AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిగ్‌గా మారాయి.. త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని ఏబీవీ ప్రకటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేసి, వైసీపీ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారాయన.. జీతం లేకుండా, ఐదేళ్ల పాటు కేసులపై ఒంటరి పోరాటం చేశారు.. కూటమి సర్కారు ఆయన కార్పొరేషన్ పదవి ఇచ్చినా స్వీకరించలేదు. టీడీపీ ముద్ర ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లో వస్తానని ప్రకటించడంపై తెలుగు తమ్ముళ్లలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఆయన రాజకీయం పయనం ఎటు?
రాజకీయ రంగ ప్రవేశంపై ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటన
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన రాజకీయరంగ ప్రవేశంపై చేసిన ప్రకటన ఇటు రాజకీయవర్గాల్లో, అటు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసు డిపార్టుమెంట్లో ఏబీవీ ఎదుర్కొన్నన్ని కక్ష సాధింపు చర్యలు ఎవరూ ఎదుర్కోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ సీఎం పీఠం ఎక్కగానే ఏబీవీని టార్గెట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీవీ అభియోగాలు, సస్పెన్షన్లతో ఇబ్బందిపడ్డారు.
సస్పెన్షన్ కాలాన్ని సర్వీసు పీరియడ్‌గా గుర్తించిన కూటమి ప్రభుత్వం
వెంకటేశ్వరరావు 2020 ఫిబ్రవరి 8 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు.. మళ్లీ 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు నాలుగేళ్లపాటు సస్పెన్షన్‌లో ఉన్నారు. తర్వాత ఆ కాలాన్ని కూటమి ప్రభుత్వం సర్వీస్ పీరియడ్‌గా క్రమబద్ధీకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు నాలుగేళ్ల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కాలంలో ఏబీవీకి చెల్లించాల్సిన వేతనాన్ని, అలవెన్సులకు సంబంధించి బకాయిలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విధులు
2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీవీని పోస్టింగ్ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్‌పై ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని కోర్టుకు వివరించారు.
2022లో సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆదేశించిన కోర్టు
2022లో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు ఆదేశించగా.. ఆయన్ను ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా నియమించారు. మళ్లీ 2022 జూన్ 28న రెండోసారి కూడా సస్పెండ్ చేసింది అప్పటి ప్రభుత్వం. ఆ వెంటనే ఆయన తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించగా.. అక్కడ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయన పదవీ విరమణకు ముందు రోజు జగన్ ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. కొన్ని గంటలోనే ఆయన రిటైర్ అయ్యారు.
ఏబీపై అభియోగాలకు సంబంధించి చర్యలన్నీ ఉపసంహరణ
గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవం లేదని కూటమి ప్రభుత్వ విచారణలో తేల్చింది. ఆయనపై ఆరోపణలు వచ్చినట్లుగా.. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి భద్రత పరికరాల కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని గుర్తించారు. ఆ మేరకు ఆయనపై అభియోగాలకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తర్వాత ఆయన సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్సొరేషన్ ఛైర్మన్‌గా నియామకం
ఆ క్రమంలో ఏపీ సర్కారు అధికారంలోకి రాగానే రిటైర్ట్ ఐపీస్ ఏబీవీని ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించింది. అయితే గత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై రగిలిపోతున్న ఏవీబీ ఇంతవరకు ఆ బాధ్యతలు స్వీకరించలేదు. కూటమి ప్రభుత్వంలో మరింత ఉన్నతమైన పదవిని ఆయన ఆశించారన్న ప్రచారం జరిగింది.
అన్నింటికీ కులాలను ఆపాదించారని జగన్‌పై ఆరోపణలు
రిటైర్ అయ్యాక ఆయన జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జగన్ కరోనాని .. ‘కమ్మ’రోనా అంటూ అన్నిటికీ కులాలను ఆపాదించారని ఆరోపణలు గుప్పించారు. సీఎం కూర్చీ కోడుకి కూడా సరితూగని తుచ్ఛుడు ఆ సీటులో కూర్చున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ హాయాంలో సర్వీసు పరంగా విపరీతమైన వేధింపులు, తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న ఏబీవీ తన రాజకీయ ప్రస్థానంలో జగన్ భాధితులను పరామర్శించడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. జగన్ కారణంగా తీవ్ర వేధింపులకు గురై దీర్ఘకాలం జైలు జీవితం అనుభవించిన కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. ఇలాంటి తరుణంలోనే రాజకీయ అరంగ్రేటం చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది
ఎమ్మెల్యేల పార్టీ మార్పు వెనుక ఏబీ హస్తం ఉందని వైసీపీ ఆరోపణలు
ఏబీ ప్రకటనతో ఆయన టీడీపీతో కలిసి నడుస్తారా? లేదా? అనే చర్చ తెలుగు తమ్ముళ్లులో మొదలైందట. ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం ఉంది. అప్పట్లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం వెనక ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఏబీ పాత్ర ఉందని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపణ చేస్తుంటారు. అందుకే వైసీపీ అధికారంలోకి రాగానే ఏబీపై చర్యలు తీసుకుని… ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఏబీ కూడా టీడీపీ ప్రస్తావన తీసుకురాకపోయినా…. పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం ఉంది..
Also Read: వక్ఫ్ బిల్లుపై మళ్లీ ఘర్షణలు.. అల్లర్ల వెనుక బంగ్లాదేశ్ స్కెచ్!
ఉండవల్లి నివాసంతో చంద్రబాబుతో భేటీలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన చంద్రబాబును కలవడం, ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులపాటు రెగ్యూలర్‌గా ఉండవల్లి నివాసంలో భేటీ అవ్వడాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఏబీ ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు ఏబీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ ఐదేళ్ల పాలల్లో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదని, జగన్ అనే భూతం రాష్ట్రాన్ని ఇప్పటికీ వెంటాడుతోంది. దాన్ని శాశ్వతంగా వదిలించుకోవాలని ఆ రిటైర్డ్ ఐపీఎస్ అంటున్నారు. జగన్ నెవర్ అగైన్.. అనే నినాదం ఎత్తుకున్నారు.
ఎవరికీ అంతుపట్టి ఏబీ వెంకటేశ్వరరావు అజెండా
ఏపీలో జగన్ బాధితులను అందరిని కలుస్తానంటున్నారు ఏబీ.. దాంతో ఏబీ ఏం చేయబోతున్నారన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఓ వైపు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడం, మరోవైపు టీడీపీ ఇచ్చిన పదవి తీసుకోవడం,ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో ఏబీ ఎజెండా ఏంటనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఏబీని వైసీపీ ఎప్పటికి శత్రువుగానే చూస్తుంది. ఆయనకు కూడా జగన్‌తో పాటు వైసీపీపై అంతే ద్వేషంతో ఉన్నారు. మరోవైపు పదవి విషయంలో టీడీపీతో గ్యాప్ వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏబీ రాజకీయ అడుగులు ఎటువైపు అనేది అసక్తి రేపుతోంది..