రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలను గెలిచేందుకు మంచి పట్టుమీదున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. ఈ గెలుపు సెమీ ఫైనల్ అని హరీశ్ ప్రకటించుకోవడం కూడా కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలనే వ్యూహంగా కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం చాలా ఉన్నా.. ఇప్పుడు వచ్చే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా తీసుకోవడం బీఆర్ఎస్ రిస్క్ నిర్ణయంగానే చూడాలి. అయితే పొత్తులు లేవు లేవు.. అని బీఆర్ఎస్, బీజేపీలు పదే పదే చెప్పుకుంటున్నా.. రాజకీయ ముఖచిత్రం ఆ రెండు పార్టీలు కలిసిపోతే తప్ప అధికారం దక్కదు అనే సంకేతాలే ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయి ఇప్పటికీ.
అయితే పైకి మాత్రం బెట్టును ప్రదర్శిస్తున్నా.. ఎవరి ప్రాక్టికల్ అంచనాల్లో వారున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారిక పొత్తులు లేకున్నా.. అంతర్గత ఒప్పందాలతో ఎన్నికలకు పోతాయనే ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా రెండు పార్టీల అడుగులు, మాటలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీలో మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఇండీ కూటమి పోరాడుతుంటే..జెన్ జీలు కదం తొక్కుతుంటే.. బీఆర్ఎస్ మాత్రం తేలుకుట్టిన దొంగలాగే ఉండిపోయిందనే అపవాదును మూటగట్టకుంటున్నది. కేటీఆర్ దీనిపై బాహాటంగా ప్రకటన చేయడం లేదు. ఇతర నేతలు కూడా మోడీ సర్కార్‌ను విమర్శించడం లేదు.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా అంశంపై స్పందించడం లేదు.
పైగా ఢిల్లీలో జరిగే ఆందోళనలకు తెలంగాణ సర్కార్ కట్టకట్టుకుని మరీ తరలి వెళ్లడాన్ని విమర్శిస్తోంది బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకత్వం. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల పొత్తు పొడుపుకు ఇదే నాంది అని అనుకుంటున్నారు కూడా. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌పై ఫోకస్ పెట్టాయి ఈ రెండు పార్టీలు. ఈ స్థానాన్ని గెలుచుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గం పాలమూరు ఉండటం.. కీలకమైన గ్రేటర్ పరిధి కూడా ఇందులోనే ఉండటం, రానున్న జీహెచ్ఎంసీకి ఇది ట్రయల్ రన్‌గా జనం భావించే చాన్సు ఉంటడంతో కాంగ్రెస్ దీనిపై సీరియస్‌గా ఉంది.
అయితే, ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోవడం వల్ల రేవంత్ ఆయువు పట్టుమీద కొట్టినట్టవుతుందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. రెండు వేర్వేరుగా బలంగా ఎన్నికలకు పోతే, అది కాంగ్రెస్ కే లాభం చేకూర్చేలా అవుతుందని వీరికి తెలుసు. అందుకే బీసీ మంత్రాన్ని బీఆరెస్ ఇక్కడ ప్రయోగిస్తోంది. ఎవరో ఒక డమ్మీ బీసీని నిలబెట్టి.. పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహరించాలనే వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభధ్రుల నియోజకవర్గం నుంచి రాకేశ్ రెడ్డికి అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. ఇక్కడ గట్టి పట్టున్న రాకేశ్ గెలుపుకు బీజేపీ కూడా సహకరించాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకలా మాత్రం కచ్చితంగా ఉండబోదనే సంకేతాలు ఇప్పట్నుంచే ఇస్తున్నాయి ఈ రెండ పార్టీలు.
ఇంతకు ముందు హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి రాంచంద్రారావు గెలిచాడు. ఇక్కడ పట్టభద్రుల్లో బీజేపీకి పట్టుంది. గత చరిత్ర కూడా బీజేపీ అనుకూల సంకేతాలనే చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ స్టేట్ చీఫ్ కే మళ్లీ అవకాశం ఇవ్వడం మూలంగా, రహస్య మిత్రుడి సహకారంతో గెలుపు తీరాలకు ఈజీగా చేరొచ్చనే అంచనాలో ఉంది బీజేపీ అధిష్టానం.
ఇక్కడ మేము.. అక్కడ మీరు.. ఇద్దరం కలిసి కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యం..! అన్నట్టుగా వ్యూహాల రచనల్లో తలమునకలై ఉన్నాయీ పార్టీలు.