారీ. అందువల్లే వారు ఇజ్రాయెల్ చట్టపరమైన లక్ష్యాలుగా మారినట్టు భావిస్తున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. రెండో ప్రపంచయుద్ధంలో తొలి అణ్వాయుధ తయారీ చేసిన వారిని జర్మనీ జపాన్ లేకుండా చేయడానికి ప్రయత్నించాయి. ఇదీ అంతేనంటారు ఇజ్రాయెల్ సైనిక నిపుణులు. కొందరు న్యాయనిపుణులు చెప్పే మాట ఏంటంటే.. ఇరానియన్ సైంటిస్టులను హతమార్చడం కరెక్టా కాదా? అన్నది అటుంచితే.. శుద్ధి చేసిన యురేనియం ఉండగానే సరిపోదు. దాన్నొక వార్ హెడ్ గా తయారు చేయడమే అతి పెద్ద టాస్క్. ఇది ఆయుధ నిపుణులకు సంబంధించిన వ్యవహారం. అయితే ఈ విషయంలోనూ ఈ సైంటిస్టులు మరింత ముందుకెళ్తున్నారు. ఇది గుర్తించడం వల్లే.. ఇరాన్ శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ అంతం చేసిందని అంటారీ నిపుణులు.

Story By Adinarayana, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×